వైవీ సుబ్బారెడ్డి వ్యవసాయక్షేత్రానికి రూ.30 లక్షలతో రోడ్డు

రాష్ట్రంలో ఏ రోడ్డు చూసినా అడుగుకో గుంత కనిపిస్తోంది. వాటిల్లో పడి అమాయకుల ప్రాణాలు సైతం పోతున్నాయి. కొత్త రోడ్లు నిర్మించడం సంగతి ఏమోగానీ కనీసం గుంతలనైనా పూడ్చి పుణ్యం కట్టుకోండి మహాప్రభో అని వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు.

Updated : 13 Feb 2024 11:33 IST

ఉపాధి నిధులతో నిర్మాణం
జగన్‌ చిన్నాన్న కావడంతో అధికారుల స్వామిభక్తి
సామాన్యులకు గుంతల రోడ్లే గతి!

ఈనాడు-అమరావతి, న్యూస్‌టుడే-మేదరమెట్ల: రాష్ట్రంలో ఏ రోడ్డు చూసినా అడుగుకో గుంత కనిపిస్తోంది. వాటిల్లో పడి అమాయకుల ప్రాణాలు సైతం పోతున్నాయి. కొత్త రోడ్లు నిర్మించడం సంగతి ఏమోగానీ కనీసం గుంతలనైనా పూడ్చి పుణ్యం కట్టుకోండి మహాప్రభో అని వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. అయినా జగన్‌ ప్రభుత్వంలో కదలిక లేదు. మరోవైపు ప్రజలు తిరగని, అసలు నివాసాలే లేని మార్గంలో రూ.30 లక్షలు వెచ్చించి తారు రోడ్డునే నిర్మించారు. విషయమేమిటా అని ఆరా తీస్తే.. అసలు నిజం బయటకొచ్చింది. ఆ రోడ్డు సీఎం జగన్‌ చిన్నాన్న, తితిదే మాజీ ఛైర్మన్‌, రాజ్యసభ సభ్యుడిగా సోమవారం నామినేషన్‌ దాఖలు చేసిన వైవీ సుబ్బారెడ్డి వ్యవసాయ క్షేత్రానికి చేరుతుందని తెలిసింది. కొంత కాలం కిందట ఆయన ఆదేశించడం, అధికారులు స్వామిభక్తి చాటుకుంటూ ప్రజాధనాన్ని వెచ్చించి ఈ రోడ్డు నిర్మించడం చకచకా జరిగిపోయాయి. బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం అనమనమూరు పంచాయతీ పరిధిలో వైవీ సుబ్బారెడ్డి సోదరులకు సుమారు వంద ఎకరాల మేర వ్యవసాయ భూములు, పండ్ల తోటలు ఉన్నాయి. అక్కడకు చేరుకునేందుకు గతంలో మట్టి రోడ్డు ఉండేది. ఇటీవల ఉపాధి హామీ నిధులు రూ.30 లక్షలు వెచ్చించి 2.5 కి.మీ. మేర ఆ వ్యవసాయ క్షేత్రం వరకు రోడ్డు వేసేశారు. ఈ మార్గంలో ఒక్క నివాస గృహం లేకపోయినా సరే.. వైవీ సోదరుల కోసమే దీనిని నిర్మించారు.

12 ఏళ్లుగా రోడ్డు లేని పునరావాస కాలనీ

గుండ్లకమ్మ ప్రాజెక్టు ముంపు గ్రామాల పరిధిలో ఉన్న అనమనమూరు నుంచి సుమారు 70కి పైగా కుటుంబాల్ని 12 ఏళ్ల కిందట ఖాళీ చేయించి, బొడ్డువానిపాలెంలో పునరావాస కాలనీకి తరలించారు. ఆ కాలనీకి చేరుకునేలా రహదారి నిర్మిస్తామని చెప్పినా ఆ తర్వాత ఎవరూ పట్టించుకోలేదు. బాధితులు అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా స్పందన కరవైంది. చివరకు ఆ కాలనీవాసులే సొంతంగా డబ్బులు వెచ్చించి గత నవంబరులో మట్టి రోడ్డు నిర్మించుకున్నారు. వీరి గోడు పట్టించుకోని అధికారులు.. వైవీ సుబ్బారెడ్డి పొలానికి రోడ్డు వేయడంపై విమర్శలు వస్తున్నాయి.

కలెక్టర్‌ మంజూరు చేశారట: దీనిపై బాపట్ల జిల్లా పంచాయతీరాజ్‌ డీఈ రమేశ్‌ను ‘ఈనాడు’ వివరణ కోరగా.. ‘పంచాయతీ తీర్మానం మేరకు ఆ రోడ్డు నిర్మించాం. ఆ పనుల్ని కలెక్టర్‌ మంజూరు చేశారు. ఉపాధి హామీ నిధులతో బీటీ రోడ్లు నిర్మించుకునే వెసులుబాటు ఉంది’ అని తెలిపారు. ఇదే విషయమై డ్వామా పీడీ అర్జునరావును వివరణ కోరగా.. తాను బాధ్యతలు స్వీకరించి మూడు నెలలవుతోందని, తన హయాంలో ఆ పనులు జరగలేదని చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని