APSRTC: మహానాడుకు బస్సులా.. ఇవ్వలేం: ఆర్టీసీ

తెదేపా ఒంగోలులో నిర్వహిస్తున్న మహానాడుకు ఆర్టీసీ బస్సులను బుక్‌ చేసుకోనివ్వకుండా అధికారులు అడ్డుకుంటున్నారు. నిబంధనల ప్రకారం డబ్బులు చెల్లిస్తామని, బస్సులు అద్దెకు ఇవ్వాలని కోరితే.. అధికారులు ముఖం చాటేస్తున్నారు

Updated : 25 May 2022 09:49 IST

ఈనాడు, అమరావతి: తెదేపా ఒంగోలులో నిర్వహిస్తున్న మహానాడుకు ఆర్టీసీ బస్సులను బుక్‌ చేసుకోనివ్వకుండా అధికారులు అడ్డుకుంటున్నారు. నిబంధనల ప్రకారం డబ్బులు చెల్లిస్తామని, బస్సులు అద్దెకు ఇవ్వాలని కోరితే.. అధికారులు ముఖం చాటేస్తున్నారు. అధికారులు ముందు సరే అన్నారని, తర్వాత కుదరదన్నారని తెదేపా నేతలు పేర్కొంటున్నారు. వేసవి రద్దీ అంటూ సాకులు చెబుతున్నట్లు తెలిసింది.మరోవైపు మంత్రులు ఈనెల 26 నుంచి నిర్వహిస్తున్న సభలకు జనాలను తరలించేందుకు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల బస్సులు సమకూర్చేలా రవాణాశాఖ అధికారులు మౌఖిక ఆదేశాలిస్తున్నారు.

ఫిట్‌నెస్‌ లేకున్నా సిద్ధం 

మంత్రుల బస్సు యాత్రలో భాగంగా ఈనెల 26న శ్రీకాకుళం, 27న రాజమహేంద్రవరం, 28న నరసరావుపేట, 29న అనంతపురంలో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. దీనికోసం నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు స్కూళ్లు, కళాశాలల బస్సులను పెద్ద సంఖ్యలో సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఆయా జిల్లాల్లో ఎన్నెన్ని బస్సులు సమకూర్చాలనేది అక్కడి అధికారపార్టీ నేతలు, రవాణాశాఖ అధికారులకు స్పష్టం చేసినట్లు సమాచారం. స్కూళ్లు, కళాశాలల బస్సులను మరే ఇతర కార్యక్రమాలకు వినియోగించకూడదని కచ్చితమైన ఆదేశాలు ఉన్నాయి. మే 16 నుంచి స్కూళ్లు, కళాశాలలు తెరిచేలోపు.. ఆయా బస్సులకు ఫిట్‌నెస్‌ సర్టిఫికేట్‌ పొందాల్సి ఉంటుంది. అయినాసరే వీటితో సంబంధం లేకుండా, నిబంధనలకు వ్యతిరేకంగా ప్రభుత్వ కార్యక్రమానికి బస్సులు సమకూరుస్తున్నారని తెలిసింది. వీటిని మహానాడుకు తీసుకెళితే మాత్రం.. ఫిట్‌నెస్‌ సర్టిఫికేట్‌ లేదని కేసులు పెడతామని రవాణాశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారని తెదేపా ఆరోపిస్తోంది.

ఫ్లెక్సీలకూ ససేమిరా: గ్రామాల్లో కూడా తెదేపా ప్లెక్సీలు, జెండాలు, తోరణాలు కట్టుకునేందుకు అధికారుల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయని పలువురు తెదేపా నాయకులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని