జాతీయ స్థాయికి అమరావతి ఉద్యమం

రాజధాని అమరావతిని సర్వనాశనం చేసేందుకు కంకణం కట్టుకున్న వైకాపా ప్రభుత్వ దమననీతిని దిల్లీ వేదికగా ఎండగట్టాలని రాజధాని రైతులు నిర్ణయించారు. రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాల్సిన ఆవశ్యకతను దిల్లీ వీధుల్లో ఎలుగెత్తి చాటనున్నారు.

Published : 27 Nov 2022 04:48 IST

17, 18వ తేదీల్లో  జంతర్‌మంతర్‌ వద్ద నిరసన
ప్రత్యేక రైల్లో దిల్లీ వెళ్లనున్న  2 వేల మంది రైతులు, రైతు కూలీలు

తుళ్లూరు గ్రామీణం, న్యూస్‌టుడే: రాజధాని అమరావతిని సర్వనాశనం చేసేందుకు కంకణం కట్టుకున్న వైకాపా ప్రభుత్వ దమననీతిని దిల్లీ వేదికగా ఎండగట్టాలని రాజధాని రైతులు నిర్ణయించారు. రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాల్సిన ఆవశ్యకతను దిల్లీ వీధుల్లో ఎలుగెత్తి చాటనున్నారు. అమరావతి పరిరక్షణ ఉద్యమం మొదలై మూడేళ్లవుతున్న సందర్భంగా డిసెంబరు 17, 18 తేదీల్లో దేశ రాజధానిలోని జంతర్‌మంతర్‌ వద్ద భారీ నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. డిసెంబరు 7 నుంచి పార్లమెంటు సమావేశాలు మొదలవుతున్నందున... మూడు రాజధానుల పేరుతో వైకాపా ప్రభుత్వం అమరావతి విధ్వంసానికి తెగబడిన తీరును యావత్‌ దేశం దృష్టికి తీసుకెళ్లాలని రైతులు నిర్ణయించారు. రెండు రోజులపాటు జరిగే నిరసన కార్యక్రమానికి వివిధ జాతీయ, ప్రాంతీయ పార్టీల నాయకుల్ని ఆహ్వానించనున్నారు. సుమారు 2వేల మంది రైతులు, రైతు కూలీలు ప్రత్యేక రైల్లో దిల్లీ వెళ్లనున్నారు. భవిష్యత్‌ ఉద్యమ కార్యాచరణపై చర్చించేందుకు శనివారం తుళ్లూరులో అమరావతి పరిరక్షణ సమితి, అమరావతి రైతు ఐక్య కార్యాచరణ సమితి ప్రతినిధుల సంయుక్త సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌ కుమార్‌, అమరావతి పరిరక్షణ సమితి నాయకులు శివారెడ్డి, గద్దె తిరుపతిరావు, రైతు నాయకులు ధనేకుల రామారావు, బెల్లంకొండ నరసింహారావు, పువ్వాడ సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

15న దిల్లీ పయనం

డిసెంబరు 15న విజయవాడ నుంచి 22 బోగీలున్న ప్రత్యేక రైలులో రైతులు, రైతు కూలీలు దిల్లీ బయల్దేరతారు. 17, 18 తేదీల్లో జంతర్‌మంతర్‌ వద్ద నిరసన కార్యక్రమంలో పాల్గొంటారు. 19న భారతీయ కిసాన్‌ సంఘ్‌ ఆధ్వర్యంలో రైతుల సమస్యలపై దిల్లీలో నిర్వహించే ర్యాలీలో పాల్గొంటారు. అదే రోజు రాత్రి దిల్లీ నుంచి తిరుగు ప్రయాణమవుతారు.  

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తాం

‘దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా అమరావతి పరిరక్షణ కోసం మూడేళ్లుగా పోరాడుతున్నాం. పోలీసుల ఆంక్షలవల్ల పాదయాత్రకు తాత్కాలిక విరామం ఇచ్చాం. అమరావతిని కాపాడుకునేందుకు రైతులు, రైతు కూలీలు, మహిళలు చేస్తున్న ఉద్యమాన్ని జాతీయ స్థాయికి తీసుకెళతాం. ప్రజల మద్దతుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తాం. అమరావతిపై ప్రభుత్వ దమనకాండను దిల్లీలో చాటిచెబుతాం. మా పోరాటానికి అన్ని రాజకీయ పార్టీలూ సంఘీభావం తెలుపుతాయని భావిస్తున్నాం’ అని అమరావతి పరిరక్షణ సమితి నాయకులు శివారెడ్డి, తిరుపతిరావు పేర్కొన్నారు. ‘కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు దిల్లీలో చేసిన ఉద్యమాన్ని అమరావతి ఉద్యమకారులు స్ఫూర్తిగా తీసుకోవాలి’ అని బెల్లకొండ నరసింహారావు సూచించారు. అమరావతి ఏ ఒక్క కులానికో, మతానికో చెందింది కాదని, ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తును నిర్దేశించే నగరమని శ్రావణ్‌కుమార్‌ పేర్కొన్నారు. రాజకీయ నాయకులంతా పార్టీలకు అతీతంగా అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతు పలకాలని విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని