విస్తరణ తర్వాత బలహీనపడ్డ జగన్‌

రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ తర్వాత ఎదురైన అనుభవాలతో ముఖ్యమంత్రి జగన్‌ అత్యంత బలహీనుడిగా మారారని తెదేపా సీనియర్‌ నేత, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. గురువారం తెదేపా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో

Published : 15 Apr 2022 05:05 IST

విశాఖను రాజధాని అని చెబుతున్న జిల్లాకు మంత్రి లేరు

త్వరలో తెదేపాలోకి పలువురు నాయకులు

ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యలు

విశాఖపట్నం (వన్‌టౌన్‌), న్యూస్‌టుడే: రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ తర్వాత ఎదురైన అనుభవాలతో ముఖ్యమంత్రి జగన్‌ అత్యంత బలహీనుడిగా మారారని తెదేపా సీనియర్‌ నేత, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. గురువారం తెదేపా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. రానున్న రోజుల్లో పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పెద్ద నాయకులు తెదేపాలోకి రాబోతున్నారని ఆయన జోస్యం చెప్పారు. తెదేపా అగ్రనేతలు పాదయాత్ర చేయాలా! ప్రజా యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లాలా!! అని ఆలోచన చేస్తున్నారని వెల్లడించారు.

పార్టీ వర్గాల నుంచీ జగన్‌కు వ్యతిరేకత

అనకాపల్లి, గుంటూరు, విజయవాడ, ప్రకాశం వంటి పలు జిల్లాల్లో పదవులు రాని నేతలు తీవ్ర అసంతృప్తులు వ్యక్తం చేశారని, రోడ్లపై టైర్లు అంటించారని గంటా పేర్కొన్నారు. తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం చేయడం, రాజీనామాల బెదిరింపులు, రాత్రి వేళ ఆందోళనలకు దిగడం తన పాతికేళ్ల రాజకీయ అనుభవంలో ఎన్నడూ చూడలేదని చెప్పారు. పార్టీ వర్గాల నుంచీ జగన్‌కు వ్యతిరేకత వస్తోందన్నారు. రాష్ట్రంలో 8 జిల్లాల్లో మంత్రులు లేకుండా మంత్రివర్గ కూర్పు చేశారని, గతంలో చంద్రబాబు సీఎంగా ఉండగా మంత్రివర్గ విస్తరణలో ఒకరిద్దరు సీనియర్‌ నేతలు అసంతృప్తి వ్యక్తం చేసినా ఇంత తీవ్రస్థాయిలో లేదని ఆయన గుర్తు చేశారు. ‘వైసీపీ నాయకులే నిరసనలకు దిగే విధంగా విస్తరణ ఉంది. విశాఖను రాజధాని అని చెబుతున్న జిల్లాకు మంత్రి లేకుండా చేశారు. విస్తరణలో ప్రాంతాలకు హేతుబద్ధత లేదు. వైకాపా ప్రభుత్వం బీసీలకు ప్రాధాన్యమిచ్చామని చెబుతున్నా దానిలో వాస్తవం లేదు. అధికారం లేని పదవులు ఎందుకు...’ అని ఆయన ప్రశ్నించారు. జిల్లాల విభజన సరిగ్గా జరగలేదని, పునర్విభజన సమయంలో వైకాపా నేతలు సీఎం తీరుతో చెప్పులతో కొట్టుకున్నారని పేర్కొన్నారు. విద్యా శాఖపై సీఎం నిర్వహించిన సమీక్షకు విద్యా మంత్రి హాజరుకాక పోవడమేమిటని గంటా ప్రశ్నించారు. తెదేపా పాలనలో విద్యా సంవత్సర నిర్వహణకు ఒక క్యాలెండర్‌ను రూపొందించి పక్కాగా పరీక్షల నిర్వహణ చేపట్టామని, ప్రస్తుతం అటువంటిదేమీ లేదని చెప్పారు. నాడు-నేడు అంటున్నారని, గతంలోనే తమ పార్టీ ప్రభుత్వం పాఠశాలల నవీకరణ ప్రక్రియను ప్రారంభించిందని ఆయన గుర్తు చేశారు. వైకాపా ప్రభుత్వం విద్యా వ్యవస్థను అస్తవ్యస్తం చేసిందని, రకరకాల పేర్లతో పాఠశాలల నిర్వహణ దారుణమన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని