‘విశాఖ మెట్రోరైలు ప్రాజెక్టు కోసం.. ఏపీ నుంచి ప్రతిపాదనలు రాలేదు’

విశాఖ మెట్రోరైలు కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థికసాయం కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదనలూ రాలేదని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ తెలిపారు. ఆయన సోమవారం రాజ్యసభలో భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు.

Updated : 21 Mar 2023 08:49 IST

కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌

ఈనాడు, దిల్లీ: విశాఖ మెట్రోరైలు కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థికసాయం కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదనలూ రాలేదని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ తెలిపారు. ఆయన సోమవారం రాజ్యసభలో భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. ‘‘మెట్రోరైలు వ్యవస్థను ప్రణాళికా బద్ధంగా అమలుచేసి సుస్థిరంగా మార్చేందుకు మెట్రోరైల్‌ పాలసీ-2017ను రూపొందించాం. ఇంతవరకూ రాష్ట్ర ప్రభుత్వం దీని ప్రకారం ఎలాంటి ప్రతిపాదనలూ పంపలేదు. 2018లో తాము పీపీపీ విధానంలో లైట్‌రైల్‌ ప్రాజెక్టు నిర్మించాలనుకుంటున్నామని, దానికి కొరియన్‌ ఎగ్జిమ్‌ బ్యాంకు నుంచి ఆర్థికసాయం పొందడానికి సహకరించాలని కేంద్రాన్ని కోరింది. ఆ ప్రాజెక్టుకు సాయం చేయడానికి కొరియన్‌ బ్యాంకు నిస్సహాయత వ్యక్తంచేసింది. ఆ విషయాన్ని 2019 ఏప్రిల్‌లో ఏపీ ప్రభుత్వానికి చెప్పాం. ఆ ప్రాజెక్టుకు రుణసాయం కోసం ఇతర సంస్థలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించాం. ఏపీ ప్రభుత్వం మరే విదేశీ సంస్థకూ దరఖాస్తు సమర్పించలేదు’’ అని హర్‌దీప్‌సింగ్‌ తెలిపారు.


విమాన ప్రయాణికుల సంఖ్య ఇంకా పెరగలేదు

ఆంధ్రప్రదేశ్‌లోని ఆరు విమానాశ్రయాల నుంచి ప్రయాణించే వారి సంఖ్య ఇంకా కొవిడ్‌ ముందునాటి స్థితికి చేరుకోలేదు. 2019-20లో మొత్తం 51.65 లక్షల మంది ప్రయాణించగా 2020-21లో ఆ సంఖ్య 22.26 లక్షలకు పడిపోయింది. 2021-22లో 31.78 లక్షలకు చేరింది. 2022-23లో 49.28 లక్షలకు పెరిగింది. 2022-23నాటికి ప్రయాణికుల సంఖ్య పెరిగినట్లు కనిపించినా 2019-20కంటే 4.58% మేర తక్కువగా నమోదైంది. కొవిడ్‌కు ముందునాటి పరిస్థితులకంటే కడపలో 36%, విజయవాడలో 15%, విశాఖపట్నంలో 7% మేర ప్రయాణికుల సంఖ్య ఇప్పటికీ తక్కువగా నమోదవుతోంది. అయితే రాజమహేంద్రవరంలో 5.15%, తిరుపతిలో 11% మేర ప్రయాణికులు పెరిగారు. రాజ్యసభలో భాజపా సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర పౌరవిమానయానశాఖ సహాయమంత్రి వీకేసింగ్‌ బదులిచ్చారు. కడప, రాజమహేంద్రవరంలలో కొత్త డొమెస్టిక్‌ టెర్మినల్‌ భవనం, ఇతర నిర్మాణ పనులకు అనుమతులు మంజూరుచేసినట్లు చెప్పారు. విజయవాడలో న్యూ ఇంటిగ్రేటెడ్‌ పాసింజర్‌ టెర్మినల్‌ భవనం, దాని అనుబంధ పనులు జరుగుతున్నట్లు వెల్లడించారు.


ఏపీ ప్రభుత్వానికే లిథియం గనుల వేలం బాధ్యత

ఆంధ్రప్రదేశ్‌లో కడప, అనంతపురం జిల్లాల్లో విస్తరించిన పార్నపల్లె-లోపనూతుల ప్రాంత లిథియం గనులను కాంపోజిట్‌ లైసెన్సులతో కలిపి వేలం వేసే బాధ్యతలను ఏపీ ప్రభుత్వానికే అప్పగించినట్లు కేంద్ర గనులశాఖ మంత్రి ప్రహ్లాద్‌జోషి తెలిపారు. రాజ్యసభలో వైకాపా సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన ఈమేరకు బదులిచ్చారు. ఇక్కడ జియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా నిర్వహించిన జి-4 సర్వేలో తాటిరెడ్డిపల్లె బ్లాక్‌ను గుర్తించినట్లు చెప్పారు. ఈ గనిని లీజుకు తీసుకున్నవారు ఇక్కడినుంచి వెలికితీసే లిథియం ఖనిజం సగటు అమ్మకం ధరపై రాష్ట్ర ప్రభుత్వానికి 12% రాయల్టీ చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు.


కాకినాడ-వైజాగ్‌-శ్రీకాకుళం గ్యాస్‌ పైప్‌లైన్‌ గడువు పొడిగింపు

కాకినాడ-వైజాగ్‌-శ్రీకాకుళం మధ్య సహజవాయు సరఫరా పైప్‌లైన్‌ నిర్మాణ పూర్తి గడువును 2024 జూన్‌ వరకు పొడిగించినట్లు కేంద్ర పెట్రోలియంశాఖ సహాయమంత్రి రామేశ్వర్‌ తేలి తెలిపారు. సోమవారం రాజ్యసభలో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని