పైసలూ పోయే.. పరువూ పోయే!

ప్రభుత్వం మనదే కదా అనే ధీమాతో వారు కాంట్రాక్టు పనుల్లోకి దిగారు. పార్టీ ప్రతిష్ఠను కాపాడాలని ఉన్నదంతా పెట్టారు. అప్పులు చేసి మరీ ఖర్చు చేశారు. చివరికి నమ్మి నట్టేట మునిగారు. చేసిన పనులకు బిల్లులు రావడం లేదు. అప్పుల కుప్పయింది. 

Updated : 07 Feb 2023 07:13 IST

ప్రభుత్వ పనులకు సొంతంగా ఉన్నదంతా ఖర్చు
బిల్లులు రాక అప్పుల్లో కూరుకుపోయిన వైకాపా నేతలు
వారికి చెల్లించాల్సిన బకాయిలు రూ.520 కోట్లు
మనదే ప్రభుత్వమని నమ్మి నట్టేట మునిగారు
ఇదీ క్షేత్ర స్థాయి నాయకుల దీనావస్థ
ఈనాడు - అమరావతి, యంత్రాంగం

ప్రభుత్వం మనదే కదా అనే ధీమాతో వారు కాంట్రాక్టు పనుల్లోకి దిగారు. పార్టీ ప్రతిష్ఠను కాపాడాలని ఉన్నదంతా పెట్టారు. అప్పులు చేసి మరీ ఖర్చు చేశారు. చివరికి నమ్మి నట్టేట మునిగారు. చేసిన పనులకు బిల్లులు రావడం లేదు. అప్పుల కుప్పయింది. కుటుంబ పరువు కాపాడుకునేందుకు సొంత ఆస్తులను, ఇళ్లను తెగనమ్ముకుంటున్నారు. అయినా అప్పులు పూర్తిగా తీరక, రోడ్డున పడుతున్నారు. వీరిలో చాలామంది ఇంకొన్నాళ్లు చూస్తామని... ఎలాగోలా బిల్లులొస్తే ఈ రాజకీయాలు, ఈ పార్టీకో నమస్కారం పెట్టి వెళ్లిపోదామని అనుకుంటున్నారు.

వైకాపా సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, ఇతర నేతలు వారి స్థాయిలో రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లు, డిజిటల్‌ లైబ్రరీల భవనాలను నిర్మించారు. చేసిన పనులకు సంబంధించి వారికి రూ.520 కోట్ల మేర బిల్లులు పెండింగులో ఉన్నట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పనులు చేసేందుకు అప్పులు తెచ్చామని, వాటికి వడ్డీలు పెరుగుతున్నాయని నేతలు అల్లాడుతున్నారు. బాధితుల్లో కొందరు అధికారిక, అనధికారిక సమావేశాల్లో నిలదీస్తున్నారు. మరికొందరు నాయకులు, ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. చాలామంది బయటకు చెబితే అసలుకే మోసం అవుతుందేమోనన్న భయంతో మింగలేని, కక్కలేని స్థితిలో తీవ్ర క్షోభను అనుభవిస్తున్నారు.


పొలం, నగలు విక్రయించి.. ఇల్లు తాకట్టు

ప్రకాశం జిల్లా చినకంభం వైకాపా సర్పంచి షేక్‌ మహ్మద్‌ రసూల్‌. ప్రస్తుతం ఆయన సర్పంచుల సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి. ఆయనకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు సంతానం. కుమారుడు షేక్‌ హుస్సేన్‌ బాషా కంభంలోనే టీకొట్టు నడుపుతున్నారు. కోడలు షేక్‌ హబీబా తెదేపా ప్రభుత్వ హయాంలో చినకంభంలో వైకాపా సర్పంచిగా గెలిచారు. ఆమె ఆధ్వర్యంలో పంచాయతీలో రూ.1.50 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టారు. అందులో రూ.1.20 కోట్ల వరకు బిల్లులు వచ్చాయి. మరో రూ.30 లక్షలు రావాల్సి ఉంది. వైకాపా అధికారంలోకి వచ్చాక రసూల్‌ సర్పంచిగా ఎన్నికయ్యారు. గోవిందాపురంలో పైపులైను, ఎస్సీ కాలనీలో ఇంటింటికీ కుళాయిలు, ఉప్పువాగుపై వంతెన, సిమెంటు రోడ్డు, వాటర్‌ట్యాంకును నిర్మించారు. వీటికి సంబంధించి రూ.53 లక్షలు, ఆయన కోడలి సమయంలో రూ.30 లక్షలు కలిపి మొత్తంగా రూ.83 లక్షల బిల్లులు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. ‘అప్పులు తీర్చేందుకు ఎకరా పొలాన్ని రూ.20 లక్షలకి, రెండు ట్రాక్టర్లను రూ.10 లక్షలకు, భార్య, కుమార్తెల బంగారు నగలు, కమ్మలతోసహా అమ్మేశా. మా సోదరుడు రూ.10 లక్షలు, గ్రామస్థులు కొందరు రూ.20 లక్షలు సర్దుబాటు చేశారు. ఇంకా రూ.20 లక్షలకుపైగా అప్పులున్నాయి. పొట్టకూటి కోసం భార్యాపిల్లలు కూలీకి వెళుతున్నారు’ అని రసూల్‌ కన్నీటి పర్యంతం అయ్యారు.


నగరిలో మంత్రి పేచీ..!

గరి నియోజకవర్గంలోని వడమాలపేట మండలం పత్తిపుత్తూరులో గ్రామ సచివాలయం, ఆర్‌బీకే, బీఎంసీ నిర్మాణాలకు సంబంధించి తమకు రూ.25 లక్షలు రావాల్సి ఉందని జడ్పీటీసీ సభ్యుడు మురళీధర్‌రెడ్డి చెబుతున్నారు. వాటికి ఎంబుక్‌ రికార్డు చేయకుండా మంత్రి రోజా, ఆమె సోదరులు అడ్డుకుంటున్నారని ఆయన వాపోతున్నారు.


ఇదో భాస్కరుడి అప్పుల గాథ

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కేశవరావుపేట వైకాపా సర్పంచి పైడి భాస్కరరావుది మరో అప్పులగాథ. ‘రూ.10.6 లక్షలతో పాలశీతలీకరణ కేంద్ర భవనం, రూ.21.8 లక్షలతో రైతు భరోసా కేంద్రాన్ని 2021 అక్టోబరులోనే పూర్తి చేశా. ఇంకా రూ.7లక్షలు రావాల్సి ఉంది. 2021 సెప్టెంబరులో ఉపాధి హామీ కింద రూ.13 లక్షలతో కంకర రోడ్లు నిర్మించా. రూ.20 లక్షలతో సీసీ రోడ్లు, రూ.7 లక్షలతో వీధి కాలువలను నిర్మించా. ఒక్క పైసా తిరిగి రాలేదు’ అని భాస్కరరావు వాపోయారు.


రూ.45 లక్షలు రావాలి

‘మా పంచాయతీ పరిధిలో ఏడాది క్రితం రూ.10 లక్షలతో సీసీ రోడ్లు వేయించగా రూ.3లక్షలే వచ్చాయి. రూ.6 లక్షలతో షెడ్డు నిర్మించగా రూ.1.5 లక్షలు వచ్చాయి. డ్రైనేజీకి సంబంధించి రూ.20 లక్షలు, ఆర్‌బీకే, ఆరోగ్య కేంద్రం తదితర పనులవి కలిపి మొత్తంగా రూ.45 లక్షలు రావాల్సి ఉంది’ అని గిద్దలూరు నియోజకవర్గంలోని ఒక పంచాయతీ సర్పంచి భర్త వాపోతున్నారు.


అయిదు ఎకరాలు అమ్మేసుకుని...

మైలవరం నియోజకవర్గంలో ఒక ఉప సర్పంచి ఆర్బీకే భవనాలను నిర్మించారు. రూ.2 కోట్ల మేర బిల్లులు రాకపోవంతో అప్పులు తీర్చేందుకు అయిదు ఎకరాలను తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వచ్చింది. మునగపాక మండల వైకాపా నాయకుడు ఒకరు రూ.2 కోట్ల విలువైన పనులు చేశారు. బిల్లుల పెండింగ్‌తో 30 సెంట్ల వ్యవసాయ భూమిని అమ్ముకున్నారు.


తిరగ్గా... తిరగ్గా సగం వచ్చాయి

చిలీపట్నం నగరపాలక సంస్థ మాజీ కౌన్సిలర్‌ ప్రభుత్వ భవనాలు, రోడ్లు ఇతర పనులకు రూ.3 కోట్లు ఖర్చు చేశారు. రెండున్నరేళ్లయినా బిల్లులు రాలేదు. వైకాపా నియోజకర్గ, ఇతర సమావేశాల్లోనూ తరచూ ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య(నాని) దృష్టికి తీసుకెళ్తూనే ఉన్నారు. ఇటీవల రూ.కోటిన్నర మంజూరయ్యాయి.


ధైర్యం చేసి ప్రశ్నించినా...

తెనాలిలో డిసెంబరులో జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో మున్సిపాలిటీ పరిధిలోని పనులు చేసినా బిల్లులు రావడం లేదని 3వ వార్డు కౌన్సిలర్‌ ఆవుల కోటయ్య ఆవేదన వ్యక్తంచేశారు.

అచ్యుతాపురం మండలం మల్లవరం సర్పంచి పిన్నమరాజు వాసు మండల సర్వసభ్య సమావేశంలో రైతు భరోసా, సచివాలయం, వెల్‌నెస్‌ సెంటర్‌ నిర్మాణాలకు సంబంధించి బిల్లులు రాలేదని ఆందోళన చేశారు.

తిరువూరు నియోజకవర్గంలో వైకాపా జిల్లా పరిశీలకులు మర్రి రాజశేఖర్‌, రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి నిర్వహించిన పార్టీ సమీక్షలో... తాము చేసిన పనులకు బిల్లులు రాలేదని వారిని పలువురు నిలదీశారు.


బయటపడలేకపోతున్నారు ఇలా...

చిలకలూరిపేట నియోజకవర్గంలో ఒక మండల వైకాపా సమన్వయకర్త తన స్వగ్రామంలో వేసిన రోడ్లకు ఇంకా రూ.1.5 కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. తమను స్థానిక ఎమ్మెల్యే, మంత్రి విడదల రజిని పట్టించుకోవడం లేదనే ఆగ్రహంతో పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో ఆయన్ను సమన్వయకర్తగా తొలగించారు.

పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలంలోని 22 గ్రామాల్లో 20 సచివాలయాలు, 20 ఆర్‌బీకేలు, 14 వెల్‌నెస్‌ సెంటర్లను 22 మంది గుత్తేదారులు నిర్మిస్తున్నారు. వారికి గత ఏడాది మార్చి నుంచి రూ.2కోట్ల వరకు బిల్లులు జమకావడం లేదు.

కావలి మండలంలోని ముగ్గురు కాంట్రాక్టర్లకు జగనన్న కాలనీలు, జల్‌జీవన్‌ మిషన్‌(జేజేఎం) పనులకు సంబంధించి రూ.60 లక్షల బకాయిలు ఉన్నాయి. కోవూరు, ఇందుకూరుపేట మండలాల పరిధిలో ఆరుగురికి రూ.కోటి, నెల్లూరు గ్రామీణ పరిధిలో ఆరుగురురికి రూ.2కోట్ల బిల్లులు ఆగిపోయాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు