సంక్షిప్త వార్తలు (8)

వరుసగా రుణాలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వచ్చే మంగళవారం మరో రూ.1,000 కోట్లను సమీకరించబోతోంది.

Updated : 10 Jun 2023 05:50 IST

మరో రూ.1,000 కోట్ల రుణం కోసం

ఈనాడు-అమరావతి: వరుసగా రుణాలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వచ్చే మంగళవారం మరో రూ.1,000 కోట్లను సమీకరించబోతోంది. రిజర్వుబ్యాంకు నిర్వహించే సెక్యూరిటీల వేలంలో పాల్గొని రూ.500 కోట్ల చొప్పున రెండు విధాలుగా రుణం అవసరమని వర్తమానం పంపింది. రూ.500 కోట్లు 12 ఏళ్ల కాలపరిమితికి, మరో రూ.500 కోట్లు 15 ఏళ్ల కాలపరిమితితో అవసరమని తెలియజేసింది. జూన్‌ 13న ఈ రుణం ఖరారుకానుంది.


నేడు ‘కాంట్రాక్టు లెక్చరర్ల గోడు’ సమావేశం

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ, పాలిటెక్నిక్‌ కళాశాలల్లో పని చేస్తున్న ప్రతి ఒప్పంద లెక్చరర్‌ను రెగ్యులరైజ్‌ చేయాలని, కేబినెట్‌లో తీసుకున్న ఐదేళ్ల సర్వీసు నిబంధనను సడలించాలనే డిమాండ్‌తో శనివారం విజయవాడలో సమావేశం నిర్వహిస్తున్నట్లు జూనియర్‌ లెక్చరర్ల అసోసియేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కుమ్మరకుంట సురేష్‌, కల్లూరి శ్రీనివాస్‌ తెలిపారు. ‘జగనన్నకు చెబుదాం.. కాంట్రాక్టు లెక్చరర్ల గోడు’ పేరుతో ఉదయం 9గంటలకు విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.


పిల్లల కోసం ప్రభుత్వ పాఠశాలల ప్రచారం

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచేందుకు ఉపాధ్యాయులు ప్రచారం నిర్వహిస్తున్నారు. కరపత్రాలను రూపొందించి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ బడుల్లో ‘ఒత్తిడి లేని చదువు’, ‘మీ డబ్బులు మీ దగ్గరే మీ పిల్లల భవిష్యత్తు మా దగ్గర, వంద శాతం శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉన్నారంటూ ప్రచారం చేస్తున్నారు. 2022-23 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ బడుల నుంచి 3.90 లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలకు వెళ్లిపోయారు. మరో పక్క ఒకటో తరగతిలో ప్రవేశాలు తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లల సంఖ్యను పెంచేందుకు విద్యాశాఖ దృష్టి సారించింది.


ఎసైన్డ్‌ సాగు భూములు ఎవరి పరిధిలో ఉన్నాయి?
2003 ముందు, తరువాత పంపిణీ చేసిన వాటి యథాస్థితిపై ఆరా

ఈనాడు, అమరావతి: ఎసైన్డ్‌ సాగు భూములకు యాజమాన్య హక్కులు కల్పించే చర్యల్లో భాగంగా.. ప్రస్తుత వాటి యథాస్థితి తెలుసుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలో 1954 తర్వాత పేదలకు పంపిణీ చేసిన ఎసైన్డ్‌ సాగు భూములపై సుమారు 20 ఏళ్ల కాల పరిమితి విధించి యాజమాన్య హక్కులు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకుంటోంది. ప్రతి మండల పరిధిలోని ఒక్కో గ్రామంలో 2003 ముందు, తరువాత ఎసైన్డ్‌ సాగు భూములు పొందిన వారు ఎంతమంది? ఎంత విస్తీర్ణం మేర పంపిణీ జరిగింది? వాటిని పొందిన వారే అనుభవిస్తున్నారా? వారసుల అధీనంలో ఉన్నాయా? ఒకవేళ చేతులు మారితే ఎంతమంది ఉన్నారన్న వివరాలు తెలియజేయాలని రెవెన్యూ శాఖ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కలెక్టర్ల నుంచి ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల్లోని అన్ని మండల తహసీల్దార్లకు ఆదేశాలు అందాయి. గ్రామాల ఎంపిక బాధ్యతలను తహసీలార్లకు అప్పగించారు. దీని ప్రకారం.. తమ పరిధిలో ఎంపిక చేసిన గ్రామంలో ఎసైన్డ్‌ సాగు భూములు పొందిన వారి వివరాల రికార్డులను పరిశీలిస్తున్నట్లు ఓ తహసీల్దార్‌ తెలిపారు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయం నుంచి ప్రత్యేకంగా వచ్చిన నమూనాలో వివరాలను నమోదు చేసి, ఆర్డీఓ కార్యాలయానికి పంపిస్తామని వెల్లడించారు.


ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో గ్రామానికో సాగు న్యాయ నేస్తం
శిక్షణ ఇచ్చి నియమించాలని లీఫ్స్‌ సంస్థ నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: రైతులకు భూమి, వ్యవసాయ చట్టాలపై సమగ్ర శిక్షణ ఇచ్చేందుకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ప్రతి గ్రామానికి ఒక  సాగు న్యాయ నేస్తం వాలంటీరును నియమిస్తామని లీఫ్స్‌ స్వచ్ఛంద సంస్థ(లీగల్‌ ఎంపవర్‌మెంట్‌ అండ్‌ అసిస్టెన్స్‌ ఫర్‌ ఫార్మర్స్‌ సొసైటీ) వ్యవస్థాపక అధ్యక్షుడు, భూమి చట్టాల నిపుణుడు సునీల్‌కుమార్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతు లేదా కౌలుదారుడు, సాగు చేస్తున్న గ్రామంలో నివాసం ఉంటున్న వారు, చదవడం, రాయడం వచ్చి ఉండి ఇతరులకు సహాయం చేయాలనే ఆసక్తి ఉన్న వారికి ఉచితంగా శిక్షణ ఇస్తామని తెలిపారు. ఈ నెల 30లోపు 90002 22674 నంబరుకు వాట్సాప్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, సందేహాలు ఉంటే ఇదే నంబరులో సంప్రదించవచ్చని ఆయన సూచించారు.


ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత అల్ట్రాసౌండ్‌, టిఫా స్కానింగ్‌ సేవలు
మంత్రి విడదల రజిని

గుంటూరు(నగరంపాలెం), న్యూస్‌టుడే: ఆరోగ్యశ్రీ ద్వారా ఇక నుంచి గర్భిణులకు ఉచితంగా అల్ట్రా సౌండ్‌, టిఫా స్కానింగ్‌ సేవలు అందించనున్నట్లు మంత్రి విడదల రజిని తెలిపారు. గుంటూరు మంగళదాస్‌నగర్‌ రోడ్డులోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో అల్ట్రా సౌండ్‌, టిఫా స్కానింగ్‌ సేవలను శుక్రవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ఏడాది ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా 2.32 లక్షల కాన్పులు జరిగాయని, దీనికోసం ప్రభుత్వం రూ.247 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. ఆరోగ్య ఆసరా పథకం కోసం ఇప్పటి వరకు రూ.1,075 కోట్లు ఖర్చుచేసిందని వివరించారు. గుంటూరు జీజీహెచ్‌ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు.


ఏపీఆర్‌జేసీ అధ్యాపకులకు అందని జీతాలు

ఈనాడు, అమరావతి: ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులకు రెండు నెలలుగా జీతాలు అందడం లేదు. బడ్జెట్‌ సమస్యతో జీతాలు ఇవ్వకపోవడంతో అధ్యాపకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గురుకుల విద్యాలయాల సంస్థకు నిధులు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ రూపంలో ఇస్తుండటంతో ప్రతిసారి ఈ సమస్య ఏర్పడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ సంస్థ ఆధ్వర్యంలో 10 జూనియర్‌ కళాశాలలు ఉండగా.. వీటిల్లో అందరూ కలిపి 600మంది పని చేస్తున్నారు. గత ఆరు నెలలుగా రెండు, మూడు నెలలకోసారి జీతాలు ఇస్తున్నారు.


రూ.54.60 కోట్ల విడుదలకు ఉత్తర్వులు

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ జలవనరులు జీవనాధార అభివృద్ధి పథకం రెండో దశలో చేపట్టిన పనులకు రూ.54.60 కోట్ల బడ్జెట్‌ విడుదలకు ఉత్తర్వులు ఇచ్చారు. ఈ పనులకు బిల్లులు చెల్లించేందుకు వీలుగా ఆర్థికశాఖ బడ్జెట్‌ విడుదల ఉత్తర్వులు ఇవ్వగా, అనంతరం జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని