CM Jagan: మాకు.. వాళ్లకు తేడా మీరే చెప్పాలి

దేశ చరిత్రలో ఇలాంటి సాయం ఎప్పుడూ అందలేదు. ఇంత మంచి చేస్తున్న.. ఇంతటి అభివృద్ధి, సంక్షేమం అందిస్తున్న ప్రభుత్వానికి.. గత ప్రభుత్వానికి తేడా ఒక్కసారి గమనించాలి’ అని సీఎం జగన్‌ కోరారు.

Updated : 14 May 2022 04:35 IST

మంచి చేశామని చెప్పే ధైర్యం బాబుకు.. దత్తపుత్రుడికి లేదు
35 నెలల్లో బటన్‌ నొక్కి.. రూ.లక్షా 40 వేల కోట్లు ప్రజలకిచ్చా
మత్స్యకార భరోసా కార్యక్రమంలో సీఎం

ఈనాడు-కాకినాడ, న్యూస్‌టుడే-ముమ్మిడివరం, ఐ.పోలవరం : ‘ప్రజల సంక్షేమానికి 32 పథకాలు ప్రవేశపెట్టాం. అధికారంలోకి వచ్చిన 35 నెలల్లో అన్నివర్గాల పేదలకూ రూ.1.40 లక్షల కోట్లు ఖాతాల్లో వేశాం.

దేశ చరిత్రలో ఇలాంటి సాయం ఎప్పుడూ అందలేదు. ఇంత మంచి చేస్తున్న.. ఇంతటి అభివృద్ధి, సంక్షేమం అందిస్తున్న ప్రభుత్వానికి.. గత ప్రభుత్వానికి తేడా ఒక్కసారి గమనించాలి’ అని సీఎం జగన్‌ కోరారు. ఇంతటి మంచి చేశామని చెప్పే ధైర్యం చంద్రబాబుకు, ఇంతటి మంచి చంద్రబాబు చేశారని చెప్పే ధైర్యం ఆ దత్తపుత్రుడికి లేదని విమర్శించారు. ఇలాంటి వక్రబుద్ధి ఉన్న వారి నుంచి రాష్ట్రాన్ని దేవుడే కాపాడాలన్నారు. కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం మురముళ్లలో మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా సముద్రంలో వేటకు వెళ్లే 1,08,755 మత్స్యకార కుటుంబాలకు రూ.108.75 కోట్లు మీట నొక్కి ఖాతాల్లోకి వేశారు. కోనసీమలో ఓఎన్జీసీ పైపులైను పనులతో జీవనోపాధి కోల్పోయిన 69 గ్రామాల్లో 678 బోట్లకు సంబంధించిన 23,458 కుటుంబాలకు నాలుగు నెలల పరిహారం రూ.107.9 కోట్లు ఖాతాల్లో వేశారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే...

సత్యలింగ నాయకర్‌ స్ఫూర్తితో...

‘చంద్రబాబు ఐదేళ్లలో కేవలం రూ.104 కోట్లు భృతి కింద ఇస్తే.. ఈ ప్రభుత్వం మత్స్యకార భరోసా పథకం కింద రూ.419 కోట్లు నేరుగా మత్స్యకార కుటుంబాలకు ఇచ్చింది. 180 ఏళ్ల కిందట పుట్టిన మల్లాడి సత్యలింగ నాయకర్‌ అనే మహానుభావుడు ట్రస్టు పెట్టి.. తన యావదాస్తిని ఈ ప్రాంతానికి మంచి జరగాలనే ఉద్దేశంతో దానధర్మాలు చేశారు. మల్లాడి దాతృత్వంతో 110 ఏళ్లుగా వేల మంది పేదలకు మేలు కలుగుతోంది. అలాంటి గొప్ప వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకుని ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. మత్స్యకారులకే కాక.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రవర్ణాల్లోని ప్రతి పేదవాడికీ ప్రభుత్వం తోడుగా ఉంటుంది. పేదవాళ్లందరినీ నా వాళ్లుగానే భావిస్తున్నాను.

95 శాతం వాగ్దానాలు పూర్తి

మత్స్యకారుల వలసల నిరోధానికి రూ.4 వేల కోట్లతో ప్రపంచస్థాయి ప్రమాణాలతో 9 మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్లు  నిర్మిస్తున్నాం. వీటిలో నాలుగింటి నిర్మాణం ప్రారంభం కాగా.. మిగిలినవి టెండర్ల దశలో ఉన్నాయి. మత్స్య ఉత్పత్తులకు మంచి ధర రావాలని ఫిష్‌ ఆంధ్ర పేరిట నాణ్యమైన ఆక్వా ఉత్పత్తులను సరసమైన ధరలకే అందుబాటులో తెచ్చేందుకు.. దేశీయ వినియోగం పెంచేందుకు రూ.333 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా 70 ఆక్వా హబ్‌లు, వాటికి అనుసంధానంగా 14 వేల రిటైల్‌ దుకాణాల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నాం. దీంతో 80వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి దక్కుతుంది. ఎన్నికల ప్రణాళికలో చేసిన వాగ్దానాలు 95 శాతం పూర్తిచేశాం. ఇంటింటికీ వెళ్లి చెప్పే నైతికత మాకే ఉంది. మన ప్రభుత్వం ఏం చేసిందో చెప్పడానికి.. మీరు గెలిపించిన మన ఎమ్మెల్యేలు, ఎంపీలను మీ ఇంటికి, మీ గడప గడపకు పంపుతున్నాను.

మీరెక్కడైనా చూశారా?

కొడుక్కి పచ్చి అబద్ధాలు, మోసాలపై శిక్షణ ఇస్తున్న చంద్రబాబు లాంటి తండ్రిని మీరెక్కడైనా చూశారా? మంత్రిగా పనిచేసి.. మంగళగిరిలో ఓడిన సొంత పుత్రుడు ఒకరు. రెండుచోట్లా పోటీచేసి ఎక్కడా గెలవని దత్తపుత్రుడు ఇంకొకరు. ప్రజల్ని కాక ఇలాంటి వారిని నమ్ముకుంటున్న చంద్రబాబు లాంటి రాజకీయ నాయకుడిని ఎక్కడైనా చూశారా..? 27 ఏళ్లుగా పెద్దమనిషి చంద్రబాబుకు కుప్పంలో ఇల్లు కట్టుకోవాలనే ఆలోచన రాలేదు. మూడేళ్ల మా పాలన చూశారో లేదో.. ఇప్పుడు కుప్పంలో ఇల్లు కట్టుకుంటున్నారు’ అని సీఎం జగన్‌ వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో మంత్రులు పినిపే విశ్వరూప్‌, వేణుగోపాలకృష్ణ, సీదిరి అప్పలరాజు, జోగి రమేష్‌, ఎంపీలు వంగా గీత, చింతా అనురాధ, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, ఎమ్మెల్యేలు పొన్నాడ సతీష్‌కుమార్‌, కొండేటి చిట్టిబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, రాపాక వరప్రసాద్‌, చిర్ల జగ్గిరెడ్డి, పెండెం దొరబాబు, కోనసీమ, కాకినాడ జిల్లాల కలెక్టర్లు హిమాన్షు శుక్లా, కృతికా శుక్లా తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని