వచ్చేశాయ్‌

వైఎస్సార్‌ సంచార పశు ఆరోగ్య సేవలను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ప్రారంభించారు. క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో రూ.143 కోట్ల వ్యయంతో

Updated : 20 May 2022 12:02 IST

రూ.143 కోట్ల వ్యయంతో 175 వాహనాలు..

సంచార పశు ఆరోగ్య అంబులెన్సులను జెండా ఊపిప్రారంభించిన సీఎం జగన్‌

ఈనాడు, అమరావతి: వైఎస్సార్‌ సంచార పశు ఆరోగ్య సేవలను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ప్రారంభించారు. క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో రూ.143 కోట్ల వ్యయంతో అందుబాటులోకి తెచ్చిన 175 అంబులెన్సులను ఆయన జెండా ఊపి ఆరంభించారు. ఈ సందర్భంగా అంబులెన్సు లోపల సౌకర్యాలు, పశువులకు అందించే మందులను పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడి రైతులకు అందించే సేవలను తెలుసుకున్నారు. అనంతరం వాహనాలన్నీ నిర్దేశిత ప్రాంతాలకు తరలి వెళ్లాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం రూ.278 కోట్ల వ్యయంతో 340 అంబులెన్సులను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్ణయించగా.. రెండో దశలో రూ.135 కోట్ల వ్యయంతో మరో 165 అంబులెన్సులు కొనుగోలు చేయనున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి (పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ) బూడి ముత్యాల నాయుడు, రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పశు సంవర్ధక, మత్స్యశాఖల మంత్రి సీదిరి అప్పలరాజు, బీసీ సంక్షేమ, సమాచార, ప్రసారశాఖల మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పశు సంవర్ధకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, డైరెక్టర్‌ అమరేంద్ర కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


వాహనాలపై ప్రధాని మోదీ చిత్రం

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయని.. బియ్యం, చెత్త తరలించే వాహనాలపై ప్రధాని మోదీ చిత్రాన్ని ముద్రించాలని గతంలో రాష్ట్ర భాజపా నేతలు డిమాండ్‌ చేశారు. దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సంచార పశు ఆరోగ్య అంబులెన్సులపై ప్రధాని చిత్రాన్ని పెద్దగా ముద్రించారు. వీటిని గురువారం ముఖ్యమంత్రి జగన్‌ ప్రారంభించారు.

- ఈనాడు, అమరావతి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని