ముందు మిగులు నీటిని తేల్చండి

‘‘గోదావరిలో మిగులు జలాలు ఎన్ని ఉన్నాయో ముందు తేల్చండి. దీనిపై కేంద్ర జలసంఘం, జాతీయ జల అభివృద్ధి సంస్థ, వ్యాప్కోస్‌లు విభిన్న లెక్కలు చెబుతున్నాయి. మిగులును స్పష్టంగా తేల్చాకే గోదావరి-కావేరి అనుసంధానంపై ఆలోచిద్దాం’’ అని ఆంధ్రప్రదేశ్‌ విస్పష్టం చేసింది. ‘‘ఈ అనుసంధానంపై మాకు అనేక అభ్యంతరాలున్నాయి.

Published : 20 Jan 2022 03:44 IST

ఆ తర్వాతే గోదావరి-కావేరి  అనుసంధానంపై ఆలోచిద్దాం
జాతీయ జల అభివృద్ధి సంస్థ సమావేశంలో ఏపీ స్పష్టీకరణ

ఈనాడు-అమరావతి: ‘‘గోదావరిలో మిగులు జలాలు ఎన్ని ఉన్నాయో ముందు తేల్చండి. దీనిపై కేంద్ర జలసంఘం, జాతీయ జల అభివృద్ధి సంస్థ, వ్యాప్కోస్‌లు విభిన్న లెక్కలు చెబుతున్నాయి. మిగులును స్పష్టంగా తేల్చాకే గోదావరి-కావేరి అనుసంధానంపై ఆలోచిద్దాం’’ అని ఆంధ్రప్రదేశ్‌ విస్పష్టం చేసింది. ‘‘ఈ అనుసంధానంపై మాకు అనేక అభ్యంతరాలున్నాయి. ఇప్పటికే  ఎన్‌డబ్ల్యూడీఏ ఖరారు చేసిన డీపీఆర్‌పై మా సందేహాలను తెలియజేశాం. మళ్లీ వాటిపై స్పందించి మరిన్ని అంశాలను ప్రస్తావించారు. వాటిపైనా మా అభిప్రాయాలను త్వరలో తెలియజేస్తాం’’ అని పేర్కొంది. బుధవారం వర్చువల్‌ విధానంలో జరిగిన ఎన్‌డబ్ల్యూడీఏ సాధారణ సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ఎస్‌.జవహర్‌రెడ్డి, ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ సి.నారాయణరెడ్డి పాల్గొన్నారు. కేంద్ర జలవనరులశాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో మొదట డైరెక్టర్‌ జనరల్‌ భూపేంద్రసింగ్‌ అనుసంధానంపై తాజా పరిస్థితిని వివరించారు. అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను విని, పరిగణనలోకి తీసుకుని, అవసరమైన మార్పులను చేయాలని పంకజ్‌కుమార్‌ సూచించారు. త్వరలో నేరుగా దీనిపై భాగస్వామ్య రాష్ట్రాలతో సమావేశం నిర్వహించాలని పేర్కొన్నారు. తెలంగాణ నుంచి ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌, ఇతర అన్ని రాష్ట్రాల జలవనరులశాఖ ఉన్నతాధికారులు పాల్గొని తమ అభిప్రాయాలను తెలియజేశారు.

* ఆంధ్రప్రదేశ్‌: పోలవరం, కాళేశ్వరం ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చే సమయంలో, మిగిలిన వివిధ సందర్భాల్లో మిగులు జలాలపై విభిన్న లెక్కలు చెప్పారు. తొలుత మా భవిష్యత్తు ప్రాజెక్టులను సైతం పరిగణనలోకి తీసుకుని లెక్కించాలి. వాటిని కలిపితే మిగులు జలాలు ఉండబోవనేది మా లెక్క.
* తెలంగాణ: మొదట హైడ్రాలజీ తేల్చాలి. ఎంత నీరుందో, ఎక్కడ ఎంత లభ్యత ఉందో చూడాలి. గోదావరి-కావేరి అనుసంధానం డీపీఆర్‌లో ఈ హైడ్రాలజీపైనే మొదట చర్చించాలి.
* తమిళనాడు: రికార్డు సమయంలో డీపీఆర్‌ను సిద్ధం చేసి, ఖరారు చేశారు. ఈ ప్రాజెక్టును వెంటనే చేపట్టాలి. ముందుగా అన్ని భాగస్వామ్య రాష్ట్రాలతో సమావేశం ఏర్పాటు చేయాలి. ఈ విషయమై ఇప్పటికే డైరెక్టర్‌ జనరల్‌ను కూడా కలిసి విన్నవించాం.
* కర్ణాటక: కావేరి, కృష్ణా డెల్టాల కింద మాకు ఇంకా కరవు ప్రాంతాలు ఉన్నాయి. ఈ పరిస్థితిలో గోదావరి మిగులు జలాల్లో మాకు ఎంత ఇస్తున్నారో మొదట తేల్చాలి. ఇతర నదుల అనుసంధానంలో భాగంగా కృష్ణాకు తీసుకువచ్చే నీటిలో ఎగువ రాష్ట్రాలకు వాటా ఇవ్వాలని బచావత్‌ ట్రైబ్యునల్‌ పేర్కొంది. అందుకే మాకెన్ని నీళ్లు రానున్నాయో తేల్చాకే డీపీఆర్‌ను ఖరారు చేయాలి.
* పాండిచ్చేరి: కావేరి ట్రైబ్యునల్‌ సమయంలో మాకు అన్యాయం జరిగింది. మా నీటి వాటాలో కోత పెట్టారు. మా డిమాండ్‌ను పట్టించుకోలేదు. గోదావరి-కావేరి అనుసంధానంతో కావేరిలో అదనంగా వచ్చే నీటిలో మాకు వాటా ఇవ్వాలి. ఈ అనుసంధానంలో భాగస్వామ్య రాష్ట్రాల్లో మమ్మల్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు. సమావేశాలకు మమ్మల్ని కూడా పిలవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని