సీబీసీఎన్‌సీ కబంధ హస్తాల్లో రూ.72కోట్ల ప్రభుత్వ భూమి

విశాఖలోని సీబీసీఎన్‌సీ (ద కన్వెన్షన్‌ ఆఫ్‌ బాప్టిస్ట్‌ చర్చ్‌ ఆఫ్‌ ది నార్తన్‌ సర్కార్స్‌)కి రూ.62 కోట్ల టీడీఆర్‌ జారీ చేసిన వ్యవహారంలో దుమారం రేగుతుండగా ఇప్పుడు అందులో 3,600 గజాల ప్రభుత్వ స్థలం ఉందని తేలడంతో అధికార వర్గాల్లో కలకలం మొదలైంది.

Published : 30 Nov 2022 05:38 IST

జీవీఎంసీకి మార్టిగేజ్‌  చేసిన యాజమాన్యం
ఇప్పుడు హడావుడిగా బోర్డు ఏర్పాటు

విశాఖపట్నం (కార్పొరేషన్‌), న్యూస్‌టుడే: విశాఖలోని సీబీసీఎన్‌సీ (ద కన్వెన్షన్‌ ఆఫ్‌ బాప్టిస్ట్‌ చర్చ్‌ ఆఫ్‌ ది నార్తన్‌ సర్కార్స్‌)కి రూ.62 కోట్ల టీడీఆర్‌ జారీ చేసిన వ్యవహారంలో దుమారం రేగుతుండగా ఇప్పుడు అందులో 3,600 గజాల ప్రభుత్వ స్థలం ఉందని తేలడంతో అధికార వర్గాల్లో కలకలం మొదలైంది. ప్రస్తుతం ఆ స్థలం విలువ రూ.72 కోట్లు ఉంటుందని అంచనా. 2009లో రాష్ట్ర ప్రభుత్వం ఈ స్థలాన్ని సాంఘిక సంక్షేమశాఖకు అప్పగిస్తూ జీవో 99ని విడుదల చేసింది. దానికి సాంఘిక సంక్షేమశాఖ అధికారులు హద్దులు ఏర్పాటు చేసుకోవడంతోపాటు అక్కడ ఎస్సీ ఉప ప్రణాళిక నిధులతో కెరీర్‌ కౌన్సెలింగ్‌, గైడెన్స్‌ కేంద్రంతోపాటు అవసరమైన వసతి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాల్సి ఉంది. అయితే అధికారులు ఈ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేకపోగా, అక్కడ స్థలం ఉందనే విషయాన్ని మరచిపోయారు.

కలిపేసుకున్నా...పట్టించుకోలేదు

సీబీసీఎన్‌సీ 75/3 సర్వే నంబరులో 18,390 గజాల స్థలం ఉంది. 75/1 సర్వే నంబరులో సుమారు 2వేల గజాల్లో చర్చి నడుపుతున్నారు. 75/4లో 3,600 గజాల స్థలం సాంఘిక సంక్షేమశాఖకు ఉంది. ఆ స్థలాన్ని సీబీసీఎన్‌సీ యాజమాన్యం కలిపేసుకున్నా, పట్టనట్లు అధికారులు వ్యవహరించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రూ.72 కోట్ల విలువైన ఈ స్థలం చుట్టూ ప్రహరీ నిర్మించి లోపలికి ఎవరినీ అనుమతించకుండా సీబీసీఎన్‌సీ యాజమాన్యం వ్యవహరిస్తోంది. ఈ విషయం వెలుగుచూడటంతో మంగళవారం సాంఘిక సంక్షేమ, రెవెన్యూ అధికారులు స్థలం వద్దకు వచ్చి సర్వే చేయకుండా రహదారి పక్కనే బోర్డు ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. వాస్తవంగా అధికారులు ప్రహరీని తొలగించి తమకు కేటాయించిన స్థలం చుట్టూ హద్దులు ఏర్పాటు చేయాల్సి ఉంది.

*  ఒక స్థలానికి టీడీఆర్‌ మంజూరు చేయాలంటే తప్పని సరిగా సర్వే చేయాలి. సీబీసీఎన్‌సీ విషయంలో జీవీఎంసీ అధికారులు ఈ నిబంధనను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారు.

ప్రభుత్వ స్థలాన్ని మార్టిగేజ్‌ చేసేశారు..

సీబీసీఎన్‌సీలో నిర్మాణాలు చేపట్టడానికి యాజమాన్యం చేసిన ప్లాను దరఖాస్తులో డాక్యుమెంటు 5349/2021 ద్వారా జీవీఎంసీకి 961.23 చదరపు గజాల స్థలాన్ని మార్టిగేజ్‌ చేశారు. వాస్తవంగా ఈ స్థలం 75/3, 75/4 సర్వే నంబర్లలో ఉంది. 75/4 సర్వే నంబరులోని స్థలాన్ని సాంఘిక సంక్షేమశాఖకు కేటాయించినట్లు రికార్డుల్లో ఉంది. ఆ స్థలాన్ని ఎలా మార్జిగేజ్‌ చేశారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు