వడదెబ్బ నివారణకు ఎన్‌సీడీసీ మార్గదర్శకాలు పాటించండి

దేశవ్యాప్తంగా వేసవి ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతున్నందున.. కార్మికులకు అవసరమైన వైద్యసేవలు అందించేందుకు చర్యలు చేపట్టాలని ఈఎస్‌ఐ ఆసుపత్రులను ఉద్యోగుల స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఈఎస్‌ఐసీ) ఆదేశించింది.  

Updated : 06 May 2024 07:05 IST

ఈఎస్‌ఐ ఆసుపత్రులు, డిస్పెన్సరీలకు ఈఎస్‌ఐసీ ఆదేశాలు

ఈనాడు, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా వేసవి ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతున్నందున.. కార్మికులకు అవసరమైన వైద్యసేవలు అందించేందుకు చర్యలు చేపట్టాలని ఈఎస్‌ఐ ఆసుపత్రులను ఉద్యోగుల స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఈఎస్‌ఐసీ) ఆదేశించింది. వడదెబ్బకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ (ఎన్‌సీడీసీ) మార్గదర్శకాల మేరకు డిస్పెన్సరీలు, ఆసుపత్రుల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని స్పష్టం చేసింది. వడదెబ్బ బాధితులకు సత్వర చికిత్సలు అందించాలని సూచించింది. మార్చి 1 నుంచి ఈఎస్‌ఐ ఆసుపత్రుల్లో నమోదైన వడదెబ్బ కేసులు, చికిత్సలు, మృతుల వివరాలను ‘నేషనల్‌ ప్రోగ్రామ్‌ ఆన్‌ క్లైమేట్‌ ఛేంజ్‌ అండ్‌ హ్యూమన్‌హెల్త్‌’ పోర్టల్‌లో నమోదు చేయాలని స్పష్టంచేసింది.

ఈ లక్షణాలు కనిపిస్తే..

పెద్దల్లో అయోమయం, గందరగోళం, ఆందోళన, చిరాకు, మూర్ఛ, కోమా లక్షణాలు.. శరీరం వేడిగా, చర్మం ఎర్రగా, తేమలేకుండా మారడం.. శరీర ఉష్ణోగ్రత 104 ఫారన్‌హీట్‌కు మించి నమోదు కావడం.. తలనొప్పి, ఆందోళన, కండరాల బలహీనత, తిమ్మిరి, వికారం, వాంతులు, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు.. చిన్నారులు ఆహారం తీసుకోవడానికి నిరాకరించడం, చికాకు, మూత్రం సరిగా రాకపోవడం, నోరు పొడిబారడం, బద్ధకం, మూర్ఛ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుణ్ని సంప్రదించాలి.


ఎన్‌సీడీసీ మార్గదర్శకాలివీ...

  • ఈఎస్‌ఐ ఆసుపత్రులకు నిరంతర విద్యుత్‌ సరఫరా జరిగేలా చూడాలి. ఆసుపత్రుల లోపల వేడిని తగ్గించేలా పైకప్పు గ్రీన్‌ రూఫ్‌, కూలింగ్‌ రూఫ్‌, విండోషేడ్‌ ఏర్పాటు తదితర చర్యలు తీసుకోవాలి. వెయిటింగ్‌ ప్రాంతాలు, చికిత్స వార్డులు చల్లగా ఉండేలా పరికరాలు నిరంతరం పనిచేస్తూ ఉండాలి.
  • వడదెబ్బకు గురైన వ్యక్తులను వెంటనే గుర్తించి అవసరమైన చికిత్స అందించాలి. ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, ఐవీఫ్లూయిడ్స్‌, ఐస్‌ప్యాక్స్‌, అవసరమైన ఇతర పరికరాలు అందుబాటులో ఉంచాలి. అన్ని ఆసుపత్రుల్లో తగినంత తాగునీరు ఉండాలి.
  • వడదెబ్బకు గురైన వ్యక్తులకు ప్రాథమిక చికిత్స అందించి, ఇతర ఆసుపత్రులకు తరలించే సమయంలో అంబులెన్స్‌లలో ఐస్‌ప్యాక్స్‌, చల్లటినీరు, ఇతర వసతులు ఉండేలా చూడాలి.
  • వాతావరణ విభాగం సూచనలను పాటిస్తూ వడగాల్పుల సమయంలో బాహ్యప్రదేశాల్లో సమావేశాలు, వేడుకలు నిర్వహించకూడదు.
  • ఉద్యోగులు, కార్మికులకు పనిప్రదేశాల్లో చల్లటి తాగునీరు అందించాలి. ఉద్యోగులు ప్రతి 20 నిమిషాలకు ఒకసారి ఒకకప్పు తాగునీరు తాగాలి. ఎండలో పనిచేసే కార్మికులు ప్రతి గంటకు ఐదు నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి.
  • వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే చల్లటి ప్రదేశానికి వెళ్లాలి. ద్రవపదార్థాలు తీసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని