ఏపీకి రైల్వే కేటాయింపులు రూ.8,400 కోట్లకు పెంపు

ఆంధ్రప్రదేశ్‌కు రైల్వే కేటాయింపులు రూ.886 కోట్ల నుంచి రూ.8,400 కోట్లకు పెంచారని, వందేభారత్‌ రైళ్లు దేశవ్యాప్తంగా 41 ప్రారంభమైతే.. ఏపీలో అయిదు అందుబాటులోకి వచ్చాయని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు.

Updated : 13 Jan 2024 06:41 IST

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

గుంటూరు (నగరంపాలెం), న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌కు రైల్వే కేటాయింపులు రూ.886 కోట్ల నుంచి రూ.8,400 కోట్లకు పెంచారని, వందేభారత్‌ రైళ్లు దేశవ్యాప్తంగా 41 ప్రారంభమైతే.. ఏపీలో అయిదు అందుబాటులోకి వచ్చాయని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. గుంటూరు రైల్వేస్టేషన్‌లో ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ పొడిగింపును కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి శుక్రవారం జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. నంద్యాల-రేణిగుంట, నర్సాపూర్‌-హుబ్బళ్లి మధ్య రైళ్లను వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ మోదీ ప్రభుత్వ హయాంలో 25,800 కిలోమీటర్ల మేర కొత్త ట్రాక్‌లు వేశారన్నారు. ఏపీలో అన్ని లైన్ల విద్యుదీకరణ పూర్తి చేశామని తెలిపారు. 371 కిలోమీటర్ల మేర కొత్త రైలు మార్గాన్ని ఏపీలో నిర్మించినట్లు వివరించారు. విశాఖ-విజయవాడ ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రయాణికుల సౌకర్యార్థం గుంటూరుకు పొడిగించినట్లు     వివరించారు. విజయవాడ-హుబ్బళ్లి రైలును కోనసీమ ప్రజలకు చేరువ చేసేందుకు నర్సాపూర్‌ వరకు     పొడిగించామన్నారు. నంద్యాల - రేణిగుంట మధ్య రాయలసీమ ప్రజలు వెంకన్నను దర్శించుకునే వీలుగా రైలును ఏర్పాటు చేశామన్నారు. గుంటూరు-విశాఖ మధ్య నడిచే రైలు వారంలో అయిదు  రోజులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందన్నారు.

సంక్రాంతిని పురస్కరించుకొని జనవరి 13 నుంచి మూడు రైళ్లు అందుబాటులో ఉంటాయన్నారు. గుంటూరు నగర మేయర్‌ మనోహర్‌నాయుడు మాట్లాడుతూ గుంటూరు జీజీహెచ్‌ ఎదురుగా ఉన్న ప్రధాన టెర్మినల్‌ను అభివృద్ధి చేయాలని కోరారు. కార్యక్రమంలో డీఆర్‌ఎం ఎం.రామకృష్ణ, మాజీ మంత్రి అరుణ, మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య, భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాశ్‌ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని