ప్రజావేదిక కూల్చివేతతోనే విధ్వంస పాలనకు నాంది

ప్రజావేదిక కూల్చివేతతోనే రాష్ట్రంలో జగన్‌ విధ్వంస పాలన ప్రారంభమైందంటూ తెదేపా నాయకులు, కార్యకర్తలు ధ్వజమెత్తారు. ప్రజావేదిక కూల్చివేసి మూడేళ్లయిన సందర్భంగా అక్కడికి వెళ్లి నిరసన తెలిపేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

Published : 26 Jun 2022 05:17 IST

ఆ ఘటనకు మూడేళ్లవడంతో నిరసనకు తెదేపా యత్నం
దారులన్నీ మూసేసి.. అడుగడుగునా పోలీసుల నిర్బంధం
తెదేపా నాయకుల తోసివేత.. బలవంతంగా అదుపులోకి

ఈనాడు, ఈనాడు డిజిటల్‌ - అమరావతి, న్యూస్‌టుడే- తాడేపల్లి: ప్రజావేదిక కూల్చివేతతోనే రాష్ట్రంలో జగన్‌ విధ్వంస పాలన ప్రారంభమైందంటూ తెదేపా నాయకులు, కార్యకర్తలు ధ్వజమెత్తారు. ప్రజావేదిక కూల్చివేసి మూడేళ్లయిన సందర్భంగా అక్కడికి వెళ్లి నిరసన తెలిపేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ప్రజావేదిక పక్కనున్న తెదేపా అధినేత చంద్రబాబు నివాసం సమీపంలో శనివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. తెదేపా శ్రేణులను పోలీసులు రెండు కిలోమీటర్ల ముందే అడ్డుకున్నారు. ప్రజావేదిక వైపు వెళ్లే మార్గాలన్నీ మూసేశారు. దారిపొడవునా బారికేడ్లు, ఇనుప కంచెలు పెట్టారు. మీడియానూ అనుమతించలేదు. నిర్బంధాన్ని ప్రశ్నిస్తూ ముందుకెళ్లేందుకు యత్నించిన తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, తెలుగు యువత ప్రతినిధుల్ని పోలీసులు తోసేయడంతో వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. పోలీసులు తెదేపా నాయకుల్ని ఎత్తుకెళ్లి వ్యాన్లలో ఎక్కించారు. కొంతమందిని దుగ్గిరాల పోలీసుస్టేషన్‌కు తరలించారు. శనివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకూ ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి.

భారీగా పోలీసుల మోహరింపు

ప్రజావేదిక వద్దకు తెదేపా శ్రేణులు నిరసన తెలిపే అవకాశం ఉందన్న సమాచారంతో మధ్యాహ్నం రెండు గంటల నుంచే భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. విజయవాడ, గుంటూరు, సచివాలయం వైపు నుంచి వచ్చేవారిని అడ్డుకునేందుకు సీతానగరం డెల్టా రెగ్యులేటర్‌ వద్ద, ఉండవల్లి గుహల సమీపంలోని కొండవీటి వాగు వంతెన వద్ద, ఉండవల్లి ర్యాంప్‌ చెక్‌పోస్టు వద్ద ఇలా అన్ని మార్గాల్లోనూ బారికేడ్లు, ఇనుప కంచెలు పెట్టారు. తెలుగు యువత నాయకులు శ్రీరామ్‌ చిన్నబాబు, రవినాయుడు తదితరులు కొండవీటివాగు వంతెన వద్దకు ప్రదర్శనగా చేరుకుని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. పోలీసులు వారిని తోసేయడంతో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దశలవారీగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజావేదిక వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని ఈడ్చుకెళ్లి వాహనాల్లో పడేశారు. సాయంత్రం 5 గంటల సమయంలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌, ఎమ్మెల్సీలు అశోక్‌బాబు, మంతెన సత్యనారాయణరాజు, తెదేపా నాయకులు మన్నవ మోహనకృష్ణ, పిల్లి మాణిక్యాలరావు, బుచ్చిరామప్రసాద్‌ తదితరులు ప్రజావేదిక వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారినీ అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. తెలుగు యువత నాయకుడు రావిపాటి సాయికృష్ణ నేతృత్వంలో కొంతమంది మాత్రం నిర్బంధాల్ని దాటుకుని ప్రజావేదిక వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. కరకట్టపై బైఠాయించి ఆందోళన చేపట్టగా పోలీసులు వారిని వాహనాల్లో ఎక్కించి తరలించారు.

ఏటా ప్రజావేదిక స్మారక దినం

ప్రజావేదిక కూల్చివేతతో వైకాపా విధ్వంసక పాలన మొదలైందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. ఇకపై ఈ రోజును ఏటా ప్రజావేదిక స్మారక దినంగా నిర్వహిస్తామని చెప్పారు. ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపేందుకు ప్రయత్నిస్తుంటే పోలీసులు అడ్డుకోవటం తగదన్నారు.

కూల్చివేతల ప్రభుత్వమని మూడేళ్ల కిందటే చాటారు: చంద్రబాబు

జగన్‌రెడ్డి సీఎం కాగానే మొట్టమొదట చేసిన పని ప్రజావేదికను కూల్చివేయడమేనని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. తన సైకో పాలన ఎలా ఉండబోతోందో ప్రజలకు వివరించడానికి రూ.కోట్ల విలువైన ప్రజల ఆస్తిని ధ్వంసం చేశారని శనివారం ఆయన ట్వీట్‌ చేశారు. ‘తన విధ్వంసకర ఆలోచనలు ఎలా ఉంటాయో ఈ ముఖ్యమంత్రి రాష్ట్రానికి వివరించి నేటికి మూడేళ్లు. ప్రజావేదిక కూల్చి వికృతానందం పొందిన జగన్‌, మూడేళ్లలో కట్టింది శూన్యం. జగన్‌కు కూల్చివేతలు తప్ప నిర్మించడం చేతగాదు. ఏపీలో అభివృద్ధిని, ఆర్థిక స్థాయిని, ప్రజాస్వామ్య వ్యవస్థల్ని, దళితుల గూడును, యువత భవితను, ప్రజారాజధాని అమరావతిని, పోలవరం కలను ఇలా అన్నింటినీ కూల్చి రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారు. గత ప్రభుత్వం కట్టిన నిర్మాణాల్లో కూర్చుని పాలన సాగిస్తూ తన వల్ల ఏమీ కాదని, తనకేమీ రాదని ఆయన తేల్చి చెప్పేశారు’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

30 మంది తెదేపా నాయకులపై కేసు

పోలీసు నిబంధనలను ఉల్లంఘించి ఉండవల్లిలోని ప్రజావేదిక కూల్చివేసిన ప్రదేశం వద్దకు వెళుతున్న 30 మంది తెదేపా నాయకులపై తాడేపల్లి స్టేషన్‌లో శనివారం రాత్రి కేసు నమోదయింది. తెదేపా నాయకులు కనపర్తి శ్రీనివాసరావు, మానికొండ శివప్రసాద్‌, గొల్లా ప్రభాకర్‌, మరో 27 మందిని ఉండవల్లి చెక్‌పోస్టు వద్ద  అదుపులోకి తీసుకుని, కేసు పెట్టినట్లు పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని