ప్రజల ఆరోగ్యానికి పెను సవాల్‌

విచ్చలవిడి యాంటీబయాటిక్స్‌ వినియోగం ప్రపంచ ఆరోగ్యానికి పెను సవాలు విసురుతోంది. వైద్యుల సలహాలు పాటించకుండానే సొంత వైద్యంతో మందులను అవసరాలకు మించి వాడుతున్నారు.

Published : 27 Nov 2022 05:08 IST

అతిగా యాంటీబయాటిక్స్‌ వినియోగమే కారణం
వ్యవసాయ, పశు, మత్స్య రంగాల్లో మితిమీరి వాడకం
కొవిడ్‌ కంటే ప్రమాదకర  పరిస్థితులు తలెత్తే అవకాశం
వివిధ రంగాల నిపుణుల ఆందోళన

ఈనాడు, అమరావతి: విచ్చలవిడి యాంటీబయాటిక్స్‌ వినియోగం ప్రపంచ ఆరోగ్యానికి పెను సవాలు విసురుతోంది. వైద్యుల సలహాలు పాటించకుండానే సొంత వైద్యంతో మందులను అవసరాలకు మించి వాడుతున్నారు. జంతువులు, కోళ్లలో వ్యాధుల నివారణకు సప్లిమెంట్లుగానూ వీటిని అధిక మోతాదులో వాడుతున్నారు. వ్యవసాయంలో విరివిగా వాడే కీటక నాశినులు, రసాయన క్రిమిసంహారకాల వాడకంతో పరోక్షంగా నిరోధకత పెంపొందించుకున్న సూక్ష్మక్రిములు ఆయా ఆహార పదార్థాల ద్వారా మనుషుల శరీరంలోకి చేరుతున్నాయి. వీటిని ‘యాంటీ మైక్రోబియల్‌ రెసిస్టెన్స్‌’(ఏఎంఆర్‌)గా పేర్కొంటున్నారు. 2019లో ప్రపంచవ్యాప్తంగా జరిగిన సుమారు 12 లక్షల మరణాలకు యాంటీబయాటిక్స్‌కు లొంగని సూక్ష్మక్రిములే కారణమని ‘లాన్సెట్‌’లో వ్యాసం ప్రచురితమైంది. కలరా, టైఫాయిడ్‌, న్యుమోనియా, క్షయ వంటి వ్యాప్తి అధికంగా ఉండే భారత్‌లో యాంటీబయాటిక్స్‌ వినియోగం రోజురోజుకీ ఎక్కువవుతోంది. ఒకప్పుడు ‘మస్కిటో కాయిల్‌’ పెడితే దోమలు పారిపోయేవి. ప్రస్తుతం ఘాటైన కాయిల్స్‌, ద్రావణాన్ని వాడుతున్నా అవి వెళ్లిపోవడంలేదు. నిరోధక శక్తిని పెంచుకుంటూ తిరుగుతున్నాయి. ఇదే పరిస్థితి మనుషులకు వస్తున్న వివిధ వ్యాధుల విషయంలోనూ ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో విజయవాడలో ఏఎంఆర్‌ నిరోధక చర్యలపై జరిగిన సదస్సుకు హాజరైన వైద్య, ఇతర రంగాల నిపుణులు ‘ఈనాడు’ ప్రతినిధితో మాట్లాడారు.


ఆసుపత్రుల్లోనూ ఇన్‌ఫెక్షన్ల కేసులు
-డాక్టర్‌ రంగారెడ్డి, అధ్యక్షుడు
ఇన్ఫెక్షన్‌ కంట్రోల్‌ అకాడమీ ఆఫ్‌ ఇండియా

ఆసుపత్రుల్లోని వాతావరణంతోనూ ఇన్‌ఫెక్షన్ల కేసులు ఎక్కువగా ఉంటున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో ఆసుపత్రుల్లో చేరిన వారిలో 5% నుంచి 8% మందికి అదనంగా కొత్త రోగాలు తోడవుతున్నాయి. భారత్‌ వంటి దేశాల్లో 12% నుంచి 15% వరకు నమోదవుతున్నాయి. ఇదే సమయంలో ఐసీయూల్లో వంద మంది ఉంటే... 20% నుంచి 30% మందికి అదనంగా కొత్త జబ్బులు వస్తున్నాయి. పరిశుభ్రత లేకపోవడం, రోగులకు ఉపయోగించే సిరంజీలు, సెలైన్లు ఇతర వస్తువుల విషయాల్లో జాగ్రత్తలు పాటించనందున రోగులు కొత్త వ్యాధుల బారిన పడుతున్నారు.  దేశంలో రెండు దశాబ్దాలుగా యాంటీబయాటిక్స్‌ వినియోగం విపరీతంగా పెరిగింది. దీన్ని తేలికగా తీసుకుంటే కొవిడ్‌ కంటే చేదు అనుభవాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వైద్యుల చీటీ లేకుండా మందులను అమ్మొద్దు. మరోవైపు పూర్తిస్థాయిలో మందులు వాడకుండానే ఆరోగ్యం బాగుందని మధ్యలోనే మందుల వాడకాన్ని నిలిపేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు.


ఆక్వా, పౌల్ట్రీ రంగాల్లో నియంత్రణ తప్పనిసరి

-డాక్టర్‌ పి.రెడ్డెన్న, ఎగ్జిక్యూటివ్‌ ప్రెసిడెంట్‌, ఫెడరేషన్‌ ఆఫ్‌ ఏషియన్‌ బయోటెక్నాలజీ అసోసియేషన్‌

ఆక్వా, పౌల్ట్రీరంగాల్లో అవసరాలకు మించి యాంటీబయాటిక్స్‌ వాడుతున్నారు. ఫలితంగా బ్యాక్టీరియాకు నిరోధక శక్తి పెరిగి, సాధారణ వ్యాధులకు సైతం మందులు పనిచేయని పరిస్థితి ఎదురవుతోంది. ఈ రంగాల్లో యాంటీబయాటిక్స్‌ రహిత దాణాను మాత్రమే వాడాలి. వైద్య, ఆహార, పరిశ్రమ రంగాల్లో వీటి వినియోగంపై నియంత్రణ చర్యల అవసరముంది.


నిరంతర శాస్త్రీయ అధ్యయనం జరగాలి
-ప్రొఫెసర్‌ ఆనందకుమార్‌(మైక్రోబయాలజీ), శ్రీవేంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం

జంతువుల నుంచి మనుషులు, మనుషుల నుంచి జంతువులకు వ్యాధులు సంక్రమిస్తున్నాయి. పశువులు, కోళ్లలో ఉన్న వ్యాధి నిరోధకతను తెలుసుకునేందుకు శాస్త్రీయ అధ్యయనం జరగాలి. ఇందులో భాగంగానే నిరుడు ఈ-కోలిపై పైలెట్‌ ప్రాజెక్టు చేశాం. కోళ్లు, వాతావరణంలోని ఈ-కోలి నమూనాలను సేకరించాం. పరిశోధనలు సాగుతున్నాయి. వాటి ఫలితాలు వచ్చాక తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కలుగుతుంది. ఇప్పటికిప్పుడు నూతన యాంటీబయాటిక్స్‌ తయారు చేసే పరిస్థితి లేదు. ప్రస్తుతం ఉన్న వాటినే కాపాడుకోవాలి.


బహుళ వ్యాధుల టీకాలు రావాలి
-ప్రొఫెసర్‌ పి.వెంకటలక్ష్మి శివప్రసాద్‌ (స్ట్రక్చరల్‌ బయోటెక్నాలజీ), కేఎల్‌యూ

మనుషులు, జంతువులు, కోళ్లకు నాలుగైదు రకాల వ్యాక్సిన్లు కాకుండా బహుళ వ్యాధుల వ్యాక్సిన్లు వస్తే మంచిది. ఒక్కో టీకా ఇచ్చుకుంటూ పోతే... బ్యాక్టీరియాకు నిరోధకత పెరుగుతుంది. యాంటీబయాటిక్స్‌ అతి వినియోగంతో వచ్చే దుష్ఫలితాల గురించి పిల్లలకు పాఠశాల విద్య నుంచే బోధించాలి. వీరిలో అవగాహన కలిగిస్తే ఏ సమస్యకైనా పరిష్కారం లభిస్తుంది.


అవగాహన లోపం
-ప్రొఫెసర్‌ పి.హరిబాబు(రిటైర్డ్‌) మత్స్య కళాశాల, నెల్లూరు

ఒకప్పుడు రొయ్యల సాగులో యాంటీబయాటిక్స్‌ వినియోగం ఎక్కువగా ఉంది. ఎగుమతులపై ఆంక్షలు, ఎగుమతుల అవసరాలు, వచ్చిన అవగాహనతో వాటి వినియోగం బాగా తగ్గింది. దేశీయంగా చేపల ఉత్పత్తిలో కొన్నిచోట్ల పరిధి మించి వాడుతున్నారు. ఇది మంచిది కాదు. వ్యాధుల నిర్ధారణలో లోపాలతోనూ దుష్ఫలితాలు సంభవిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలి.


 

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు