icon icon icon
icon icon icon

పోస్టల్‌ బ్యాలట్ల పోలింగ్‌లోనే ఇంత వైఫల్యమా?

ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలట్ల పోలింగ్‌ విషయంలోనే ఎన్నికల సంఘం పూర్తిగా విఫలమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 5.26 లక్షల ఉద్యోగులు ఓటు వేసేందుకు సదుపాయాలు కల్పించడంలో ఘోరంగా విఫలమైంది.

Updated : 06 May 2024 07:19 IST

ఓట్లు ఇవ్వక.. సదుపాయాలు కల్పించక చేతులెత్తేసిన ఎన్నికల సంఘం
ఫాం-12 సమర్పించినా జాబితాలో పేర్లు గల్లంతు
అంగన్‌వాడీ, ఒప్పంద ఉద్యోగులకు అందని పోస్టల్‌ ఓట్లు
ఉద్యోగులను మభ్యపెట్టేందుకు వైకాపా నాయకుల హడావుడి
పోలింగ్‌ ఆలస్యంపై పలుచోట్ల నిరసనలు, ఆందోళనలు
ఓట్లు చెల్లకుండా చేసేందుకు తెరవెనుక కుట్ర

ఈనాడు, అమరావతి: ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలట్ల పోలింగ్‌ విషయంలోనే ఎన్నికల సంఘం పూర్తిగా విఫలమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 5.26 లక్షల ఉద్యోగులు ఓటు వేసేందుకు సదుపాయాలు కల్పించడంలో ఘోరంగా విఫలమైంది. ఓటు ఎక్కడ వేయాలి? ఎక్కడ ఓటు ఉంది? ఫాం-12 సమర్పించినా జాబితాలో పేరు లేకపోతే ఏం చేయాలి అనేదానిపై సమాచారం సైతం సక్రమంగా ఇవ్వకుండా ఉద్యోగుల్లో గందరగోళం సృష్టిస్తోంది. కేంద్రాల వద్ద సదుపాయాలు కల్పించకపోవడం, సమయానికి పోలింగ్‌ ప్రారంభించకపోవడం మూడు రోజులుగా నిత్యకృత్యంగా మారింది. ఈ సమస్యలతోపాటు కొంతమంది ఉద్యోగుల పేర్లు పోస్టల్‌ ఓట్ల జాబితాలో లేకపోవడంతో ఆదివారం ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఫాం-12 సమర్పించినా వందల మందికి పోస్టల్‌ ఓట్లు ఇవ్వలేదు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయంలో పని చేసే ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలట్లు కూడా గల్లంతయ్యాయి. దరఖాస్తు చేసినా ఓట్లు లేవంటూ గుంటూరు జిల్లా అధికారుల చేతులెత్తేశారు. ఓటు వేసే వారి సంఖ్య అధికంగా ఉన్నా పోలింగ్‌ కేంద్రాలను తక్కువగా ఏర్పాటు చేసి ఉద్యోగుల సహనాన్ని ఎన్నికల సంఘం పరీక్షించింది. తిరుపతి జిల్లా సత్యవేడులో సదుపాయాలు లేకపోగా.. పోలింగ్‌ ఆలస్యంగా ప్రారంభం కావడంతో ఉద్యోగులు నిరసనకు దిగారు. ఆర్వోకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తిరుపతి జిల్లా వెంకటగిరి, అన్నమయ్య జిల్లా మదనపల్లెలో పోలింగ్‌ ఆలస్యంగా ప్రారంభమైంది. పోస్టల్‌ బ్యాలట్‌ పత్రాలు రాకపోవడంతో పోలింగ్‌ ప్రారంభంలో జాప్యం జరిగింది. అంగన్‌వాడీ కార్యకర్తలు, ఒప్పంద ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలట్‌ సదుపాయమే కల్పించలేదు. ఫెసిలిటేషన్‌ కేంద్రాల వద్ద ఎక్కువ సమయం ఎండలో నిలబడాల్సి రావడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు.

పోటెత్తిన ఉద్యోగులు

పోస్టల్‌ ఓట్లు వేసేందుకు ఈసారి ఉద్యోగులు పోటెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 3.30 లక్షలకుపైగా ఉద్యోగులకు పోలింగ్‌ విధులు కేటాయించగా.. వివిధ రకాల విధులకు 1.96 లక్షల మందిని వినియోగించనున్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, ఒప్పంద ఉద్యోగులు దీనికి అదనం. ఈసారి అందరూ పోస్టల్‌ బ్యాలట్‌కు ప్రాధాన్యం ఇచ్చారు. విజయవాడలో ఎక్కువ మంది ఉద్యోగులు రావడంతో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మరో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఉద్యోగులు ఓటు వేసేందుకు పెద్ద ఎత్తున తరలిరావడం ఎవరికి ఇబ్బందికరం? ఇది దేనికి చైతన్యం అనే చర్చ ఇప్పుడు రాజకీయ పార్టీల్లో జోరుగా జరుగుతోంది. ఈ ఐదేళ్లల్లో ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేసిన ప్రభుత్వానికి వారు వ్యతిరేకంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓటు వినియోగించుకునేందుకు అధికంగా తరలిరావడంతో ఇది ఆసక్తికరంగా మారింది. పోస్టల్‌ బ్యాలట్లకు సంబంధించి ఎన్నికల సంఘం ఎంత గందరగోళం సృష్టించినా వాటిని అధిగమించి ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఈ నెల 3 నుంచి పోస్టల్‌ ఓట్లు వేసే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఓటింగ్‌ సరళిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

శిక్షణ ఒకచోట....బ్యాలట్‌ మరోచోట

గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో ఎన్నికల విధుల్లో పాల్గొనే పీవో, ఏపీవోలకు శిక్షణ ఒకచోట, పోస్టల్‌ బ్యాలట్‌ వేసేందుకు మరోచోట ఏర్పాట్లు చేయడం ఉద్యోగులను తీవ్ర గందరగోళానికి గురిచేసింది.

పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో మధ్యాహ్నం వరకూ కేవలం 2 పోలింగ్‌ బూత్‌లే ఏర్పాటు చేశారు. రద్దీ అధికంగా ఉండడంతో ఉద్యోగుల డిమాండ్‌ మేరకు మధ్యాహ్నం తర్వాత మరో బూత్‌ ఏర్పాటు చేశారు. మూడు పోలింగ్‌ బూత్‌లనే ఏర్పాటు చేయడంతో గంటలకొద్దీ లైన్లలో నిలబడాల్సివచ్చింది. డిక్లరేషన్‌ ఫారం పూర్తి చేయడంలో అంగన్‌వాడీలకు సరైన అవగాహన కల్పించలేదు.

జోరుగా బేరసారాలు..

వైకాపా నాయకులు కొన్నిచోట్ల పోస్టల్‌ బ్యాలట్‌ కోసం బేరసారాలు సాగించారు. ఓటు వేసి, వాట్సప్‌ చేస్తే రూ.3 వేల నుంచి రూ.5వేల వరకూ ఇస్తామంటూ ఆశ చూపారు. నిబంధనల ప్రకారం ఫోన్లను కేంద్రాల్లోకి అనుమతించకూడదు. కానీ, చాలా జిల్లాల్లో ఈ నిబంధన పాటించలేదు. విజయవాడ సెంట్రల్‌ పోస్టల్‌ కాలనీలో ఓ ఉద్యోగికి వైకాపా నాయకులు డబ్బుల ఎర చూపారు. ఓటుకు రూ.5 వేలు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేయగా.. కొంతమంది అడ్డుకున్నారు.

కొన్నిచోట్ల ఓట్ల గల్లంతు..

విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో గ్రంథాలయశాఖకు చెందిన ఉద్యోగి ఫాం-12 సమర్పించినా తన ఓటు లిస్టులో లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల వివరాలు లిస్టుల్లో కనిపించకపోవడంతో 8వ తేదీన రావాలంటూ చెప్పడంతో చాలా మంది వెనుదిరిగారు.  పోర్టులో ఎన్నికల విధులు అప్పగించిన కొందరికి ఫాం-12లు ఇవ్వలేదు. షిప్‌యార్డుకు చెందిన ఉద్యోగులు పోస్టల్‌ఓటు వేసేందుకు వస్తే వారి ఓట్లు కనిపించలేదు.

చిత్తూరు జిల్లా కేంద్రంలో అన్ని ఆధారాలు సమర్పించి ఫాం- 12 పొందిన ప్రభుత్వ ఉద్యోగులు.. జాబితాలో తమ పేరు లేదని స్థానిక పీవీకేఎన్‌ కళాశాలకు వచ్చిన తర్వాత గుర్తించారు. ఫాం- 12 సమర్పించినా పేరు ఎలా లేకుండా చేస్తారని ప్రశ్నించారు. దీంతో హెల్ప్‌డెస్క్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు.. డ్యూటీ ఆర్డర్‌, ఓటరు జాబితాలోని సీరియల్‌ నంబరు, ఆధార్‌కార్డు తీసుకు వస్తే ఓటు వేయవచ్చని తెలిపారు. ఆ వివరాలు రాసుకుని ఓటేసేందుకు అవకాశం ఇచ్చారు.

అధికార పార్టీ నేతల హడావుడి..

  • విశాఖ ఆంధ్ర వర్సిటీ తెలుగు, ఆంగ్ల మాధ్యమ పాఠశాలల వద్ద పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ జరగ్గా అక్కడ వైకాపాకు చెందిన కొందరు హడావుడి చేశారు. ఉద్యోగుల వివరాలు నమోదు చేస్తూ ప్రలోభాలకు గురిచేశారు. నిబంధనలకు విరుద్ధంగా వైకాపా ప్రచార రథాలను అదే ప్రాంతంలో పలుమార్లు నిలబెట్టారు.
  • ఏలూరు జిల్లా నూజివీడులో పోస్టల్‌ ఓటు వేస్తున్న ఉద్యోగులకు తాయిలాలను ఆశ చూపించారు.  ట్రిపుల్‌ ఐటీలో మరోసారి అధికార పార్టీ నాయకులు హవా నడిపించారు. ఇది తెలుసుకుని తెదేపాకు చెందిన వారు అక్కడికి చేరుకునే లోపే వైకాపా నాయకులు బయటకు వెళ్లిపోయారు.
  • ఎన్టీఆర్‌ జిల్లా నందిగామలో ఫెసిలిటేషన్‌ సెంటర్‌లోపలికి తెదేపా అభ్యర్థి తంగిరాల సౌమ్యను రిటర్నింగ్‌ అధికారి అనుమతించలేదు. బందరులో కేంద్రం బయట ఉద్యోగులను వైకాపా నేతలు ఓట్లు అభ్యర్థించారు.
  • చిత్తూరు జిల్లా పలమనేరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద తెదేపా- వైకాపా వర్గీయులు గుమికూడి ఉన్న సమయంలో కొంతసేపు ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. కుప్పంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద ఎమ్మెల్సీ భరత్‌ 100 మీటర్లలోపే ఉండి వైకాపాకు ఓటేయాలని సూచించారు. అక్కడే ఉన్న తెలుగుదేశం నాయకులను పోలీసులు వెనక్కి పంపారు.
  • చిత్తూరు నగరంలో తెదేపా వర్గీయులు డబ్బులు పంచుతున్నారని వైకాపా అభ్యర్థి విజయానందరెడ్డి, ఆయన అనుచరులు పోలీస్‌లైన్‌ ప్రాంతానికి వెళ్లారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఇద్దరు తెలుగుదేశం నాయకులను ఒకటో పట్టణ పోలీసులకు అప్పగించినా అందులో ఒకరిని వదిలేశారని వైకాపా అభ్యర్థి స్టేషన్‌ ముందు చొక్కా విప్పి ఆందోళనకు దిగారు.

నిర్లక్ష్యంపై వేటు..

శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించిన కారణంగా ముగ్గురు ఉన్నతాధికారులపై చర్యలకు ఉపక్రమిస్తూ జిల్లా ఎన్నికల అధికారి మనజీర్‌ జిలాని సమూన్‌ షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. నరసన్నపేటలో శనివారం ప్రారంభమైన పోస్టల్‌ బ్యాలట్‌ ఎన్నికల ప్రక్రియలో గందరగోళ పరిస్థితులకు తావిచ్చిన కారణంగా వారికి నోటీసులు ఇచ్చి 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. నరసన్నపేట రిటర్నింగ్‌ అధికారి రామ్మోహన్‌రావు, మెప్మా పీడీ పోస్టల్‌ బ్యాలెట్‌ ఫెసిలిటేషన్‌ సెంటర్‌ ప్రత్యేక అధికారి కిరణ్‌ కుమార్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి, సారవకోట తహసీల్దార్‌ భాగ్యలక్ష్మి షోకాజ్‌ నోటీసులు అందుకున్నారు.

ఓట్లు చెల్లకుండా కుట్ర

ఓటరుగా గెజిటెడ్‌ అధికారి ధ్రువీకరణ తప్పనిసరి కావడంతో ప్రతి పోలింగ్‌ కేంద్రంలోనూ గెజిటెడ్‌ అధికారిని నియమించారు. అయితే గెజిటెడ్‌ అధికారి సంతకంతో పాటు, స్టాంపు కూడా తప్పనిసరిగా వేయాల్సి ఉండగా శ్రీకాకుళంలో గెజిటెడ్‌ అధికారి కేవలం సంతకం మాత్రమే చేశారు. స్టాంపు వేయలేదు. దీనిపై రిటర్నింగ్‌ అధికారికి పలువురు ఫిర్యాదులు చేశారు. పోస్టల్‌ ఓట్లు ఏకపక్షంగా వైకాపాకు వ్యతిరేకంగా పడుతుండడంతో ఈ విధంగా ఓట్లు చెల్లనీయకుండా చేస్తున్నారని పలువురు ఆరోపించారు.

పోస్టల్‌ బ్యాలట్లను పెట్టి సీజ్‌ చేసే కవర్ల సీళ్లు ఊడిపోయాయి. సీలు ఊడిపోయిన కవర్లలోని బ్యాలట్‌లను లెక్కించకుండా చేసేందుకే ఈ పన్నాగం పన్నినట్లు ఉద్యోగులు వెల్లడించారు.


‘ఎన్నికల తర్వాత నీ సంగతి చూస్తాం’

బాపట్ల, న్యూస్‌టుడే: బాపట్ల జిల్లా కేంద్రంలో పురపాలక ఉన్నత పాఠశాల పోలింగ్‌ కేంద్రం పరిసరాల నుంచి దూరంగా వెళ్లాలన్న పట్టణ సీఐ శ్రీనివాసులును.. వైకాపా ఎమ్మెల్యే కోన రఘుపతి పీఏ కిశోర్‌, ఆ పార్టీ నేతలు బెదిరించారు. ‘మమ్మల్ని ఇక్కడ నుంచి వెళ్లమంటారా.. ఎన్నికల తర్వాత నీ సంగతి తేలుస్తాం’ అంటూ హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img