సీఐడీ కస్టడీకి చంద్రబాబు

తెదేపా అధినేత చంద్రబాబును రెండు రోజుల పాటు సీఐడీ కస్టడీకి ఇస్తూ విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానం శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. నైపుణ్యాభివృద్ధి సంస్థ కేసులో ప్రస్తుతం జ్యుడిషియల్‌ రిమాండులో ఉన్న ఆయన్ను రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం ప్రాంగణంలోనే విచారించాలని సూచించింది.

Updated : 23 Sep 2023 06:52 IST

రెండు రోజుల పాటు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలోనే విచారించాలి  
విచారణ సమయంలో వైద్య సదుపాయం కల్పించాలి
వీడియోలు, ఫొటోలు విడుదల చేయొద్దు
ఆదేశాలు జారీచేసిన విజయవాడ ఏసీబీ న్యాయస్థానం
ఈనాడు - అమరావతి

తెదేపా అధినేత చంద్రబాబును రెండు రోజుల పాటు సీఐడీ కస్టడీకి ఇస్తూ విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానం శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. నైపుణ్యాభివృద్ధి సంస్థ కేసులో ప్రస్తుతం జ్యుడిషియల్‌ రిమాండులో ఉన్న ఆయన్ను రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం ప్రాంగణంలోనే విచారించాలని సూచించింది. శని, ఆదివారాలు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటల మధ్యే విచారించాలని, గంటకోసారి అయిదు నిమిషాల విరామమిచ్చి న్యాయవాదిని సంప్రదించుకునేందుకు అవకాశమివ్వాలని పేర్కొంది. ఈ మేరకు ఏసీబీ న్యాయస్థానం న్యాయాధికారి హిమబిందు ఆదేశాలిచ్చారు. చంద్రబాబును అయిదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడీ దాఖలుచేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయాధికారి ఈ మేరకు తీర్పు వెలువరించారు. చంద్రబాబుపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించరాదని, ఎలాంటి తీవ్రమైన చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేశారు. కస్టడీకి తీసుకునే ముందు, కస్టడీ ముగిసిన తర్వాత ఆయనకు తప్పనిసరిగా వైద్యపరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. విచారణను సీఐడీకి చెందిన వీడియోగ్రాఫర్‌తో మాత్రమే రికార్డు చేయించాలని, ఆ వీడియో మొత్తాన్ని సీల్డ్‌కవర్‌లో న్యాయస్థానానికి సమర్పించాలని పేర్కొన్నారు. ‘‘విచారణ సమయంలో చంద్రబాబు తరఫు న్యాయవాదిని విచారణ కనిపించే దూరం వరకూ అనుమతించాలి. మధ్యాహ్నం గంటపాటు భోజన విరామమివ్వాలి. విచారణ సమయంలో అవసరమైన వైద్య సదుపాయం కల్పించాలి’’ అని తన ఆదేశాల్లో తెలిపారు. కస్టడీ గడువు ముగిశాక ఆదివారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ విధానం ద్వారా చంద్రబాబును న్యాయస్థానం ఎదుట హాజరుపరచాలని ఆదేశించారు.

సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించాలి

సిట్‌ కార్యాలయంలో చంద్రబాబును విచారించినప్పుడు సాక్షి కెమెరామన్‌, వీడియోగ్రాఫర్‌ చిత్రీకరించి వాటిని బయటకు విడుదల చేశారని చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. పత్రికల క్లిప్పింగ్‌లను న్యాయస్థానానికి సమర్పించారు. విచారణ వీడియోలు, ఫొటోలను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు విడుదల చేయొద్దని న్యాయస్థానం సీఐడీని ఆదేశించింది. ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నందినీ శత్పతి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను విచారణ సమయంలో పాటించేలా సీఐడీని ఆదేశించాలని దమ్మాలపాటి విన్నవించగా... సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. సీఐడీ విచారణ జరిగేటప్పుడు చంద్రబాబు తరఫున హాజరయ్యేందుకు ఏడుగురు న్యాయవాదుల పేర్లను న్యాయస్థానానికి సమర్పించారు. వీలును బట్టి వారిలో ఎవరో ఒకరు హాజరవుతారని న్యాయస్థానానికి చెప్పగా.. కోర్టు దానికి సమ్మతించింది. సీఐడీ తరఫున విచారణ జరిపే అధికారులు, మధ్యవర్తుల పేర్లను ప్రభుత్వ న్యాయవాదులు న్యాయస్థానానికి సమర్పించారు.

హైకోర్టు తీర్పు తర్వాత..

తొలుత శుక్రవారం ఉదయం 11.15 గంటల సమయంలో ఏసీబీ కోర్టులో కస్టడీ పిటిషన్‌పై విచారణ ప్రారంభమైంది. అయితే క్వాష్‌ పిటిషన్‌పై మధ్యాహ్నం 1.30కి హైకోర్టు నిర్ణయం వెల్లడించనుందని దమ్మాలపాటి శ్రీనివాస్‌ న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. అక్కడ నిర్ణయం వెలువడ్డాకే కస్టడీ పిటిషన్‌పై ఆదేశాలు జారీ చేస్తానంటూ న్యాయాధికారి హిమబిందు మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణను వాయిదా వేశారు. హైకోర్టు తీర్పు తర్వాత.. సీఐడీ కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలిచ్చారు.

బెయిల్‌ పిటిషన్‌, పీటీ వారంట్ల పిటిషన్‌పై విచారణ సోమవారానికి వాయిదా

చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌, ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసు, ఫైబర్‌గ్రిడ్‌ కేసుల్లో సీఐడీ అధికారులు దాఖలు చేసిన పీటీ వారంట్‌ పిటిషన్లపై విచారణను న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది. బెయిల్‌ పిటిషన్‌పై విచారణను శనివారం చేపట్టాలని దమ్మాలపాటి శ్రీనివాస్‌ కోరగా.. సోమవారం చేపట్టాలని ప్రభుత్వ న్యాయవాది వివేకానంద కోరారు. సోమవారమే బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరిపి... ఇరుపక్షాల వాదనలు వింటామని న్యాయస్థానం స్పష్టం చేసింది.


చంద్రబాబును విచారించేందుకు 12 మందితో బృందం

న్యాయస్థానానికి వివరాలు సమర్పించిన సీఐడీ తరఫు న్యాయవాదులు

ఈనాడు, అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబును రెండు రోజుల కస్టడీకి ఇచ్చినందున ఆయన్ను విచారించేందుకు 12 మందితో కూడిన బృందాన్ని సీఐడీ సిద్ధం చేసింది. ఈ బృందంలో 9 మంది సీఐడీ అధికారులు, సిబ్బందితోపాటు ఒక వీడియోగ్రాఫర్‌, ఇద్దరు మధ్యవర్తులు ఉన్నారు. వారి పేర్లతో కూడిన జాబితాను సీఐడీ తరఫు న్యాయవాదులు శుక్రవారం ఏసీబీ న్యాయస్థానానికి సమర్పించారు. ఆర్థిక నేరాల విభాగం-2 డీఎస్పీలు ఎం.ధనుంజయుడు, వి.విజయ్‌భాస్కర్‌, ఎ.లక్ష్మీనారాయణ, ఇన్‌స్పెక్టర్లు ఎన్‌.ఎల్‌.వి.మోహన్‌కుమార్‌, వై.రవికుమార్‌, ఐ.శ్రీనివాసన్‌, సీహెచ్‌.సాంబశివరావు, ఏఎస్సై పి.రంగనాయకులు, కానిస్టేబుల్‌ ఎం.సత్యనారాయణ.. ఈ బృందంలో ఉంటారని సీఐడీ న్యాయవాదులు న్యాయస్థానానికి వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని