Amara Raja Batteries: పొగబెట్టి పంపేశారు..!

‘అమరరాజా బ్యాటరీస్‌ సంస్థ పోవడం కాదు.. ప్రభుత్వమే పొమ్మంటోంది’ అన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రభుత్వ వేధింపులతో అమరరాజా సంస్థ వేరే రాష్ట్రానికి తరలిపోనుందంటూ వచ్చిన వార్తలపై గతంలో ఆయన స్పందనిది.

Updated : 03 Dec 2022 14:19 IST

ప్రభుత్వ వేధింపులతో పక్క రాష్ట్రానికి వెళ్లిన అమరరాజా
తెలంగాణలో రూ.9,500 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం
ఈనాడు - అమరావతి

‘అమరరాజా బ్యాటరీస్‌ సంస్థ పోవడం కాదు.. ప్రభుత్వమే పొమ్మంటోంది’ అన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రభుత్వ వేధింపులతో అమరరాజా సంస్థ వేరే రాష్ట్రానికి తరలిపోనుందంటూ వచ్చిన వార్తలపై గతంలో ఆయన స్పందనిది. ‘అమరరాజా తరలిపోయేలా ప్రభుత్వం ఒత్తిడి తేవట్లేదు.. వారే లాభాల కోసం వెళ్లిపోతున్నారు’ అని మంత్రి బొత్స సత్యనారాయణ అప్పట్లో వ్యాఖ్యానించారు. ఒక భారీ పరిశ్రమ రాష్ట్రం నుంచి వెళ్లిపోతోందంటే... దాన్ని ఆపేందుకు ప్రయత్నించాల్సిన కీలక స్థానాల్లోని వ్యక్తుల బాధ్యతారాహిత్యానికి వీరి వ్యాఖ్యలే అద్దం పడతాయి. ఏ పరిశ్రమైనా నిబంధనల ప్రకారం పనిచేసేలా కచ్చితంగా చూడాల్సిందే. లోపాలుంటే సరిదిద్దుకునే అవకాశమిచ్చి, కొనసాగేలా చూడాలే తప్ప బయటకు పంపేయాలని చూడటం ప్రభుత్వ కక్ష సాధింపునకు నిదర్శనం.

వైకాపా ప్రభుత్వ వేధింపులతో తరలిపోయిన పరిశ్రమల్లో మరొకటి చేరింది. పరిశ్రమలు పెడతామని ఎవరైనా ముందుకొస్తే ప్రభుత్వాలు వారికి ఎర్ర తివాచీలతో స్వాగతం పలుకుతాయి. వారికి ఇవ్వగలిగినన్ని రాయితీలిస్తాయి. కానీ వైకాపా ప్రభుత్వం తీరే వేరు..! కొత్త పరిశ్రమల్ని ఆహ్వానించడం మాట అటుంచి.. ఉన్నవాటిని కాపాడుకోవడంపైనా శ్రద్ధ పెట్టదీ సర్కారు! పైగా, అవి గత ప్రభుత్వ హయాంలో తెచ్చిన పరిశ్రమలు గానీ, ప్రత్యర్థి పార్టీకి చెందినవారివి గానీ అయితే... వెంటాడి మరీ వేధిస్తుంది!

ఆంధ్రా పొమ్మంది.. తెలంగాణ రమ్మంది

తెదేపా ఎంపీ గల్లా జయదేవ్‌కి చెందిన కంపెనీ అన్న ఏకైక కారణంతో, రాజకీయ కక్ష సాధింపుతో అమరరాజా సంస్థపై జగన్‌ ప్రభుత్వం తీవ్రమైన వేధింపులకు పాల్పడింది. దాంతో ఆ సంస్థ చిత్తూరు జిల్లాలో తమ పరిశ్రమ విస్తరణ ఆలోచనను విరమించుకుంది. ఒక దశలో తమిళనాడుకు తరలించాలని ఆలోచించింది. అమరరాజా సంస్థ విస్తరణ ఆలోచన గురించి తెలిసి... తెలంగాణ ప్రభుత్వం వారికి సాదరస్వాగతం పలికింది. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక చొరవ తీసుకోవడం, పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇవ్వడంతో అత్యాధునిక లిథియం అయాన్‌ బ్యాటరీల పరిశోధన, తయారీ యూనిట్‌ను తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఏర్పాటు చేసేందుకు అమరరాజా ముందుకొచ్చింది. వచ్చే పదేళ్లలో రూ.9,500 కోట్ల పెట్టుబడులు పెడతామని ప్రకటించింది. దేశంలో బ్యాటరీల తయారీ రంగంలో అమరరాజా ప్రముఖ స్థానంలో ఉంది. అలాంటి సంస్థ ఏకంగా రూ.9,500 కోట్ల పెట్టుబడితో పరిశ్రమను ఏర్పాటుకు ముందుకొస్తే... వెంటాడి వేధించి తరిమికొట్టిన ఘనత వైకాపా ప్రభుత్వానికే దక్కుతుంది.

అమరరాజా తరలిపోతే నష్టపోయేదెవరు?

అమరరాజా తరలిపోవడం వల్ల నష్టం ఎవరికి? అమరరాజాకు ఏమీ నష్టం లేదు. ఏ పెట్టుబడిదారైనా... పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన వనరులు, వసతులు, సానుకూలంగా స్పందించే ప్రభుత్వం ఉన్నాయో లేవో చూసుకుంటారు. తెలంగాణ నుంచి పూర్తి సహకారం ఉంది కాబట్టి... వారికి ఎలాంటి ఇబ్బందీ లేదు. అమరరాజాను తరిమికొట్టేవరకూ నిద్రపోని వైకాపా నాయకులకు, మంత్రులకు వ్యక్తిగతంగా వచ్చిన నష్టమూ లేదు. నష్టపోయిందల్లా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రమే. వెనుకబడిన రాయలసీమలోని చిత్తూరు జిల్లాలో గల అమరరాజా ఫ్యాక్టరీల్లో 20వేల మంది ప్రత్యక్షంగా, 50వేల మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. ఆ సంస్థ మరో రూ.9,500 కోట్ల పెట్టుబడితో లిథియం అయాన్‌ బ్యాటరీల తయారీ పరిశ్రమను అక్కడే ఏర్పాటుచేస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా కొన్ని వేలమందికి ఉపాధి దొరికేది. ప్రభుత్వానికి పన్నుల రూపంలో భారీగా ఆదాయం సమకూరేది. పలు అనుబంధ పరిశ్రమలూ వచ్చేవి. రాబోయే కాలమంతా లిథియం అయాన్‌ బ్యాటరీలదే. ఆ రంగంలో ఇప్పటికే ముందంజలో ఉన్న అమరరాజా... ఆంధ్రప్రదేశ్‌లోనే ఆ పరిశ్రమను ఏర్పాటుచేసి ఉంటే రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు లభించేది. తెలంగాణలో ‘అమరరాజా గిగా కారిడార్‌’ను ఏర్పాటుచేస్తామని, దానిలో భాగంగా హైదరాబాద్‌లో దేశంలోనే మొదటి, అత్యాధునిక ఎనర్జీ రీసెర్చ్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌ ఏర్పాటుచేస్తామని ఆ సంస్థ ప్రకటించింది.

ఆదినుంచి వేధింపులే

గల్లా జయదేవ్‌ తెదేపా ఎంపీ అన్న ఒకే ఒక్క కారణంతో... ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారన్న అక్కసుతో... ఆయన కుటుంబానికి చెందిన అమరరాజా బ్యాటరీస్‌ సంస్థపై జగన్‌ ప్రభుత్వం కక్ష సాధింపునకు తెగబడింది. ముప్పేట దాడికి పాల్పడింది.

* అమరరాజా ఇన్‌ఫ్రాటెక్‌ సంస్థకు వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి హయాంలో కేటాయించిన 253.6 ఎకరాల భూముల్ని 2020 జూన్‌ 30న వెనక్కి తీసేసుకుంది. చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యం, యాదమరి మండలాల్లోని నూనెగండ్లపల్లి, 108-మహారాజా కొత్తపల్లి గ్రామాల్లో అమరరాజా కంపెనీకి 2009లో 483.27 ఎకరాల్ని ఏపీఐఐసీ కేటాయించింది. భూములు తీసుకుని పదేళ్లు అవుతున్నా ఒప్పందం ప్రకారం మొత్తం భూమిని వినియోగంలోకి తీసుకురాలేదని, 253.6 ఎకరాల్ని ఖాళీగా ఉంచేసిందని సాకుగా చూపించి, ఆ భూముల్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. దీనిపై అమరరాజా సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. రూ.2,700 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టామని, ఒప్పందంలో పేర్కొన్నదానికంటే ఎక్కువ మందికి ఉపాధి కల్పించామని కోర్టుకు తెలిపింది. దాంతో కోర్టు ప్రభుత్వ ఉత్తర్వులపై స్టే ఇచ్చింది.

* తర్వాత ప్రభుత్వం అమరరాజా బ్యాటరీస్‌పై పడింది. 2021 ఫిబ్రవరి, మార్చి నెలల్లో విడతల వారీగా అమరరాజా బ్యాటరీ కంపెనీల్లో కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారులు తనిఖీలు చేశారు. అక్కడ గాలిలో, మట్టిలో సీసం పరిమాణం నిర్దేశిత ప్రమాణాలకు మించి ఉన్నట్టు తమ అధ్యయనంలో వెల్లడైందని పీసీబీ పేర్కొంది. ఉద్యోగుల రక్తంలోనూ నిర్దేశిత పరిమితికి మంచి సీసం ఉనట్టు పరీక్షల్లో తేలిందని చెప్పింది.

* చిత్తూరు జిల్లా నూనెగుండ్లపల్లి, కరకంబాడిల్లో ఉన్న అమరరాజా బ్యాటరీ తయారీ యూనిట్లు పర్యావరణ అనుమతులు, నిర్వహణ షరతులు ఉల్లంఘించినందున వాటిని మూసేయాలని ఆదేశించింది.

*  2021 మే 1న అమరరాజా బ్యాటరీస్‌ పరిశ్రమకు ప్రభుత్వం విద్యుత్‌ సరఫరా నిలిపివేసింది. ప్రభుత్వ ఉత్తర్వులపై అమరరాజా సంస్థ హైకోర్టును ఆశ్రయించడంతో... కోర్టు స్టే ఇచ్చింది.

* ఆ తర్వాత కూడా తరచూ పీసీబీ తనిఖీల పేరుతో వేధింపులు కొనసాగిస్తోంది.

లోపాలు సరిదిద్దుకునేలా చేయాలే తప్ప తరిమికొట్టడమేంటి?

ఏ పరిశ్రమకైనా భూములు కేటాయించినప్పుడు ఏపీఐఐసీ కొన్ని నిబంధనలు పెడుతుంది. ఆ పరిశ్రమను పీసీబీ నిబంధనల ప్రకారం నడపాలి. పరిశ్రమలు వాటిని పాటించేలా చేయాల్సిన బాధ్యతా ప్రభుత్వంపై ఉంది. కానీ ఆ నిబంధనల సాకుతో కేవలం విపక్షాల వారి పరిశ్రమలపై కక్షసాధింపునకు పాల్పడటం, ఏకంగా వాటిని మూసివేయించాలని చూడటం వల్ల వాటిలో పనిచేస్తున్న వేలమంది కార్మికులు, రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలుగుతుంది. పరిశ్రమలో లోపాలుంటే... వాటిని సరిదిద్దుకోవాలని చెప్పి, ఆ పరిశ్రమ అక్కడే కొనసాగేలా చేయాలే తప్ప, రాష్ట్రం నుంచే పంపించేయాలనుకోవడం, పెట్టుబడులు తరలిపోయేలా చేయడం వివేకం కాదు.


తమిళనాడులోనూ పెట్టుబడులు..!

అమరరాజా సంస్థ తెలంగాణతో పాటు, తమిళనాడులోను, ఉత్తర భారతదేశంలోని మరో రాష్ట్రంలోనూ పెట్టుబడులు పెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా అమరరాజా యాజమాన్యాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆహ్వానించారు. చర్చలూ జరిగాయి. ఆ సంస్థ భవిష్యత్తులో తమిళనాడులోనూ పరిశ్రమను ఏర్పాటుచేసే అవకాశం ఉన్నట్టు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని