Chandrababu: గొడ్డలి పోటునే గుండెపోటన్నారు.. సారా మరణాలో లెక్కా?

మరణాలను సహజ మరణాలుగా చూపించడం ఓ లెక్కా? కల్తీ సారా తాగి 26 మంది చనిపోతే వారివి సహజ మరణాలంటారా? ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా జంగారెడ్డిగూడెం వచ్చి, నిజాలేంటో తేల్చాలి. ఈ ప్రభుత్వం మరో పాతికేళ్లు ప్రజలతో కోటా పెట్టి మరీ నిర్బంధంగా మద్యం తాగిస్తుంది.

Updated : 15 Mar 2022 07:18 IST

తెదేపా అధినేత చంద్రబాబు విమర్శ
జంగారెడ్డిగూడెంలో బాధితుల కుటుంబాలకు పరామర్శ


 

గొడ్డలి పోటునే గుండెపోటుగా చిత్రీకరించిన వారికి సారా మరణాలను సహజ మరణాలుగా చూపించడం ఓ లెక్కా?కల్తీ సారా తాగి 26 మంది చనిపోతే వారివి సహజ మరణాలంటారా? ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా జంగారెడ్డిగూడెం వచ్చి, నిజాలేంటో తేల్చాలి. ఈ ప్రభుత్వం మరో పాతికేళ్లు ప్రజలతో కోటా పెట్టి మరీ నిర్బంధంగా మద్యం తాగిస్తుంది. ఎందుకంటే మద్యంపై వచ్చే ఆదాయాన్ని చూపించే రూ.25వేల కోట్ల అప్పులు తెచ్చింది. మరో రూ.25వేల కోట్ల రుణాలకు వెళ్తోంది.

- జంగారెడ్డిగూడెంలో చంద్రబాబు


ఈనాడు డిజిటల్‌, ఏలూరు - న్యూస్‌టుడే, జంగారెడ్డిగూడెం: ‘బాబాయి చనిపోయినప్పుడు ఏమన్నారు? ‘నారాసుర రక్త చరిత్ర’ అని వార్తలు రాయించారు. తర్వాత సీబీఐ విచారణ కావాలన్నారు. అధికారంలోకి వచ్చాక సీబీఐ అక్కర్లేదన్నారు. జగన్‌ సోదరి సునీత ఇప్పటికీ తన తండ్రి హత్య కేసులో న్యాయం కోసం పోరాడుతున్నారు. ఆమెకున్న ధైర్యం మనకు లేదా? గొడ్డలి పోటునే గుండెపోటుగా చిత్రీకరించిన వారికి సారా మరణాలను సహజ మరణాలుగా చూపించడం ఓ లెక్కా? కల్తీ సారాతో 26 మంది చనిపోతే సహజ మరణాలంటారా? వీరు మనుషులేనా?’ అని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ఈ మరణాలపై విచారణ జరిగి, బాధ్యులకు శిక్ష పడే వరకు, బాధితులకు న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గేదే లేదని అందరూ ప్రతిన బూనాలని పిలుపునిచ్చారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండు చేశారు. తనవి ప్రజా రాజకీయాలని, జగన్‌ చేసేవే శవ రాజకీయాలని మండిపడ్డారు. సోమవారం పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో పర్యటించిన చంద్రబాబు.. కల్తీ సారా మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. మధ్యాహ్నం బుట్టాయిగూడెం రోడ్డులోని గాంధీ బొమ్మ సెంటర్‌కు చెందిన మృతులు మడిచర్ల అప్పారావు, దేవరశెట్టి చక్రపాణి, బండారు శ్రీనివాసరావు, షేక్‌ సుబానీల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. తమకు ఆదరువు పోయిందని, కల్తీ సారా వల్లే అయిన వారిని కోల్పోయి రోడ్డునపడ్డామని వారంతా వాపోయారు. న్యాయం చేయాలంటూ వినతిపత్రాలిచ్చారు. తమ ప్రభుత్వం వస్తే అప్పారావు కుమారుడు ప్రకాశ్‌కు ఉద్యోగమిస్తానని చంద్రబాబు చెప్పారు. న్యాయం జరిగే వరకు పోరాటం ఆపొద్దని సూచించారు. బాధిత కుటుంబ సభ్యులతో కలిసి పట్టణంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో సమావేశం నిర్వహించారు.

ఇక్కడికి రాకుంటే.. పది లక్షలిస్తారా?
చంద్రబాబు సమావేశానికి వెళ్లకుంటే పది లక్షలు ఇస్తామని అధికారులు మృతుల కుటుంబ సభ్యులను ప్రలోభ పెట్టారని చంద్రబాబు ఆరోపించారు. ‘తాడోపేడో తేల్చుకోవడానికొచ్చా. చెప్పిన అబద్ధాలను, తిన్న డబ్బులను కక్కిస్తా. ఒక్క అవకాశం ఇవ్వాలని అడిగి, ఇలా పేదల జీవితాలతో ఆడుకుంటారా? ఎన్నికల ముందు మద్యపాన నిషేధమన్నారు. సీఎం అయ్యాక రేట్లు పెంచేసి జగన్‌ బ్రాండ్లు తెచ్చారు. ఇదేమంటే మద్యపానాన్ని నియంత్రించేందుకన్నారు. అయినా తాగేవాళ్లు తగ్గలేదు. నాటుసారా తాగి చనిపోతున్నారు. జంగారెడ్డిగూడెంలో నాటుసారా వ్యాపారంలో ఇద్దరు ఎమ్మెల్యేలకు వాటా ఉంది. వారి ధనదాహానికి మనుషుల ప్రాణాలు పోవాలా? వారు నర హంతకులు’ అని దుయ్యబట్టారు. ‘బాధితుల్ని పరామర్శించేందుకు ముఖ్యమంత్రి రారా? మీ కుటుంబంలో ఇలాగే జరిగితే ఊరుకుంటారా? ఫుడ్‌ పాయిజన్‌ అయిందని, అనారోగ్యంతో మరణించారని అంటున్నారు. వీటితో పురుషులే చనిపోతారా? మహిళలు చనిపోరా?’ అని ప్రశ్నించారు.
‘చిల్లర దుకాణాల్లోనూ అంగీకరించే యూపీఐ పేమెంట్లను మద్యం దుకాణాల్లో ఎందుకు అంగీకరించట్లేదు? బిల్లులెందుకు ఇవ్వట్లేదు? ఎందుకంటే.. జగన్‌కు వాటాలు వెళ్లాలి. నాసిరకం బ్రాండ్లన్నీ ఇక్కడ ఉంచి.. పక్క రాష్ట్రాల నుంచి అక్రమ రవాణాతో మద్యం తెచ్చి వైకాపా నాయకులు సొమ్ము చేసుకుంటున్నారు. సారా వ్యాపారం చేస్తున్నారు. ప్రజల ప్రాణాలను హరించి, ఆడవాళ్ల తాళిబొట్లు తెంచే అధికారం మీకెవరిచ్చారు?’ అని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్‌ పెంపుడు కుక్కలు తనపై చేసే విమర్శలకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ‘తెదేపా లేకుంటే ఈ దొంగలు సారా బాధితుల్ని పట్టించుకునేవారా? ఇంకో పది మందిని చంపేసి సహజ మరణాలనేవారు. నేనిక్కడికి దృఢ సంకల్పంతో వచ్చా. కల్తీ సారా పోయేవరకు వదలిపెట్టను’ అని తేల్చి చెప్పారు. ఒకరి చెప్పుచేతల్లో ఉంటూ పనిచేయడానికి మీకు బాధగా లేదా? అని పోలీసులను ప్రశ్నించారు.  

రూ.లక్ష చొప్పున పరిహారం
విశాఖలో ఎల్జీ పాలిమర్స్‌ అనే ప్రైవేటు సంస్థలో ప్రమాదం జరిగి చనిపోతే మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.కోటి చొప్పున పరిహారం ఇచ్చిందని, ఇప్పుడు ప్రభుత్వమే చేసిన హత్యలకు ఎంత ఇస్తుందో చెప్పాలని చంద్రబాబు నిలదీశారు. ‘బాధిత కుటుంబాలకు రూ.లక్ష చొప్పున రూ.26 లక్షలు తెదేపా తరఫున ఇస్తాం. విరాళాలతో కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు చేసి బాధితుల పిల్లలను ఎన్టీఆర్‌ ట్రస్టు తరఫున చదివిస్తాం. ప్రభుత్వం పరిహారం ఇవ్వకుంటే మేం వచ్చాక రూ.25 లక్షల చొప్పున ఇస్తాం’ అని మాటిచ్చారు. చంద్రబాబు ప్రకటనకు స్పందించి పలువురు అక్కడే విరాళాలు ఇవ్వగా సుమారు రూ.15 లక్షలు పోగయ్యాయి. కొయ్యలగూడెం మండలం బోడిగూడెంలో అనారోగ్యంతో ఇటీవల చనిపోయిన నలుగురు చిన్నారుల కుటుంబాలకు ప్రభుత్వం సహాయం అందించలేదని చంద్రబాబు విమర్శించారు. మృతులు మింటే మధు, జగతా శ్రీను, పేరుబోయిన రామాంజనేయులుతోపాటు మరో కుటుంబానికి రూ.50వేల చొప్పున అందజేశారు.  

బీమా, పింఛను తొలగిస్తామన్నారు: వెంకటలక్ష్మి దుర్గ
‘నా భర్త పోశయ్య కల్తీ సారావల్లే చనిపోయారు. కూలికి వెళ్తేనే మాకు పూట గడిచేది. నాకు ఇద్దరు పిల్లలు. వారినెలా పెంచాలో అర్థం కావట్లేదు. గతంలో బ్రాందీ తాగే ఆయన ధరలు పెంచడంతో సారాకు అలవాటుపడ్డారు. ప్రభుత్వం తరఫున మమ్మల్ని పలకరించిన వాళ్లులేరు. మట్టి ఖర్చులు తెదేపానే అందించింది. ఆదివారం రాత్రి మమ్మల్ని బెదిరించారు. సోమవారం తెల్లవారుజామున నాలుగింటి నుంచి ఇంటి దగ్గరే కాపలా కాశారు. ‘చంద్రబాబు నాలుగు మాటలు చెప్పి వెళ్తారు. అంతకుమించి ఏమీ చేయరు. చేయాల్సింది ప్రభుత్వమే. చూసి మాట్లాడండి. లేకుంటే పింఛను రాదు. రేషన్‌ కట్‌ చేస్తాం. బీమా రాదు’ అని భయపెడుతున్నారు. మాకు భయంగా ఉంది. రక్షణ కల్పించండి.’

నిజం చెబితే పింఛను తీసేస్తామంటారా?
మనిషి చనిపోయిన బాధలో ఉన్న వారి ఇళ్లకు వెళ్లి ‘నిజం చెబితే పింఛను ఆపేస్తాం’ అని ప్రభుత్వం బెదిరించడం సిగ్గుమాలిన చర్య అని చంద్రబాబు మండిపడ్డారు. ‘సారాయే తమ వాళ్లను చంపేసిందని మహిళలు చెబుతుంటే బాధేసింది. భర్తను కోల్పోయిన మహిళకు, కుమారుడిని కోల్పోయిన తల్లికి, తండ్రిని కోల్పోయిన బిడ్డకు సీఎం జగన్‌ ఏం సమాధానం చెబుతారు?’ అని సోమవారం ట్విటర్‌లో ప్రశ్నించారు.

రూ.100కే రెండు ప్యాకెట్లు: వెంపల లావణ్య
‘అంతకు ముందు బ్రాందీ, విస్కీ తాగే మా ఆయన అనిల్‌.. రేట్లు పెంచేయడంతో రూ.100కే రెండు ప్యాకెట్లు దొరికే నాటుసారాకు అలవాటుపడ్డారు. కల్తీ సారా తాగి చనిపోతే.. పది రోజులపాటు అన్నం తిననందుకే చనిపోయాడంటూ ఆసుపత్రిలో అబద్ధం చెబుతున్నారు. ఆయనకు అన్నం పెట్టేది నేనే. నాకు తెలీదా ఆయన తిన్నదీ లేనిదీ? ఇప్పుడు మా కుటుంబం ఛిన్నాభిన్నమైంది. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ తప్పుడు నివేదికతో మాకు అన్యాయం చేశారు.’

నాటుసారా వల్లే చనిపోయాడు: పితాని లక్ష్మి
నాటుసారా వల్లే నా కుమారుడు రమణ చనిపోయారు. తండ్రిగా, తోబుట్టువుగా రక్షణ కల్పిస్తానని హామీ ఇచ్చిన జగన్‌ నా కోడలి తాడు తెంపారు. ఆయన కేసులు రద్దు చేయించుకొని సుఖంగా ఇంట్లో ఉన్నారు. వాళ్ల కుటుంబంలో జరిగితే ఇలాగే ఉంటారా? 28, 29 వార్డుల్లోని నాయకులు ఆదివారం రాత్రి ఒంటిగంటకు ఇంటికొచ్చి బెదిరించారు. మా కోడలిని ఉదయం ఏలూరు తీసుకెళ్లారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని