icon icon icon
icon icon icon

వైకాపాపై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది

రాష్ట్ర ప్రజల్లో వైకాపా ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఎన్డీయే ప్రభుత్వంపై ప్రజలు నమ్మకంతో ఉన్నారని, ఏపీలో కూటమి అభ్యర్థుల విజయం తథ్యమని అభిప్రాయపడ్డారు.

Published : 09 May 2024 06:14 IST

ఎన్డీయేపై ప్రజలు నమ్మకంతో ఉన్నారు
ఏపీలో మన గెలుపు ఖాయం
చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లతో ప్రధాని మోదీ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్ర ప్రజల్లో వైకాపా ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఎన్డీయే ప్రభుత్వంపై ప్రజలు నమ్మకంతో ఉన్నారని, ఏపీలో కూటమి అభ్యర్థుల విజయం తథ్యమని అభిప్రాయపడ్డారు. మహిళలు, యువత మద్దతు మూడు పార్టీలకు పుష్కలంగా ఉందన్నారు. విజయవాడ రోడ్‌షో అనంతరం తెదేపా అధినేత చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లతో ఆయన పది నిమిషాల పాటు భేటీ అయ్యారు. రాష్ట్రంలో తన రెండురోజుల పర్యటనపై సంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘ఇక్కడ ఎండ వేడిమి తీవ్రంగా ఉంది. ఆ ప్రభావం పోలింగ్‌పై పడకుండా చూడాలి. పోలింగ్‌ రోజు ఉదయం 7 గంటల నుంచి 10 గంటల లోపే ఎక్కువమంది తమ ఓటుహక్కును వినియోగించుకునేలా చూడాలి. పోలింగ్‌ శాతం ఎంత పెరిగితే ఎన్డీయేకు అంత లాభం’’ అని వారికి మోదీ సూచించారు. తనను ఆదరించిన ఏపీ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఎన్డీయే ర్యాలీ చరిత్ర సృష్టించింది: చంద్రబాబు

విజయవాడలో జరిగిన ప్రధాని మోదీ రోడ్‌ షోకు ప్రజల నుంచి వచ్చిన భారీ స్పందనతో తాను సంభ్రమాశ్చర్యాలకు గురయ్యానని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ ఎన్డీయే ర్యాలీ చరిత్ర సృష్టించిందని ఎక్స్‌లో బుధవారం పోస్టు చేశారు. ‘‘మాపై ప్రజలు కురిపించిన ప్రేమాభిమానాలతో ఎన్నికల ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయనే నమ్మకం ఏర్పడింది. జూన్‌ 4న ఆంధ్రప్రదేశ్‌లో మూడు పార్టీల కలయికతో కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది’’ అని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ‘‘మోదీ తలపెట్టిన వికసిత భారత్‌ కోసం నిర్విరామంగా కృషిచేస్తున్నాం. రాష్ట్రంలో ప్రధాని పర్యటన విలువైనది. ఈ జ్ఞాపకాలు ఎప్పటికీ పదిలంగా ఉంటాయి’’ అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఎక్స్‌లో పోస్టు చేశారు.

కూటమికే రాష్ట్రప్రజల మద్దతు ఎక్స్‌లో ప్రధాని నరేంద్రమోదీ

ఈనాడు, అమరావతి: ‘‘ప్రస్తుత ఎన్నికల్లో ఏపీ ప్రజలు ఎన్డీయేకు మద్దతుగా ఓటు వేయబోతున్నారని నేను నమ్ముతున్నా. ఈ విషయం గత కొన్ని రోజులుగా రాష్ట్రం అంతటా చేసిన పర్యటనలో నాకు అర్థమైంది. మహిళలు, యువ ఓటర్లు ఎన్డీయేకు మద్దతుగా ఉన్నారు. తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో కలిసి విజయవాడలో బుధవారం నిర్వహించిన రోడ్‌ షో చిరస్మరణీయంగా మిగిలిపోతుంది’’ అని ప్రధాని నరేంద్రమోదీ ఎక్స్‌లో పేర్కొన్నారు. విజయవాడ రోడ్‌షో ఫొటోలను ట్యాగ్‌ చేశారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌తో కలిసి ఒకే వాహనం నుంచి ప్రజలకు అభివాదం చేస్తున్న ఫొటోతో పాటు, సెల్‌ఫోన్‌లో ఫొటోలు తీస్తున్న యువత.. మాది మోదీ కుటుంబం అంటూ ఫ్లెక్సీలు ప్రదర్శిస్తున్న మహిళలు.. రెపరెపలాడుతున్న తెదేపా జెండా ఉన్న ఫొటోలు ఆయన ట్యాగ్‌ చేసిన వాటిలో ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img