‘గడప గడప’లో వాగ్వాదాలు

రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల్లో ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ నిరసనలు, నిలదీతలు, వాగ్వాదాల మధ్య కొనసాగుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలను గురువారం ప్రజలు వివిధ సమస్యలపై ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో

Updated : 20 May 2022 05:24 IST

పలువురు అధికార పార్టీ ఎమ్మెల్యేల నిలదీత

న్యూస్‌టుడే-యంత్రాంగం: రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల్లో ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ నిరసనలు, నిలదీతలు, వాగ్వాదాల మధ్య కొనసాగుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలను గురువారం ప్రజలు వివిధ సమస్యలపై ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో అమలైన విదేశీ విద్య పథకాన్ని మీరు అధికారంలోకి వచ్చాక ఎందుకు ఆపేశారంటూ విజయవాడ పాతబస్తీలోని కుమ్మరివీధిలో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావును ఓ యువకుడు, ఆమె తల్లి నిలదీశారు.

ఆ వార్డులు తెదేపావి... వెళ్లొద్దు!
అనకాపల్లి జిల్లా వైకాపా అధ్యక్షుడు, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కన్నంపేటలో 3, 4 వార్డుల్లో పర్యటించడానికి వెళుతుండగా... ‘ఆ వార్డులు తెదేపావి. అక్కడికి వెళ్తే కావాలనే రచ్చ చేస్తార’ని స్థానిక వైస్‌ ఎంపీపీ దంట్ల వెంకటరమణ ఎమ్మెల్యే ధర్మశ్రీతో చెప్పి మరో వార్డులోకి తీసుకెళ్లారు. స్థానికులు... తప్పని పరిస్థితిలో సచివాలయం వద్దకు వెళ్లి ఆయనకు సమస్యలను విన్నవించారు. నల్లబెల్లం విక్రయాలపై ఆంక్షలు విధించడాన్ని రైతులు నిలదీశారు.

తాగునీటి బోరును వైకాపా నేత వాడటంపై నిరసన
శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తలుపుల మండలం ఉడమలకుర్తి పంచాయతీ పరిధిలోని చిన్నపల్లి గ్రామస్థులు తాగునీటి సమస్యపై ఎమ్మెల్యే డాక్టరు పీవీ సిద్ధారెడ్డిని నిలదీశారు. ఓ వైకాపా నాయకుడు ప్రభుత్వ బోరును ఆక్రమించుకొని పంటలకు వాడుకొంటున్నారని ఆరోపించారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మాటేంటి?
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల పరిస్థితి ఏమిటని కర్నూలు జిల్లా హాలహర్వి మండలం చింతకుంట గ్రామస్థులు కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాంను ప్రశ్నించారు. పోలీసులు వారిస్తున్నా... సంకమ్మ చెరువు కాలనీకి చెందిన మహిళలు మంత్రి పర్యటనను అడ్డుకున్నారు. దశాబ్దకాలంగా కాలనీకి రహదారి లేదని వాపోయారు. మంత్రి స్వయంగా సమస్యను పరిశీలించి, పది రోజుల్లో రోడ్డు ఏర్పాటు చేసేలా చూస్తామని హామీ ఇచ్చారు.
ఎస్సీల పథకాలు రద్దు చేస్తే ఏం చేస్తున్నారు?
కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం చిరుతపూడిలో ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుకు కొందరు ఎస్సీ యువకులు, మహిళల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఎస్సీలకు సంబంధించిన 27 పథకాలను సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రద్దు చేస్తే ఎమ్మెల్యేగా ఉన్న మీరు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆ పథకాల జాబితాను ఎమ్మెల్యేకు అందజేశారు.
* ‘ఇంటింటింటికి వస్తామన్నారు.. కొన్ని వీధుల్లోకి రావడం లేదు.. అంటే అక్కడ సమస్యలు మీకు పట్టవా’ అంటూ తిరుపతి జిల్లా కేవీబీపురం మండలం కాట్రపల్లిలో ఎస్సీకాలనీ మహిళలు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలాన్ని నిలదీశారు.
* ‘ ‘తన అనారోగ్య సమస్యపై సీఎం సహాయనిధికి దరఖాస్తు చేస్తే ఆమోదం పొందడానికి వైకాపా నాయకుడు కె.రవికుమార్‌ రూ.15 వేలు లంచం తీసుకున్నాడ’ని తెదేపా కార్యకర్త బొద్దపు రమణబాబు అనకాపల్లి జిల్లా ఎలమంచిలి ఎమ్మెల్యే యూవీ రమణమూర్తిరాజుకు ఫిర్యాదు చేశారు.


మా ఇంటికి రావొద్దు

జగన్‌ పాదయాత్రలో నడిచిన ఓ ఉపాధ్యాయుడు... నేడు వైకాపా ఎమ్మెల్యే తన ఇంటికి రావద్దని గేటుకు బోర్డు ఏర్పాటు చేశారు. జగన్‌ పాదయాత్ర సమయంలో 247వ రోజున ఎలమంచిలి నియోజకవర్గంలో సీపీఎస్‌పై స్పష్టమైన హామీ ఇచ్చారు. దాంతో అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం మడుతూరుకు చెందిన ఉపాధ్యాయుడు త్రినాథస్వామి ఆయనతో కలిసి నడిచారు. ఉపాధ్యాయులు జగన్‌ చేయిపట్టుకుని నడవడంతో ఈ చిత్రాన్ని అప్పట్లో వైకాపా నేతలు తమ ప్రచారంలో విస్తృతంగా ఉపయోగించుకున్నారు. అధికారంలోకి వచ్చాక సీఎం జగన్‌... సీపీఎస్‌పై దాటవేత ధోరణిలో మాట్లాడటంతో త్రినాథస్వామి నిరసనకు దిగారు. రాష్ట్రంలోని చాలాప్రాంతాల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు సీపీఎస్‌ రద్దుపై ఇలాగే నిరసన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని