సంక్షిప్త వార్తలు(8)

వైఎస్సార్‌ పింఛను కానుక కింద అందించే పింఛన్లను ఏప్రిల్‌ 3 నుంచి పంపిణీ చేయనున్నట్లు సెర్ప్‌ సీఈవో ఇంతియాజ్‌ తెలిపారు.

Updated : 30 Mar 2023 05:52 IST

3 నుంచి పింఛన్ల పంపిణీ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వైఎస్సార్‌ పింఛను కానుక కింద అందించే పింఛన్లను ఏప్రిల్‌ 3 నుంచి పంపిణీ చేయనున్నట్లు సెర్ప్‌ సీఈవో ఇంతియాజ్‌ తెలిపారు. ఏప్రిల్‌ 1న ఆర్థిక సంవత్సరం ప్రారంభం, 2న ఆదివారం అయినందున బ్యాంకులు పని చేయవని, అందుకే 3నుంచి పింఛను పంపిణీ చేస్తామని వెల్లడించారు.


దళిత ఉద్యోగులకు ఇబ్బందులొస్తే మాట్లాడతాం

ఎస్సీ, ఎస్టీ గెజిటెడ్‌ అధికారుల సంక్షేమ సంఘం 

ఈనాడు డిజిటల్‌, అమరావతి: దళిత ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా ప్రభుత్వంతో మాట్లాడి న్యాయం చేస్తామని ఎస్సీ, ఎస్టీ గెజిటెడ్‌ అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సునీల్‌ కుమార్‌ పేర్కొన్నారు. సంఘ ప్రతినిధులతో కలిసి ఆయన విజయవాడలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. ‘పశుసంవర్ధకశాఖ ఉన్నతాధికారి అర్హత లేని ఓ వ్యక్తిని అచ్చెన్న దగ్గర నియమించారు. దాని మీదే ఆయన ఫిర్యాదు చేశారు. ఇదే హత్యకు దారి తీసిందని అనుకుంటున్నాం. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం’ అని పేర్కొన్నారు.


జిల్లా కోర్టుల్లో ఉద్యోగాల భర్తీ ఫలితాలు వెల్లడి

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని జిల్లా కోర్టుల్లో వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన రాతపరీక్ష ఫలితాలను హైకోర్టు పరిపాలన విభాగం బుధవారం ప్రకటించింది. ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థుల వివరాలు హైకోర్టు వెబ్‌సైట్లో ఉంచింది. నాన్‌టెక్నికల్‌ పోస్టులైన జూనియర్‌ అసిస్టెంట్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్‌, ఎగ్జామినర్‌, రికార్డు అసిస్టెంట్‌, ప్రాసెస్‌ సర్వర్‌, ఆఫీసు సబార్డినేట్‌ ఉద్యోగాలకు ప్రాథమికంగా ఎంపికైన వారిజాబితాను వెల్లడించింది. టెక్నికల్‌ పోస్టులైన స్టెనోగ్రాఫర్‌, టైపిస్ట్‌, కాపీయిస్టు, డ్రైవర్‌ పోస్టుల నైపుణ్య పరీక్షకు 1:3 నిష్పత్తిలో ఎంపికైనవారి వివరాలను ప్రకటించింది. నైపుణ్య పరీక్ష నిర్వహణ తేదీని తర్వాత వెల్లడిస్తామంది. దిగువ కోర్టుల్లో మొత్తం 3,432 ఉద్యోగాలను హైకోర్టు భర్తీ చేస్తోంది.


రాష్ట్ర ఆహార ప్రయోగశాలకు  రూ.10 కోట్లు విడుదల

ఈనాడు, అమరావతి: విశాఖపట్నంలోని ప్రాంతీయ ప్రజా ఆరోగ్య ప్రయోగశాల ప్రాంగణాన్ని కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకం కింద రాష్ట్ర ఆహార ప్రయోగశాలగా నోటిఫై చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి విడతగా రూ.10.16 కోట్లను భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ విడుదల చేసింది.


పోలవరాన్ని వేగంగా పూర్తి చేయండి

కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌కు సాధికార సమితి వినతి

ఈనాడు, దిల్లీ: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రాజెక్టు సాధికార సమితి ఛైర్మన్‌ జీవీఆర్‌ శాస్త్రి, కన్వీనర్లు వెలగపూడి గోపాలకృష్ణ ప్రసాద్‌, అక్కినేని భవానీ ప్రసాద్‌లు కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌కు విజ్ఞప్తి చేశారు. బుధవారం ఇక్కడ కేంద్ర మంత్రిని వారు కలిసి 27 పేజీల సవివర వినతిపత్రం సమర్పించారు. కేంద్ర మంత్రితో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలపై కూలంకషంగా చర్చించినట్లు సమావేశానంతరం వెలగపూడి గోపాలకృష్ణప్రసాద్‌ తెలిపారు.  సహాయ, పునరావాస కార్యక్రమాలకు అవసరమైన నిధుల సమీకరణకు ప్రణాళిక రూపొందిస్తున్నామని, కేంద్ర ప్రభుత్వం శాస్త్రీయ పద్ధతిలో ఆడిట్‌, పూర్తి స్థాయి అధ్యయనం చేసిన తర్వాత దీనికి పరిష్కారం చూపుతామని ఆయన చెప్పినట్లు వెల్లడించారు. డ్యాంను 45.72 మీటర్ల ఎత్తు వరకు నిర్మించడానికి కేంద్ర మంత్రి అంగీకరించారన్నారు. ఈ ప్రాజెక్టుకు అయ్యే ఆర్‌ అండ్‌ ఆర్‌ను రెండు విభాగాలుగా విభజించి అమలు చేయడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు జీవీఆర్‌ శాస్త్రి తెలిపారు. పోలవరం సాధికార సమితి ఆధ్వర్యంలో రాజమండ్రిలో నిర్వహించనున్న సమావేశానికి హాజరవుతానని చెప్పినట్లు పేర్కొన్నారు.


దళితులపై దాడులు వాస్తవమే కానీ...: మంత్రి మేరుగు

వినుకొండ, న్యూస్‌టుడే: ‘మా ప్రభుత్వంలో దళితులపై దాడులు జరిగాయి.. కాదనడం లేదు.. కానీ ముఖ్యమంత్రి స్పందించిన తీరు.. నిందితులను అరెస్టు చేయించి జైలులో పెట్టించిన చరిత్ర మా ప్రభుత్వానిది...’ అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కార్యాలయంలో ఆయనతో కలిసి బుధవారం మంత్రి విలేకర్లతో మాట్లాడారు. చంద్రబాబునాయుడు 14 ఏళ్ల పాలనలో దళితులను వేధించిన కేసులు ఎన్నో ఉన్నా వాటిని ఆయన పట్టించుకున్న దాఖలాల్లేవు. అదే వైకాపా పాలనలో జరిగిన సంఘటనలపై ప్రభుత్వం వెంటనే స్పందించి నిజమైన వాటిపై వెంటనే చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వైకాపా ఎమ్మెల్యేలు 40 మంది టచ్‌లో ఉన్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చెప్పిన మాటల్లో నిజం లేదన్నారు.


టోల్‌ రుసుముల పెంపు ఉపసంహరించుకోవాలి

ఏపీ లారీ యజమానుల సంఘం

ఈనాడు, అమరావతి: రవాణా రంగం సంక్షోభంలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏప్రిల్‌ ఒకటి నుంచి అమలు చేయాలనుకున్న టోల్‌ రుసుముల పెంపును కేంద్రం ఉపసంహరించుకోవాలని, అయిదేళ్లకోసారే వీటి పెంపుపై సమీక్ష జరిపేలా చూడాలని ఏపీ లారీ యజమానుల సంఘం కోరింది. లారీ యజమానులకు డీజిల్‌ తర్వాత ఎక్కువ ఖర్చయ్యేది టోల్‌ రుసుములకేనని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.వి.ఈశ్వరరావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. జాతీయ లాజిస్టిక్‌ విధానంలో కేంద్రం.. రవాణా ఖర్చును 15 నుంచి 9 శాతానికి తగ్గించాలని చెప్పిందన్నారు. డీజిల్‌ రేటు, టోల్‌ రుసుములు తగ్గించకుండా రవాణా ఖర్చు ఎలా తగ్గించగలరో చెప్పాలని కోరారు.


31న 10 నిమిషాలు వాహనాలు నిలిపేసి  టోల్‌ఫీజులపై నిరసన

ఈనాడు, అమరావతి: టోల్‌ రుసుముల పెంపును నిరసిస్తూ ఈ నెల 31న మధ్యాహ్నం 12 నుంచి 12.10 గంటల వరకు పది నిమిషాలపాటు ఎక్కడికక్కడ వాహనాలు నిలిపేసి నిరసన తెలపాలని ఏపీఎస్‌ఆర్టీసీ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌డబ్ల్యూఎఫ్‌) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అయ్యప్పరెడ్డి బుధవారం ఓ ప్రకటనలో కోరారు. ఈ మేరకు ఆల్‌ ఇండియా రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్‌) దేశవ్యాప్తంగా వాహన యజమానులకు ఇచ్చిన పిలుపునకు సంపూర్ణ మద్దతిస్తున్నామన్నారు. ఆర్టీసీ కార్మికులు, ఆటో డ్రైవర్లు, వ్యక్తిగత వాహనదారులు, ఇతర వాహనాల యజమానులు ఈ నిరసనలో పాల్గొనాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని