Nobel Prize 2021: పరమాణువులతో అద్భుతాల సృష్టి

మానవజాతి మనుగడకు ఉపకరించే అద్భుత ప్రక్రియను ఆవిష్కరించిన ఇద్దరు శాస్త్రవేత్తలు రసాయన శాస్త్రంలో ఇచ్చే నోబెల్‌ బహుమతికి ఎన్నికయ్యారు.

Updated : 07 Oct 2021 10:15 IST

రసాయన శాస్త్రాన్ని పర్యావరణ హితంగా మార్చిన ఇద్దరికి నోబెల్‌

బెంజమిన్‌ లిస్ట్‌, డేవిడ్‌ మెక్‌మిలన్‌లకు పురస్కారం


డేవిడ్‌ మెక్‌మిలన్‌ - బెంజమిన్‌ లిస్ట్‌

స్టాక్‌హోమ్‌: మానవజాతి మనుగడకు ఉపకరించే అద్భుత ప్రక్రియను ఆవిష్కరించిన ఇద్దరు శాస్త్రవేత్తలు రసాయన శాస్త్రంలో ఇచ్చే నోబెల్‌ బహుమతికి ఎన్నికయ్యారు. జర్మనీకి చెందిన బెంజమిన్‌ లిస్ట్‌, స్కాట్లాండ్‌కు చెందిన డేవిడ్‌ మెక్‌మిలన్‌ సంయుక్తంగా ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. పరమాణువుల అమరికను సరికొత్త మార్గంలో అభివృద్ధిపరిచే ‘అసిమెట్రిక్‌ ఆర్గానోకెటాలసిస్‌’ అనే విధానాన్ని ఆవిష్కరించినందుకు గాను వీరిద్దరినీ అవార్డుకు ఎంపిక చేసినట్లు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ సెక్రెటరీ జనరల్‌ గొరాన్‌ హాన్సన్‌ బుధవారం వెల్లడించారు. బెంజమిన్‌ లిస్ట్‌, మెక్‌మిలన్‌ విడివిడిగా నూతన కెటాలసిస్‌ ప్రక్రియను 2000 సంవత్సరంలో కనుగొన్నారని నోబెల్‌ కమిటీ తెలిపింది. వీరి ఆవిష్కరణ రసాయన శాస్త్రాన్ని పర్యావరణ హితంగా మార్చిందని ప్రశంసించింది. ‘‘పరమాణువులను ఒక ప్రత్యేక క్రమంలో అనుసంధానం చేసి అణువులను రూపొందించడం చాలా కష్టమైన ప్రక్రియ. అందుకు చాలా సమయంపడుతుంది. ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి 2000 సంవత్సరం ప్రారంభం వరకు రసాయన శాస్త్రవేత్తలు లోహ ఉత్ప్రేరకాలు లేదా ఎంజైములను ఉపయోగించారు. లోహ ఉత్ప్రేరకాలను ఉపయోగించినప్పుడు పర్యావరణానికి హాని కలిగించే విషపూరితాలు వెలువడుతుంటాయి. అయితే, మ్యాక్స్‌ ప్లాంక్‌ ఇనిస్టిట్యూట్‌లో బెంజమిన్‌ లిస్ట్‌, ప్రిన్స్‌టన్‌ విశ్వవిద్యాలయంలో డేవిడ్‌ మెక్‌మిలన్‌ పరమాణువులను వినియోగించి ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండానే కావాల్సిన ఫలితాన్ని సాధించే మూడో విధానాన్ని కనుగొన్నారు. అసిమెట్రిక్‌ ఆర్గానోకెటాలసిస్‌ అనే ఈ నూతన విధానం ఇప్పుడు విస్తృతంగా అందుబాటులోకి వచ్చింది. అత్యంత సులభమైన, తక్కువ వ్యయంతో కూడిన ఈ ప్రక్రియ నూతన ఔషధాల తయారీ, ప్రత్యేక రసాయనాల ఉత్పత్తికి ఎంతో ఉపయోగపడుతుంది. ఆహార ఉత్పత్తుల్లో రుచులను పెంపొందించే విధానాలకూ దోహదపడుతోంది’’ అని నోబెల్‌ కమిటీ వివరించింది. వాహనాలు విడుదల చేసే ఇంధన కాలుష్యాల తీవ్రతను తగ్గించేందుకూ నూతన పక్రియ తోడ్పడుతోందని నిపుణులు తెలిపారు. నోబెల్‌ బహుమతి కింద ఇద్దరు రసాయన శాస్త్రవేత్తలు బంగారు పతకంతో పాటు 11లక్షల అమెరికన్‌ డాలర్లను అందుకోనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని