Margadarsi: మార్గదర్శిపై నిరాధార ఆరోపణలు
చిట్ల వేలంలో రిగ్గింగ్‌కు అవకాశమే లేదని మార్గదర్శి చిట్‌ఫండ్ సంస్థ స్పష్టం చేసింది. డిఫాల్టరైన చందాదారులకు వేలంలో పాల్గొనే వీలే ఉండదని పేర్కొంది.
సీఐడీ, రిజిస్ట్రేషన్ల శాఖాధికారులు చెబుతున్నవి అవాస్తవాలు
చిట్ వేలంలో రిగ్గింగ్‌కు అవకాశమే లేదు
‘ఘోస్ట్ సబ్‌స్క్రైబర్’ అనేది ఊహాజనితం
అసలు వాస్తవాలివీ అంటూ మార్గదర్శి చిట్‌ఫండ్ వెల్లడి
ఈనాడు, హైదరాబాద్
చిట్ల వేలంలో రిగ్గింగ్‌కు అవకాశమే లేదని మార్గదర్శి చిట్‌ఫండ్ సంస్థ స్పష్టం చేసింది. డిఫాల్టరైన చందాదారులకు వేలంలో పాల్గొనే వీలే ఉండదని పేర్కొంది. పూచీకత్తు సమర్పించలేక డిఫాల్ట్ అయితే కొత్త చిట్ గ్రూపులో చేరాలని చందాదారులకు తాము ఎట్టి పరిస్థితుల్లోనూ సూచించబోమని వెల్లడించింది. సూళ్లూరుపేట వాసి సుబ్రహ్మణ్యం ‘ఘోస్ట్ సబ్‌స్క్రైబర్’ అంటూ సీఐడీ, రిజిస్ట్రేషన్ల శాఖాధికారులు చేసిన ఆరోపణలు ఊహాజనితమని, సుబ్రహ్మణ్యం భార్యకు సీఐడీ అనధికారిక సిబ్బంది తప్పుడు సమాచారమిచ్చి ఆమె నుంచి తప్పుడు వాంగ్మూలం తీసుకున్నారని తేల్చి చెప్పింది. అసలు ఘోస్ట్ చందాదారులున్న సందర్భాలే లేవని స్పష్టం చేసింది. అనకాపల్లికి చెందిన ఎ.వెంకటేశ్వరరావు కొంతమంది ప్రైజ్డ్ చందాదారులకు ఇచ్చిన ష్యూరిటీలు డిఫాల్ట్ అవటం వల్ల న్యాయస్థానం ఆదేశాల మేరకే ఆ మొత్తాలను సర్దుబాటు చేసుకున్నామని వివరించింది. రాజమహేంద్రవరానికి చెందిన కె.విజయ్‌కుమార్ చిట్ వాయిదాలు చెల్లించనందునే ఆయన పాడుకున్న చిట్ మొత్తాన్ని ఆరు వాయిదాలకు ఫోర్‌మెన్ సర్దుబాటు చేశారని తెలిపింది.
తాము ఎక్కడా ఎలాంటి ఉల్లంఘనలకూ పాల్పడలేదని, చట్టప్రకారమే వ్యవహరిస్తున్నామని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్, సీఐడీ ఎస్పీ అమిత్ బర్దర్, స్టాంపులు- రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ వి.రామకృష్ణ ఈ నెల 20న నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మార్గదర్శిపైన, బ్రాంచ్ మేనేజర్లపైన చేసిన ఆరోపణలన్నీ నిరాధారాలు, అవాస్తవాలని సంస్థ యాజమాన్యం తెలిపింది. ఎంపిక చేసిన కొంతమంది చందాదారుల నుంచి అసంబద్ధమైన వాంగ్మూలాలు తీసుకుని వాటి ఆధారంగా మార్గదర్శి యాజమాన్యం, బ్రాంచ్ మేనేజర్లపై తప్పుడు కేసులు బనాయించాలన్న ఎజెండాతోనే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారని తెలిపింది. సీఐడీ, రిజిస్ట్రేషన్ల శాఖాధికారులు విలేకర్ల సమావేశంలో చేసిన ప్రతి ఆరోపణకు సంబంధించిన అసలు వాస్తవాల్ని మార్గదర్శి చిట్‌ఫండ్ సంస్థ వెల్లడించింది. ఆ వివరాలివీ.
ఆరోపణ-1
చిట్‌ఫండ్ చట్టంలోని సెక్షన్-17 ప్రకారం చిట్ వేలంలో కనీసం ఇద్దరు చందాదారులైనా పాల్గొనాలి. కానీ చాలా సందర్భాల్లో చిట్ రిగ్గింగ్ అవుతోందని మాకు అనిపిస్తోంది. మార్గదర్శిలో చిట్ కట్టేటప్పుడే చందాదారులకు కొన్ని పత్రాలిచ్చి వాటిపై సంతకాలు తీసుకుంటున్నారు. చందాదారుల తరఫున ఏజెంట్లు, బ్రాంచ్ మేనేజర్లే వేలంలో పాల్గొనేలా ఆథరైజేషన్ పత్రాలపై వారికి తెలియకుండానే సంతకాలు పెట్టించుకుంటున్నారు.
వాస్తవం
చిట్ వేలంలో రిగ్గింగ్‌కు అవకాశమే లేదు. ఏపీ చిట్‌ఫండ్ నియమావళి- 2008లోని రూల్ 17(3) ప్రకారం చందాదారు తన తరఫున వేలంలో పాల్గొనేందుకు ప్రతిసారీ ఓ ఏజెంటును నియమించుకోవచ్చు. మార్గదర్శి శాఖల్లో సంప్రదించి ఏజెంట్ల జాబితాలో నుంచి తమకు నచ్చిన వారిని ఎంపిక చేసుకోవచ్చు. చందాదారు స్వయంగా లేదా తాను ఆథరైజేషన్ ఇచ్చిన ఏజెంట్ ద్వారా వేలంలో పాల్గొనవచ్చు. చందాదారు సంతకం, ఏజెంటుకు ఇచ్చిన ఆథరైజేషన్ పత్రాలపై ఉన్న సంతకాల్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఫోర్‌మెన్ వారిని వేలంలో పాల్గొనేందుకు అనుమతిస్తారు. చందాదారులు ఆథరైజేషన్ ఇవ్వలేదని చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారం. బ్రాంచి ఫోర్‌మెన్/ సిబ్బంది ఆ ఆధారాలన్నీ క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతే ప్రైజ్ ఎమౌంట్‌ను చెల్లిస్తారు. అందువల్ల అవకతవకలకు ఆస్కారమే లేదు.
ఆరోపణ-2
డిఫాల్టరైన చందాదారులకు వేలంలో పాల్గొనే అవకాశం ఇవ్వకూడదు. కానీ ఆర్నెల్లపాటు వాయిదా సొమ్ము చెల్లించని డిఫాల్టర్ చందాదారులకూ ఏడో నెలలో వేలంలో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు. వారు సక్సెస్‌ఫుల్ బిడ్డర్‌గా వస్తే ఆ ప్రైజ్‌మనీ వేరే వ్యక్తులకు పంచుతున్నారు.
వాస్తవం
డిఫాల్టరైన చందాదారులకు వేలంలో పాల్గొనే అవకాశమిస్తున్నామన్న ఆరోపణను తీవ్రంగా ఖండిస్తున్నాం. చందాదారు ప్రతి నెలా కిస్తీని చెల్లించాకే వేలంలో పాల్గొనటానికి అనుమతిస్తున్నాం. చందాదారులు కిస్తీలు చెల్లించడానికి ఇచ్చిన చెక్కులను ఒక్కోసారి వివిధ కారణాలతో బ్యాంకులు తిప్పి పంపిస్తాయి. ఆ చందాదారులు వేలంలో సక్సెస్‌ఫుల్ బిడ్డర్లుగా నిలిస్తే.. వారు డిఫాల్ట్ అయిన చందాకు సంబంధించిన మొత్తాన్ని ప్రైజ్‌మనీ నుంచి సర్దుబాటు చేసుకుని.. మిగతా మొత్తాన్ని, తగిన సెక్యూరిటీలు తీసుకుని చెల్లిస్తున్నాం. సరైన పూచీకత్తు ఇవ్వపోవటం లేదా ఇతర కారణాల వల్ల చందాదారు పాడుకున్న మొత్తం వారికి చెల్లించనప్పుడు చిట్‌ఫండ్ చట్టంలోని సెక్షన్ 22(2) ప్రకారం ఆ మొత్తాన్ని తదుపరి వాయిదాకు ముందే అధీకృత బ్యాంకులోని ప్రత్యేక ఖాతాలో జమ చేస్తున్నాం. ఆ వివరాలను చందాదారుకు, చిట్ రిజిస్ట్రార్‌కు తెలియజేస్తున్నాం. దీనిపై కొంతమంది చందాదారులను బెదిరించి, వాంగ్మూలాలు తీసుకుని ఫోర్‌మెన్లపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు.
ఆరోపణ-3
చందాదారులు సరైన పూచీకత్తు ఇవ్వలేక డిఫాల్ట్ అయితే.. కొత్త చిట్ గ్రూపులో చేరాలని, అందులో మీకొచ్చిన డబ్బులతో పూచీకత్తు సర్దుబాటు చేసుకోవచ్చంటూ మోసగిస్తున్నారు. ఇలా ఓ సాధారణ ప్రైవేటు ఉద్యోగి 22 చిట్ గ్రూపుల్లో, మరో వ్యక్తి 60 చిట్ గ్రూపుల్లో చేరారు. వాయిదాలు కట్టలేక ‘రుణ ఉచ్చు’లో చిక్కుకుంటున్నారు.
వాస్తవం
సరైన పూచీకత్తు ఇవ్వలేక డిఫాల్ట్ అయితే కొత్త చిట్ గ్రూపులో చేరాలని, మార్గదర్శి ఎట్టి పరిస్థితుల్లోనూ చందాదారులకు సూచించదు. చందాదారుల చెల్లింపు సామర్థ్యాన్ని మదింపు చేశాకే వారిని గ్రూపులో సభ్యులుగా చేరుస్తాం. బ్రాంచి సిబ్బంది ఎప్పటికప్పుడు చందాదారుల ఆర్థిక సామర్థ్యాన్ని క్షుణ్నంగా విశ్లేషించిన తర్వాత వారి ఆర్థిక స్థితిగతులు తెలుసుకుని ఒకటి కంటే ఎక్కువ చిట్లలో చేర్చుకుంటాం. ఇలా చేయడానికి చట్టంలో ఎలాంటి అవరోధం లేదు. బహుళ చిట్లున్న చందాదారుల విషయంలో బకాయిలు క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతే ప్రైజ్‌మనీని చెల్లిస్తాం. ఈ విషయంలోనూ పూర్తిగా చట్టానికి లోబడే వ్యవహరిస్తాం. చందాదారులకు పూర్తిగా అవగాహన కల్పించి, వారి అనుమతి తీసుకున్న తర్వాతే చట్టప్రకారం బకాయిలు సర్దుబాటు చేస్తాం. అందువల్ల చందాదారులను రుణ ఉచ్చులోకి లాగుతున్నామన్న సీఐడీ, రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల ఆరోపణలన్నీ పూర్తిగా సంచలనం సృష్టించేందుకు చేస్తున్నవే.
ఆరోపణ-4
నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు చెందిన సుబ్రహ్మణ్యానికి మార్గదర్శితో ఎలాంటి సంబంధమూ లేదు. కానీ అతని ఆధార్ కార్డు వాడుకుని, అతని పేరిట చిట్స్ కడుతున్నట్లు రికార్డులు సృష్టించారు. వాటితో తనకు సంబంధం లేదని సుబ్రహ్మణ్యం ఫిర్యాదు చేయడంతో చీరాల పోలీసుస్టేషన్‌లో కేసు నమోదయింది. ‘ఘోస్ట్ చందాదారులు’ అనేది అతిపెద్ద మోసం. అవతలి వ్యక్తికి తెలియకుండానే వారి రికార్డులను మార్గదర్శి వాడుకుంటుంది.
వాస్తవం
చీరాల మార్గదర్శి బ్రాంచిలో బి.సుబ్రహ్మణ్యం చిట్ నంబరు ఎల్‌టీ39టీసీఆర్-27లో చందాదారుగా చేరారు. 2021 నవంబరు వరకు 5 వాయిదాలు చెల్లించారు. 2021 నవంబరు 28న రూ.3 లక్షలకు చిట్ పాడుకున్నా అవసరమైన ష్యూరిటీలు సమర్పించలేదు. ష్యూరిటీలు సమర్పించాలంటూ సుబ్రహ్మణ్యానికి 2021 డిసెంబరు 22న లేఖ పంపాం. తదుపరి చీటీ పాటలోపు ఆయన ష్యూరిటీలు సమర్పించకపోవడంతో.. చిట్‌ఫండ్ చట్టం 1982లోని సెక్షన్ 22(2) ప్రకారం ఆయన చీటీ పాడుకున్న మొత్తాన్ని ప్రత్యేక బ్యాంకు ఖాతాలో జమ చేసి, చిట్స్ రిజిస్ట్రార్‌కు తెలియజేశాం. దీంతోపాటు ష్యూరిటీలు సమర్పించాలంటూ చందాదారుకు పదే పదే లేఖలు పంపుతున్నాం. సుబ్రహ్మణ్యం ఘోస్ట్ సబ్‌స్క్రైబర్ అని సీఐడీ, రిజిస్ట్రేషన్ అధికారులు చేసిన ఆరోపణలు ఊహాజనితమైనవి. చందాదారు భార్యకు సీఐడీ అనధికారిక సిబ్బంది తప్పుడు సమాచారమిచ్చి, ఆమె నుంచి తప్పుడు స్టేట్‌మెంట్ తీసుకున్నారు. దాని ఆధారంగా రిజిస్ట్రార్ ఫిర్యాదు చేసి, కేసు నమోదు చేయించారు. చందాదారు నుంచి కూడా బలవంతంగా స్టేట్‌మెంట్ తీసుకుని విలేకర్ల సమావేశంలో ప్రదర్శించారు.
ఆరోపణ-5
అనకాపల్లికి చెందిన ఎ.వెంకటేశ్వరరావు 50 నెలలు చిట్టీ కట్టారు. ఆయనకు రూ.4.60 లక్షలు చెల్లించాలి. కానీ రూ.20 వచ్చాయి.ఆయన ఫిర్యాదుపై అనకాపల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.
వాస్తవం
అనకాపల్లి మార్గదర్శి బ్రాంచిలో ఎ.వెంకటేశ్వరరావు చిట్ నంబరు ఎల్‌టీ44టీఏకె-44లో రూ.5 లక్షల చిట్ గ్రూపులో చందాదారుగా చేరారు. 2020 డిసెంబరులో రూ.4,75,000 మొత్తానికి చీటీ పాడుకున్నారు. విశాఖపట్నం బ్రాంచిలో ఎల్‌టీ24ఎక్స్‌వి-06 చిట్ గ్రూపులో ఉన్న చందాదారుకు వెంకటేశ్వరరావు ష్యూరిటీ సంతకం చేశారు. ఆ చందాదారు డిఫాల్టర్ కావడంతో వెంకటేశ్వరరావుతోపాటు ష్యూరిటీ ఇచ్చిన అందరికీ లీగల్ నోటీసులు పంపాం. విశాఖపట్నం కోర్టులో సూట్ దాఖలు చేయగా వెంకటేశ్వరరావు రూ.3,10,807 చెల్లించాలని ఆదేశించింది. విశాఖ ఎన్‌ఏడీ బ్రాంచిలో ఆయన ష్యూరిటీ ఇచ్చిన మరో చందాదారు కూడా డిఫాల్టర్‌గా ఉండటంతో వెంకటేశ్వరరావుకు 2020 డిసెంబరు 21న నోటీసులు పంపాం. ఆయన అందుబాటులో లేరంటూ నోటీసు వెనక్కి వచ్చింది. ఈ చిట్ విషయంలోనూ వెంకటేశ్వరరావు రూ.1,51,182 చెల్లించాలని విశాఖ కోర్టు చెప్పింది. వెంకటేశ్వరరావు చీటీ పాడుకున్న మొత్తాన్ని.. 1982 చిట్‌ఫండ్ చట్టం సెక్షన్ 21(ఎఫ్‌ఏ) ప్రకారం ఆయన ష్యూరిటీ ఉన్న చందాదారులు డిఫాల్ట్ కావడంతో ఆ మొత్తాలకు సర్దుబాటు చేసింది. అయితే అనకాపల్లి అసిస్టెంట్ రిజిస్ట్రార్ ప్రభుత్వ ప్రోద్బలంతో నిరాధార ఆరోపణలతో ఉద్దేశపూర్వకంగానే బ్రాంచి మేనేజర్‌పై కేసు నమోదు చేయించారు.
ఆరోపణ-6
చిట్టీ ష్యూరిటీల పేరిట రాజమహేంద్రవరంలో కోరుకొండ విజయ్‌కుమార్‌ను ఇరికించారు. కొత్త చిట్లు కడితే బయటపడతావంటూ ఉచ్చులోకి దించారు. విజయ్‌కుమార్ ఫిర్యాదుపై రాజమహేంద్రవరంలో కేసు నమోదైంది. ఆ చందాదారు ఇచ్చిన ష్యూరిటీ డిఫాల్ట్ అయిందంటూ ఆయనకు ప్రైజ్‌మనీ ఇవ్వలేదు. రుణాల రికవరీ కోసం ఆయనకు ముందస్తు నోటీసు ఎందుకివ్వలేదు?
వాస్తవం
రాజమహేంద్రవరం మార్గదర్శి బ్రాంచిలో కె.విజయ్‌కుమార్ ఎల్‌టీ58టీ ఆర్-23 చిట్ గ్రూపులో చందాదారుగా చేరారు. 2020 జూన్ 21న రూ.3 లక్షలకు ష్యూరిటీలు సమర్పించి, చీటీ పాడుకున్నారు. చందాదారులకు ప్రైజ్‌మనీ చెల్లించేటప్పుడు వారు మిగిలిన చందాదారులకు ఎక్కడైనా ష్యూరిటీ ఇచ్చి, బకాయిలు ఉంటే వాటిని ఈ ప్రైజ్‌మనీలో నుంచి సర్దుబాటు చేసుకునే అధికారం చట్టప్రకారం ఉంది.విజయకుమార్‌కు ష్యూరిటీలు ఇచ్చినవారు ఇతర గ్రూపుల్లో గ్యారంటీగా ఉండటంతో పాటు బకాయిపడటంతో వాటిని తిరస్కరించారు.వేరే ఎవరినైనా ష్యూరిటీ తెచ్చుకోవాలని విజయ్‌కుమార్‌కు చెప్పాం. ఆయన చీటీ పాడుకున్న మొత్తాన్ని ప్రత్యేక బ్యాంకు ఖాతాలో జమ చేశాం. చిట్ రిజిస్ట్రార్‌కు కూడా తెలియపరిచాం. విజయ్‌కుమార్ ఆ తర్వాత కూడా వాయిదాలు చెల్లించలేదు. దీంతో ఆయన పాడుకున్న చిట్ మొత్తాన్ని ఆరు వాయిదాలకు ఫోర్‌మెన్ సర్దుబాటు చేశారు. ఏపీ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం చందాదారు చాలినంత ష్యూరిటీ సమర్పించకపోతే పాడుకున్న మొత్తాన్ని బకాయి కింద జమ చేసుకునే అధికారం ఫోర్‌మెన్‌కు ఉంటుంది. దీనిపై సీఐడీ, రిజిస్ట్రార్ అధికారులు చేసిన ఆరోపణలు నిరాధారం.
ఆరోపణ-7
ఘోస్ట్ చందాదారులుగా ఒకర్ని పెట్టుకుని తర్వాత ప్రైజ్ చందాదారుగా మార్చుకుంటున్నారు. ఆ ఘోస్ట్ చందాదారుకు వచ్చే ప్రైజ్‌మనీ కూడా సంస్థలోనే ఉండిపోతోంది. ఎవరూ క్లెయిమ్ చేయరు. ఎకౌంటింగ్ ఫ్రాడ్ జరుగుతోంది.
వాస్తవం
ఈ ఆరోపణ పూర్తిగా నిరాధారమైంది. ఘోస్ట్ చందాదారులు ఎక్కడా లేరు. శాఖల వారీగా పెద్దమొత్తంలో టికెట్లు ఉంచి వాటికోసం సబ్‌స్క్రైబ్ చేయిస్తున్నారని ఒకవైపు ఆరోపిస్తూనే, మరోవైపు ఘోస్ట్ చందాదారుల్ని చేర్చుకుంటున్నారంటూ పరస్పర విరుద్ధ ఆరోపణలు చేశారు. 1982 చిట్‌ఫండ్ చట్టంలోని సెక్షన్ 22(2) ప్రకారం.. ష్యూరిటీలు సమర్పించడంలో జాప్యం వల్ల చెల్లించని ప్రైజ్‌మనీ మొత్తాన్ని ప్రత్యేక బ్యాంకు ఖాతాలో జమ చేశాం. ఇలా జమ చేసిన మొత్తాన్ని కంపెనీ ఉపయోగించుకోవడానికి అవకాశమే లేదు. అప్పటి వరకు బకాయిపడిన మొత్తాన్ని సర్దుబాటు చేశాకే ఈ ప్రైజ్‌మనీని ప్రత్యేక ఖాతా నుంచి చెల్లిస్తాం. సీఐడీ ఎస్పీ ఊహించినట్లుగా.. నిధుల నిలిపివేతకు ఆస్కారమే లేదు. అందువల్ల ఎస్పీ చేసిన ఆరోపణ పూర్తిగా సత్యదూరం.చందాదారుల నుంచి వాయిదాలు వసూలు చేసి, దాన్ని పాట పాడుకున్నవారికి సరైన పూచీకత్తులు తీసుకుని చెల్లించడం చట్టప్రకారం ఫోర్‌మెన్ బాధ్యతలు. అందువల్ల బాధ్యత తగ్గించుకుంటున్నారనే ఆరోపణ నిరాధారం.
ఆరోపణ-8
చిట్‌ఫండ్ చట్టంలోని సెక్షన్ 22ను ఫోర్‌మెన్ ఉల్లంఘిస్తున్నారు. ష్యూరిటీ ఇచ్చామనే చందాదారులకు తెలియదు. దీనిపై వారికి అవగాహన కల్పించడం ఫోర్‌మెన్ విధి. కానీ ఫోర్‌మెన్ ఇబ్బంది పెడుతున్నారు.
వాస్తవం
ఫోర్‌మెన్ చట్ట నిబంధనలను తుచ తప్పకుండా పాటిస్తున్నారు. గ్రూప్‌లోని చిట్ పాడుకోని చందాదారుల ప్రయోజనాల పరిరక్షణలో భాగంగానే బకాయిలను సర్దుబాటు చేస్తారు. పూర్తిగా చట్టానికి లోబడే నిర్వర్తించే ఈ ప్రక్రియలో అవకతవకలకు ఆస్కారమే లేదు. సరైన పూచీకత్తులు సమర్పించకపోతే, వాటిని సమర్పించే వరకు.. ప్రైజ్ మొత్తాన్ని (పాడుకున్న సొమ్ము) నిలిపి ఉంచే హక్కు ఫోర్‌మెన్‌కు ఉందని ఎఫ్‌ఏ618 ఆఫ్ 2014, ఎఫ్‌ఏ 302 ఆఫ్ 2018 కేసుల్లో ఆంధ్రప్రదేశ్ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ ఉత్తర్వులు ఇచ్చింది. చిట్ ఒప్పందంలోని క్లాజ్ 7 ప్రకారం.. పాట పాడుకున్న మొత్తాన్ని తీసుకునేందుకు అవసరమైన హామీలు సమర్పించే విధివిధానాల్ని చందాదారులకు తెలియజేస్తాం. హామీలను అంగీకరించాలా లేదా తిరస్కరించాలా అనే విచక్షణాధికారం ఉప క్లాజ్ 3 ప్రకారం ఫోర్‌మెన్‌కు ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Hyderabad: తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ నూతన ఛైర్మన్‌గా బక్కి వెంకటయ్య
-
Sai Rajesh: నా సాయం పొందిన వ్యక్తే నన్ను తిట్టాడు: ‘బేబీ’ దర్శకుడు
-
TTD: సర్వభూపాల వాహనంపై శ్రీనివాసుడు.. భారీగా తరలివచ్చిన భక్తులు
-
Weather Report: తెలంగాణలో రాగల 3 రోజులు తేలికపాటి వర్షాలు
-
Military Tank: సైనిక శిక్షణ కేంద్రంలో మాయమై.. తుక్కులో తేలి!
-
Chandrayaan 3: జాబిల్లిపై సూర్యోదయం.. విక్రమ్, ప్రజ్ఞాన్‌లతో కమ్యూనికేషన్‌కు ఇస్రో ప్రయత్నాలు