సంక్షిప్త వార్తలు(5)

గ్రామ, వార్డు సచివాలయాల్లో సోమవారం నుంచి కొత్త జిల్లాల చిరునామాతో ఆధార్‌కార్డులను జారీ చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

Updated : 02 Apr 2023 04:54 IST

కొత్త జిల్లాల చిరునామాతో ఆధార్‌కార్డుల జారీ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో సోమవారం నుంచి కొత్త జిల్లాల చిరునామాతో ఆధార్‌కార్డులను జారీ చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పడినా ఆ చిరునామాతో ఆధార్‌ జారీ చేయడానికి సాంకేతికంగా పలు ఇబ్బందులు తలెత్తాయి. తాజాగా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) సూచించిన ఫార్మాట్‌లో కొత్త ఆధార్‌కార్డుల జారీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.


ఎండీయూ వాహనాల బీమా
ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది

ఈనాడు, అమరావతి: ఇంటింటికి రేషన్‌ సరఫరాకు సంబంధించిన వాహనాలకు 2022-23 సంవత్సరం నుంచి వాహన మిత్ర పథకం కింద ప్రభుత్వమే బీమా చెల్లిస్తుందని మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు స్పష్టం చేశారు. మొబైల్‌ వాహన ఆపరేటర్లతో (ఎండీయూ) శనివారం తణుకులో సమావేశమయ్యారు. ‘ప్రభుత్వ సూచనలకు విరుద్ధంగా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా వ్యవహరించడంతో ఈ సమస్య తలెత్తింది. సీఎం ఆదేశాలతో 2021 సంవత్సరానికి సంబంధించిన ప్రీమియం మొత్తాన్ని ఆపరేటర్లకు ఇవ్వనున్నారు’ అని మంత్రి కారుమూరి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.


గుంటూరు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా సురేష్‌ విజయం

గుంటూరు లీగల్‌, న్యూస్‌టుడే: గుంటూరు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా కేవీకే సురేష్‌ విజయం సాధించారు. ఆయన తెదేపా లీగల్‌ సెల్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పనిచేస్తున్నారు. శుక్రవారం జరిగిన ఎన్నికల్లో తెదేపా మద్దతుతో సురేష్‌, వైకాపా మద్దతుతో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కాసు వెంకటరెడ్డి, మరో ఇద్దరు న్యాయవాదులు పోటీపడ్డారు. శుక్రవారం అర్ధరాత్రి ఓట్ల లెక్కింపు ప్రారంభమవగా, శనివారం ఉదయం 6 గంటలకు ఫలితాలు వెల్లడయ్యాయి. సురేష్‌కు 769 ఓట్లు రాగా సమీప ప్రత్యర్థి వెంకటరెడ్డికి 734 ఓట్లు దక్కాయి. గుంటూరు బార్‌ అసోసియేషన్‌ 1924లో ఏర్పాటైంది.


పదోసారి ప్రపంచ ఛాంపియన్‌గా శ్రీచైతన్య స్కూల్‌

ఈనాడు, హైదరాబాద్‌: అమెరికా నాసా వారు నిర్వహించిన ‘ఎన్‌ఎస్‌ఎస్‌ సెటిల్‌మెంట్‌ కాంటెస్ట్‌-2023’లో శ్రీచైతన్య స్కూల్‌ వరుసగా పదో సంవత్సరం కూడా వరల్డ్‌ ఛాంపియన్‌గా నిలిచిందని ఆ స్కూల్‌ డైరెక్టరు సీమ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రపంచంలోని 30కి పైగా దేశాలు పాల్గొన్న ఈ పోటీలో తమ పాఠశాల విద్యార్థులు భారతదేశాన్ని మొదటి స్థానంలో నిలిపారని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా 138 ప్రాజెక్టులు ఎంపికవగా వాటిలో 89 ప్రాజెక్టులు భారతదేశం నుంచే ఎంపికయ్యాయని, అందులోనూ 54 ప్రాజెక్టులు చైతన్య స్కూల్‌వేనని చెప్పారు.


హజ్‌ యాత్రకు 2,319 మంది ఎంపిక

విజయవాడ, న్యూస్‌టుడే: హజ్‌యాత్రకు 2,319 మంది ఎంపికయినట్లు రాష్ట్ర హజ్‌ కమిటీ ఛైర్మన్‌ బీఎస్‌ గౌస్‌ లాజమ్‌ తెలిపారు. విజయవాడలో శనివారం విలేకర్లతో ఆయన మాట్లాడారు. యాత్రికులు ఒకొక్కరు అడ్వాన్సుగా రూ.80 వేలు, ప్రాసెసింగ్‌ రుసుం రూ.300, ఇతర రుసుముల కింద రూ.1,500 మొత్తం రూ.81,800 డిపాజిట్‌ను ఈ నెల 7వ తేదీ లోపు చెల్లించాలన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని