దళితుల సత్తా ఏంటో చూపిస్తారు

‘దళితవర్గాలు 80 శాతం మంది మీకు ఓటు వేశారని చెబుతున్నారు. వారిని దూరం చేసుకుంటే సత్తా ఏంటో చూపిస్తారు’ అని సీఎం జగన్‌ను మాదిగ రిజర్వేషన్‌ పోరాటసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ హెచ్చరించారు.

Updated : 01 Apr 2023 05:56 IST

సీఎంకు మంద కృష్ణమాదిగ హెచ్చరిక
మంత్రి సీదిరికి చేదు అనుభవం
విజయవాడలో ఉద్రిక్తత

ఈనాడు-అమరావతి, న్యూస్‌టుడే-విజయవాడ సిటీ: ‘దళితవర్గాలు 80 శాతం మంది మీకు ఓటు వేశారని చెబుతున్నారు. వారిని దూరం చేసుకుంటే సత్తా ఏంటో చూపిస్తారు’ అని సీఎం జగన్‌ను మాదిగ రిజర్వేషన్‌ పోరాటసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ హెచ్చరించారు. తన సొంత జిల్లాలో దళిత అధికారి హత్యకు గురైతే సీఎం ఎందుకు మౌనం పాటిస్తున్నారని ప్రశ్నించారు. డాక్టర్‌ అచ్చెన్న హత్యపై హైకోర్టు సిటింగ్‌ జడ్జితో విచారణ జరపాలని, రూ.కోటి పరిహారం అందించాలని డిమాండు చేశారు. విజయవాడలో ఏపీ ఎస్సీ, ఎస్టీ గెజిటెడ్‌ అధికారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంతాపసభ, నిరసన కార్యక్రమం చేపట్టారు. దళిత అధికారి హత్య వెనుక ఉన్నతాధికారి హస్తం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నా సీఎం ఎందుకు విచారణకు ఆదేశించట్లేదని కృష్ణమాదిగ ప్రశ్నించారు. మృతదేహం లభించకపోతే అసలు హత్య విషయం తెలిసేదే కాదని ఎస్పీ వ్యాఖ్యానించారంటే.. పోలీసు దర్యాప్తు ఎలా ఉందో అర్థమవుతుందన్నారు.

మంత్రితో వాగ్వాదం...

అక్కడికి చేరుకున్న పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజును వారంతా నిలదీశారు. ఆయనను చుట్టుముట్టి ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ‘ఒక దళిత అధికారి మీ శాఖలో హత్యకు గురైతే విచారణ జరిగే తీరు ఇదేనా? ఎస్సీ, ఎస్టీ, బీసీలకు జరిగే న్యాయం ఇదేనా? డైరెక్టర్‌ స్థానంలో దళిత వర్గాలు ఉంటే ఇలాగే వ్యవహరించేవారా? ముందుగా డైరెక్టర్‌ను పదవి నుంచి తప్పించండి. సిటింగ్‌ జడ్జితో విచారణ చేయించండి. ఆయన తప్పులేదని తేలితే.. పదోన్నతులు ఇచ్చుకోండి. మాకు అభ్యంతరం లేదు. కానీ తప్పు ఉందని తేలితే కఠినంగా శిక్షించేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదు’ అంటూ ఆగ్రహం ప్రదర్శించారు. మంత్రి అప్పలరాజు ముందు బైఠాయించి నిరసన తెలుపుతూ నినాదాలు చేశారు. గెజిటెడ్‌ అధికారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజశేఖర్‌, ప్రధాన కార్యదర్శి నాగరాజు, అసోసియేట్‌ అధ్యక్షుడు శివరామకృష్ణ, నాయకులు వెంకటేశ్వర్లు, ప్రసాద్‌, దినకర్‌, కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.


కాపులంటే జగన్‌కు భయం : మంద కృష్ణమాదిగ

విజయవాడ(అలంకార్‌కూడలి), గుంటూరు, న్యూస్‌టుడే: రాష్ట్రంలో కాపు సామాజికవర్గాన్ని చూసి సీఎం జగన్‌కు భయం పట్టుకుందని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ విమర్శించారు. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలనే డిమాండుతో శుక్రవారం విజయవాడ ధర్నాచౌక్‌లో నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలపై పెట్టిన కేసులను ప్రభుత్వం ఎత్తేయాలని కోరారు. అమలాపురం ఘటనలో కాపులపై పెట్టిన కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకుందని గుర్తుచేశారు. కాపులంటే జగన్‌కు భయం అని, అందుకే కేసులు ఎత్తేశారని ఆరోపించారు. మాదిగలపై కేసులను బేషరతుగా ఉపసంహరించుకోకపోతే భవిష్యత్తులో జగన్‌కు బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ జాతీయ అధ్యక్షుడు డా.మున్నంగి నాగరాజు మాదిగ, ఉమ్మడి కృష్ణాజిల్లా ఎమ్మార్పీఎస్‌ సమన్వయకర్త మంద వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే శ్రీదేవికి అండగా ఉంటాం:  తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై వైకాపా సోషల్‌ మీడియా చేస్తున్న ప్రచారాన్ని మందకృష్ణ మాదిగ ఖండించారు. గుంటూరు కలెక్టరేట్‌ ఎదుట ధర్నాలో ఆయన మాట్లాడారు. ఈ విషయంలో తాము ఎమ్మెల్యే శ్రీదేవికి అండగా ఉంటామన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని