రాష్ట్ర పురోభివృద్ధికి మార్గం సుగమం

శాసన మండలికి ఇటీవల ఎన్నికైన సభ్యుల్లో 10 మందితో మండలి ఛైర్మన్‌ మోసేను రాజు బుధవారం ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు...

Updated : 09 Dec 2021 04:19 IST
రెండు సభల్లోనూ పూర్తి మెజారిటీ పొందాం: సజ్జల
అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్సీల  ప్రమాణ స్వీకార సభ
10మంది ఎమ్మెల్సీలతో ప్రమాణం చేయించిన ఛైర్మన్‌ మోసేను రాజు
 
ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్న మండలి ఛైర్మన్‌ మోసేను రాజు. చిత్రంలో మంత్రులు పెద్దిరెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌

ఈనాడు, అమరావతి: శాసన మండలికి ఇటీవల ఎన్నికైన సభ్యుల్లో 10 మందితో మండలి ఛైర్మన్‌ మోసేను రాజు బుధవారం ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. ‘ఇప్పుడు రెండు సభల్లో పూర్తి మెజారిటీ పొందాం. మన మేనిఫెస్టోలో ఏమి చెప్పామో అలాగే.. రాష్ట్ర పురోభివృద్ధి లక్ష్య సాధనకు ఏం చేయాలనుకుంటున్నామో ఆ ఎజెండాను సునాయాసంగా ముందుకు తీసుకువెళ్లేందుకు మార్గం సుగమమైంది’ అని సజ్జల అన్నారు. ‘సంక్షేమం ద్వారా అభివృద్ధి అనే కొత్త నినాదంతో రాష్ట్రంలో నూతన ఒరవడిని తీసుకువస్తూ ముఖ్యమంత్రి జగన్‌ పాలన సాగిస్తుంటే.. శాసన మండలిలో సాంకేతికంగా తెదేపాకు ఉన్న మంద బలంతో ఇబ్బందులు సృష్టించారు. అభివృద్ధి, సంస్కరణలకు సంబంధించిన చట్టాలు, సవరణలకు అడ్డుతగిలారు’ అని విమర్శించారు. ‘పేదలందరికీ సొంతింటి సౌకర్యం కల్పిస్తుంటే కోర్టు ద్వారా చంద్రబాబు అడ్డుపడ్డారు. ఇప్పుడు 50లక్షల కుటుంబాలకు శాశ్వత గృహ హక్కు కల్పించేందుకు ఓటీఎస్‌ను ప్రభుత్వం తీసుకువస్తే దానిపైనా విషం చిమ్ముతున్నారు’ అని విమర్శించారు.

రూ. వందల కోట్లు ఎక్కడ నుంచి వస్తున్నాయి?

అమరావతి పాదయాత్రపై సజ్జల మాట్లాడుతూ..‘అమరావతి యాత్రకు జనం నీరాజనం పడుతున్నారట..దానికి అర్థం ఉందా? అన్నీ మాకే కావాలంటూ ఒక ప్రాంతం నుంచి వెళితే వారిని వేరే ప్రాంతంలో ఎందుకు ఆదరిస్తారు. ఆ యాత్రకు రూ.వందల కోట్లు ఎక్కడ నుంచి వసూలవుతున్నాయి? అందులో తెదేపా వారు తప్ప వేరెవరైనా ఉన్నారా? ఏదో రకంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించి లబ్ధి పొందాలనేదే చంద్రబాబు కుట్ర’ అని ఆరోపించారు.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ‘మోసేను రాజు ఛైర్మన్‌ అయినప్పుడు జగన్‌ మండలికి వచ్చి ఆయనను అభినందించి వెళ్లారు తప్ప, చంద్రబాబులాగా వ్యవహరించలేదు. చంద్రబాబు శాసన మండలిని వేదికగా చేసుకొని ప్రభుత్వాన్ని కూలదోసేలా వ్యవహరించాలని ప్రయత్నించారు’ అని విమర్శించారు. మంత్రులు మేకతోటి సుచరిత, సురేష్‌ శంకర నారాయణ కూడా మాట్లాడారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ పాల్గొన్నారు.


కార్యక్రమంలో మాట్లాడుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి

ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గాల నుంచి ఇటీవల ఎన్నికైన 11మంది ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి అసెంబ్లీ ఆవరణలో ప్రత్యేక వేదిక ఏర్పాటు చేశారు. ఈ వేదికపైన శాసనమండలి ఛైర్మన్‌ కొయ్యే మోసేను రాజు 8మంది ఎమ్మెల్సీలతో ప్రమాణం చేయించారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మురుగుడు హనుమంతరావు, ఇందుకూరి రఘురాజు, చెన్నుబోయిన శ్రీనివాసరావు(వంశీకృష్ణ యాదవ్‌), వరుదు కళ్యాణి, కృష్ణ రాఘవ జయేంద్రభరత్‌, ఎల్లారెడ్డిగారి శివరామిరెడ్డి, తూమాటి మాధవరావులతో ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం మరో ఇద్దరు ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, మొండితోక అరుణ్‌కుమార్‌లు మండలి ఛైర్మన్‌ కార్యాలయంలో ప్రమాణం చేశారు. తూర్పుగోదావరి నుంచి ఎన్నికైన ఉదయ భాస్కర్‌ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని