తిరుపతి జూలో పులి పిల్ల మృతి.. నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమా!

తిరుపతి శ్రీవేంకటేశ్వర జంతు ప్రదర్శనశాలలో పునరావాసం పొందుతున్న నాలుగున్నర నెలల పెద్దపులి పిల్ల(ఆడ)  మృతి చెందిన విషయం బుధవారం వెలుగులోకి వచ్చింది.

Published : 01 Jun 2023 03:45 IST

తిరుపతి (జీవకోన), న్యూస్‌టుడే: తిరుపతి శ్రీవేంకటేశ్వర జంతు ప్రదర్శనశాలలో పునరావాసం పొందుతున్న నాలుగున్నర నెలల పెద్దపులి పిల్ల(ఆడ)  మృతి చెందిన విషయం బుధవారం వెలుగులోకి వచ్చింది. రెండు రోజుల కిందటే చనిపోయినా జూ అధికారులు విషయం దాచడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. నంద్యాల జిల్లా గువ్వలకుంట్ల రిజర్వు అటవీ ప్రాంతంలో తల్లి నుంచి వేరైన 4 పెద్దపులి పిల్లలను మార్చి 9న జూకు తీసుకొచ్చారు. అప్పటికే 50 రోజుల వయసున్న పిల్లలను సంరక్షణ కేంద్రంలో ఉంచి 3 నెలలు పర్యవేక్షించారు. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాయని నిర్ధారించుకున్నాక వాటిని ఈ నెల 27న ప్రత్యేక రెస్క్యూ హోంలోకి మార్చారు. కొన్ని రోజుల్లో పర్యాటకుల సందర్శనార్థం తీసుకురావాలని భావిస్తుండగా ఇంతలోనే ఈ ఘటన జరిగింది. లివర్‌, కిడ్నీ పాడవడంతోనే మృతి చెందిందని జూ అధికారులు చెబుతున్నారు. 27న సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు నిర్ధారించుకున్న అధికారులు 29న అనారోగ్యంతో చనిపోయినట్లు చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. పులి పిల్ల చనిపోవడానికి ముందురోజు యానిమల్‌ కేర్‌టేకర్‌ ఆహారం పెట్టే సమయంలో దాని ముందు కాలు పట్టి లాగాడని.. దాంతో కాలు విరిగి, తీవ్ర రక్తస్రావమై చనిపోయినట్లు విశ్వసనీయ సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని