ఇజ్రాయెల్‌కు అమెరికా షాక్‌

దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్‌ దాడి చేయడం ఖాయమన్న సంకేతాలు వెలువడుతుండటంతో అమెరికా కన్నెర్ర చేసింది. ఇజ్రాయెల్‌కు సరఫరా చేయాల్సిన ఆయుధాలను తాత్కాలికంగా నిలిపివేసింది. F

Updated : 09 May 2024 06:10 IST

భారీ బాంబుల సరఫరా నిలిపివేత
రఫాపై దాడిని నిరోధించేందుకే..!
గత వారమే ఈ నిర్ణయం తీసుకున్న అగ్రరాజ్యం

వాషింగ్టన్‌: దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్‌ దాడి చేయడం ఖాయమన్న సంకేతాలు వెలువడుతుండటంతో అమెరికా కన్నెర్ర చేసింది. ఇజ్రాయెల్‌కు సరఫరా చేయాల్సిన ఆయుధాలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఇందులో 2000 పౌండ్ల బరువైన 1800, 500 పౌండ్ల బరువైన 1700 బాంబులు ఉన్నాయి. భారీ స్థాయిలో విధ్వంసం సృష్టించే ఈ బాంబులను సరఫరా చేస్తే రఫాపై ఇజ్రాయెల్‌ విరుచుకుపడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే అమెరికా వీటి సరఫరాను ఆపినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ కూడా ధ్రువీకరించారు. తమను తాము రక్షించుకోవడానికి అవసరమైన ఆయుధాలను ఇజ్రాయెల్‌కు సరఫరా చేస్తామని.. అయితే రఫాలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో గత వారం ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. దాదాపు 13 నుంచి 14 లక్షల మంది పాలస్తీనియన్లు రఫాలో తలదాచుకుంటున్నారు. ఈ నగరంపై దాడి చేస్తే భారీ మానవ సంక్షోభం తప్పదని అమెరికా భావిస్తోంది. ఈ విషయాన్ని అనేక సార్లు ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహుకు అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ తెలిపారు. అయినా ఇజ్రాయెల్‌ ఖాతరు చేయడంలేదు. అమెరికా సహా ఎవరూ తమను ఆపలేరని నెతన్యాహు బహిరంగంగానే ప్రకటనలిస్తున్నారు. అమెరికా ఎంతగా నచ్చచెబుతున్నా... రఫాపై వెనక్కి తగ్గేదే లేదంటోంది ఇజ్రాయెల్‌. ఒక వేళ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా.. రఫాలోని హమాస్‌ను నాశనం చేస్తామంటోంది. ఈ నేపథ్యంలో అమెరికా బాంబుల సరఫరా నిలిపివేయడం గమనార్హం. అయితే ఇది అంత పెద్ద విషయం కాదని, అమెరికాతో మాట్లాడుకొని ఈ సమస్యను పరిష్కరించుకుంటామని ఇజ్రాయెల్‌ చెబుతోంది.

కీలక పాస్‌ను తెరిచాం

రఫా తూర్పు ప్రాంతంలో ఈజిప్టు, గాజా మధ్య కీలక కరెమ్‌ షాలూమ్‌ పాస్‌ను తెరిచినట్లు బుధవారం ఇజ్రాయెల్‌ ప్రకటించింది. ఈ మార్గంపై ఆదివారం రాత్రి హమాస్‌ రాకెట్లతో దాడి చేసింది. దీంతో ఈ పాస్‌ను తాత్కాలికంగా ఐడీఎఫ్‌ మూసివేసింది. ఈ మార్గాన్ని తెరిచినా గాజాకు మానవతా సాయం అందడం లేదని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. పాలస్తీనా వైపు ఎవరూ సాయం అందుకోవడానికి లేరని తెలిపింది. అమెరికా యూనివర్సిటీల్లో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. బుధవారం జార్జి వాషింగ్టన్‌ యూనివర్సిటీలోకి ప్రవేశించి గాజా యుద్ధానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న 33 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని