logo

జగన్‌ ఇష్టారాజ్య చట్టం.. ఆస్తి కాపాడుకోవడం కష్టం

ఏపీ భూ యాజమాన్య హక్కుల చట్టం(ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌-2023)పై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ చట్టం అమలులోకి వస్తే భూమి పై హక్కు కోల్పోతామనే భయం అన్ని వర్గాలను వెంటాడుతోంది.

Updated : 09 May 2024 09:11 IST

న్యూస్‌టుడే, మసీదుసెంటర్‌(కాకినాడ):  ఏపీ భూ యాజమాన్య హక్కుల చట్టం (ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌-2023)పై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ చట్టం అమలులోకి వస్తే భూమి పై హక్కు కోల్పోతామనే భయం అన్ని వర్గాలను వెంటాడుతోంది. కోర్టులకు అధికారం తీసేసి ప్రభుత్వం నియమించిన టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి(టీఆర్వో)కి సర్వాధికారాలు ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీఆర్వో అధికారంలో ఉన్న నాయకుల ఒత్తిడికి తలొగ్గితే వాస్తవ హక్కుదారులకు ఎంతో నష్టం జరుగుతుంది. ఈ చట్టం ప్రకారం స్థిరాస్థులను కాపాడుకోవడం అంత సులువు కాదని న్యాయవాదులు, మేధావులు హెచ్చరిస్తున్నారు. దీనిపై ఇప్పటికే న్యాయవాదులు సుదీర్ఘ పోరాటం చేశారు.


అశాంతి, అభద్రత పెరుగుతుంది..
-కంబాల శ్రీధర్‌, సీనియర్‌ న్యాయవాది, బార్‌ అసోసియేషన్‌ మాజీ కార్యదర్శి, కాకినాడ

ఆ చట్టం ప్రజల ఆస్తిహక్కును హరించేటట్లు ఉంది. పారదర్శకత లేదు. వివాదం తలెత్తినప్పుడు  సివిల్‌ కోర్డులో కేసులు దాఖలు చేసే అవకాశం ఉండదు. ప్రజలంతా దీనిపై అవగాహన పెంచుకుని అప్రమత్తంగా ఉండాలి. ఇటువంటి చీకటి చట్టం వల్ల ప్రజల్లో అశాంతి, అభద్రతాభావం పెరుగుపోతుంది.


ఈ చట్టంతో ఎవరికి మేలో చెప్పాలి..
- కొటికలపూడి సత్యశ్రీనివాసరావు, బార్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షులు

ప్రజల అభిప్రాయాలను సేకరించకుండా ఇలాంటి చట్టం చేయడం సరికాదు. ఈ చట్టం వల్ల ఎవరికి లబ్ధి చేకూరుతుందో చెప్పాలి. స్థానిక సివిల్‌ కోర్టులకు అధికారం తీసేసి హైకోర్టుకు మాత్రమే వెళ్లమనడం ఎంత వరకు న్యాయం. చాలామంది బాధితులు హైకోర్టుకు వెళ్లలేని పరిస్థితిలో ఉంటారు. టీఆర్‌వోలను రాష్ట్ర ప్రభుత్వమే నియమిస్తుంది. వీరు అధికారంలో ఉన్నవారికి  అనుకూలంగా పని చేసే అవకాశం ఉంది. దీంతో పలుకుబడి ఉన్నవారు భూములు కాజేసే వీలుంటుంది. అసెంబ్లీలో సైతం ఈ చట్టంపై చర్చించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రజలు తమ భూములపై హక్కులను కోల్పోతారు.


అనుమతులకు క్యూ కట్టాల్సిందే..
-ఏవీసీహెచ్‌ఎన్‌ఎన్‌ మూర్తి,  సీనియర్‌ న్యాయవాది, కాకినాడ

ఈ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించి, అభ్యంతరాలు తెలుసుకున్న తర్వాతే తీసుకురావాలి. అలా చేయకుండా రాత్రి రాత్రికే తీసుకురావడంతో చీకటి చట్టంగా మిగిలింది. కొనుగోలు చేయాలన్నా, అమ్మాలన్నా, టీఆర్‌వోల వద్ద అనుమతుల కోసం క్యూ కట్టాల్సిందే. ఈ చట్టాన్ని రద్దుచేయాలని ఇప్పటికే సుదీర్ఘకాలం పోరాటాలు చేశాం. భవిష్యత్తులోనూ చేస్తాం. ఇది సరైన చట్టం కాదు. న్యాయస్థానాలకు ఉన్న అధికారం తీసివేసే అధికారం ప్రభుత్వానికి లేదు.


ప్రాథమిక హక్కులను కాలరాయడమే..
-బొగ్గవరపు గోకులకృష్ణ,  స్టేట్‌ బార్‌ కౌన్సిల్‌ మాజీ సభ్యులు

ఈ చట్టం ప్రజాభిప్రాయానికి వ్యతిరేకం. రాజ్యాంగం కల్పించిన హక్కులను భక్షించే విధంగా ఉంది. ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారు. దీనిని రెవెన్యూ అధికారుల చేతుల్లో పెట్టడం వల్ల ప్రభుత్వానికి అవసరమైన అనుమతులు వస్తాయి తప్ప, ప్రజలకు ఒరిగేదేమీ ఉండదు. టీఆర్‌వోకు అఫిలేట్‌ అథారిటీ ఇవ్వడం సరికాదు. ఈ చట్టం అమల్లోకి వస్తే మరికొన్ని యాక్ట్‌లు కనుమరుగైపోతాయి. ప్రజల ఆస్తులకు రక్షణ కొరవడుతుంది.


వ్యవస్థలను భ్రష్టుపట్టించేందుకే తెచ్చారు
-జి.మోహన్‌మురళి, సీనియర్‌ న్యాయవాది, కాకినాడ

ఈ చట్టంతో ప్రజలు వారికి తెలియకుండానే ఆస్తులపై హక్కులు కోల్పోతారు. న్యాయ, రెవెన్యూ, పోలీసు వ్యవస్థలు సమర్థంగా పనిచేస్తున్న సందర్భంలోనూ సివిల్‌ కేసులు నానాటీకీ పెరుగుతున్నాయి. ఈ వ్యవస్థలను మూసేసి ఆస్తులకు సంబంధించిన సర్వాధికారాలు కేవలం టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌(టీఆర్‌వో) చేతిలో పెట్టడం సరికాదు. వాళ్లపై స్థానిక రాజకీయనాయకులు అజమాయిషీ చలాయించేలా చేసి వ్యవస్థను భ్రష్టు పట్టించడానికి ఉద్దేశించిన చట్టమే ఇది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని