కుటుంబం జల సమాధి

కల్వర్టును ఢీకొట్టిన ఓ కారు పక్కనే ఉన్న చెరువులో పడిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె రూరల్‌లో గురువారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.

Updated : 27 May 2022 06:51 IST

కల్వర్టును ఢీకొని చెరువులో పడిన కారు

ఇద్దరు పిల్లలుసహా దంపతుల దుర్మరణం

మదనపల్లె నేరవార్తలు, న్యూస్‌టుడే: కల్వర్టును ఢీకొట్టిన ఓ కారు పక్కనే ఉన్న చెరువులో పడిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె రూరల్‌లో గురువారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. నిమ్మనపల్లె మండలం రెడ్డివారిపల్లెకు చెందిన గంగిరెడ్డి (43) టిప్పర్‌, జేసీబీ, ట్రాక్టర్ల యజమాని. ఆయన భార్య మధుప్రియ (30), పిల్లలు కుషితారెడ్డి (4), దేవాంశ్‌రెడ్డిలతో (2) కలిసి పలమనేరులో జరిగిన వివాహానికి బుధవారం రాత్రి కారులో వెళ్లారు. తెల్లవారుజామున 3 గంటలకు తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. మార్గమధ్యంలో మదనపల్లె సమీపంలోని మోరంచెరువు కల్వర్టును ఢీకొని కారు చెరువులో పడిపోయింది. తెల్లవారుజామున 4- 5 గంటల మధ్యలో ఈ ఘటన జరగ్గా ఉదయం అటుగా వెళ్తున్నవారు చెరువులో పిల్లల మృతదేహాలు తేలుతుండటం చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. డీఎస్పీ రవిమనోహరాచారి, సీఐ మురళీకృష్ణ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని క్రేన్‌ సాయంతో కారును బయటకు తీసి మృతదేహాలను వెలికితీశారు. వివాహ వేడుక తర్వాత గంగిరెడ్డి మాచిరెడ్డిగారిపల్లెలో తన సోదరి గృహ ప్రవేశానికి వెళ్లేందుకని ఉదయాన్నే బయలుదేరి వచ్చి ఇలా ప్రమాదం బారిన పడ్డారని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని