60 రోజుల్లో మంత్రివర్గ నిర్ణయాలు అమలు

ఉద్యోగులకు సంబంధించి మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను 60రోజుల్లోగా అమలు చేయాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి జరగాల్సిన మంచి ఏదైనా చేస్తామని, ఉద్యోగులు బాగుంటేనే ప్రజలు బాగుంటారని విశ్వసించే ప్రభుత్వం తమదని వెల్లడించారు.

Published : 10 Jun 2023 05:25 IST

ఉద్యోగుల జీవన ప్రమాణాలు నిలబెట్టేలా జీపీఎస్‌ తీసుకొచ్చాం
సుప్రీంకోర్టు తీర్పులకు లోబడి కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ
ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం జగన్‌

ఈనాడు, అమరావతి: ఉద్యోగులకు సంబంధించి మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను 60రోజుల్లోగా అమలు చేయాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి జరగాల్సిన మంచి ఏదైనా చేస్తామని, ఉద్యోగులు బాగుంటేనే ప్రజలు బాగుంటారని విశ్వసించే ప్రభుత్వం తమదని వెల్లడించారు. కొత్తగా గ్యారెంటీ పింఛను స్కీం(జీపీఎస్‌) తీసుకురావడం, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ప్రభుత్వంలో ఏపీ వైద్య విధాన పరిషత్తు ఉద్యోగుల విలీనం, పీఆర్సీ కమిటీ ఏర్పాటు సహా రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలపై కృతజ్ఞతలు తెలిపేందుకు క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సీఎం జగన్‌ను ఉద్యోగ సంఘాల నాయకులు కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌ మాట్లాడుతూ.. ‘‘పెన్షన్‌ సహా కొన్ని పరిష్కారాల కోసం రెండేళ్లుగా తపన పడ్డాం. విశ్రాంత ఉద్యోగుల జీవన ప్రమాణాలను నిలబెట్టేలా జీపీఎస్‌ను రూపొందించాం. బేసిక్‌ జీతంలో 50శాతం అంటే రూ.లక్ష జీతం ఉంటే రూ.50వేలు పెన్షన్‌ వస్తుంది. 62ఏళ్లకు పదవీవిరమణ పొందితే 82ఏళ్లలోనూ అదే స్థాయిలో జీవన ప్రమాణాలు ఉండాలి. అందుకే ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకొని డీఆర్‌ ఇచ్చేలా జీపీఎస్‌లో పొందుపరిచాం. సీపీఎస్‌లో లేనివి జీపీఎస్‌లో ఉన్నాయి. రెండేళ్లపాటు జీపీఎస్‌పై ఆర్థికశాఖ సుదీర్ఘ కసరత్తు చేసింది’’ అని తెలిపారు.

కోర్టు తీర్పు పరిగణనలోకి తీసుకొని..

‘‘సుప్రీంకోర్టు తీర్పులను పరిగణనలోకి తీసుకుని కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేశాం. ఉద్యోగులకు గరిష్ఠంగా మేలు జరిగేలా నిర్ణయం తీసుకున్నాం. వైద్య విధాన పరిషత్‌ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశాం. ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చినట్లు వీరికి జీతాలు సమయానికి రావడం లేదు. పదవీవిరమణ తర్వాత ప్రయోజనాల్లోనూ వ్యత్యాసం ఉంది. వారికి మంచి పరిష్కారం చూపించే దిశగా చర్యలు తీసుకుంటున్నాం. భవిష్యత్తులోనూ ప్రభుత్వం వైపు నుంచి ఏ రకమైన మంచి జరగాల్సి ఉన్నా.. మీ మోహంలో చిరునవ్వు ఉండేటట్లు చేస్తాం’’ అని పేర్కొన్నారు.


ఏపీ ఎన్జీఓ, ఐకాస ఎప్పుడూ అండగా ఉంటుంది
- బండి శ్రీనివాసరావు, అధ్యక్షుడు ఏపీ ఎన్జీఓ

కేంద్రం సహకరించకపోయినా.. ఏ రాష్ట్రానికి నిధులు ఇవ్వకపోయినా పథకాలకు నిధులు ఇచ్చే బటన్‌ నొక్కుడు ఆగకుండా జరుగుతోంది. అది భగవంతుడు మీకు ఇచ్చిన శక్తి. ఉద్యోగులు ఎప్పుడూ మన ప్రభుత్వానికి అండగా ఉంటారు. నిన్నటి నుంచి చూస్తున్నాం పాలాభిషేకాలు చేస్తున్నారు. మమ్మల్ని రమ్మంటుంటే మీరే చేయండని చెబుతున్నాం. ఏపీ ఎన్జీఓ, ఏపీ ఐకాస మీకు ఎప్పుడూ అండగా ఉంటుంది.


అడక్కుండానే పీఆర్సీ వేస్తామన్నారు
- శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి, ఏపీ ఎన్జీఓ

గతంలో ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నా.. ఇప్పుడు మాతో పడని వారు సైతం ఉద్యమం ఎందుకు సిగ్గుపోతుందని అనేలా పరిస్థితి తీసుకువచ్చారు. కాంట్రాక్టు ఉద్యోగులు 10వేల మంది మిమ్మల్ని నిద్రలోనూ మర్చిపోరు. పీఆర్సీ కావాలంటే రోడ్డుపైకి రావాల్సి వచ్చేది. ఇప్పుడు అడక్కుండానే ఊహించని విధంగా సకాలంలో పీఆర్సీ వేస్తామన్నారు.


రుణపడి ఉంటాం
- రత్నాకర్‌ బాబు, అధ్యక్షుడు, కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం

క్రమబద్ధీకరణతో కాంట్రాక్టు ఉద్యోగుల ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. కాంట్రాక్టు ఉద్యోగులుగా జీవితం అంతమైపోతుందేమో అనుకున్నాం. తరతరాలకు రుణ పడి ఉంటాం.


హామీ మేరకు చేయకపోయినా ప్రత్యామ్నాయం తెచ్చారు
-వెంకట్రామిరెడ్డి, అధ్యక్షుడు, ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం

సీపీఎస్‌ రద్దుపై సీఎం జగన్‌ పాదయాత్రలో చెప్పినట్లు చేయకపోయినా ప్రత్యామ్నాయం తీసుకొచ్చారు. పాత పెన్షన్‌ పథకం వారితో సమానంగా ప్రయోజనం కలిగేలా జీపీఎస్‌ తెచ్చారు. పూర్తిగా విధివిధానాలు బయటకు రాకపోవడంతో ఉద్యోగుల్లో అనుమానాలున్నాయి. ఉద్యోగుల ఇళ్ల స్థలాలకు ప్రతి జిల్లా కేంద్రంలో 50ఎకరాలు ఇవ్వాలని సీఎంను కోరాం. గత పీఆర్సీలో మేము ఆశించింది జరగలేదు.


99శాతం హామీలు అమలు చేశాం
పేర్ని నాని, మాజీ మంత్రి

ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 99శాతం హామీలను సీఎం జగన్‌ అమలు చేశారు. సీపీఎస్‌ రద్దు చేస్తానని మచిలీపట్నంలో పాదయాత్ర సందర్భంగా హామీ ఇచ్చారు. సీపీఎస్‌ను రద్దు చేసి, జీపీఎస్‌ను ప్రభుత్వం తీసుకువచ్చింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని