యువత పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతోంది

‘ఓటేసే ముందు మీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించండి.. ఎవరు అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారో.. వారినే ముఖ్యమంత్రిగా చేయండి’ అని సౌదీ అరేబియాలోని ఆరామ్‌కో సంస్థతో కలిసి ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ కంపెనీ నిర్వహిస్తున్న రావి రాధాకృష్ణ ఓటర్లకు పిలుపునిచ్చారు.

Published : 04 May 2024 05:18 IST

బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించి ఓటేయండి
రాష్ట్రంలో అభివృద్ధి సాధకులనే ఎన్నుకోండి
‘ఈనాడు-ఈటీవీ’తో సౌదీ అరేబియా పారిశ్రామికవేత్త రావి రాధాకృష్ణ

ఈనాడు-అమరావతి: ‘ఓటేసే ముందు మీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించండి.. ఎవరు అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారో.. వారినే ముఖ్యమంత్రిగా చేయండి’ అని సౌదీ అరేబియాలోని ఆరామ్‌కో సంస్థతో కలిసి ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ కంపెనీ నిర్వహిస్తున్న రావి రాధాకృష్ణ ఓటర్లకు పిలుపునిచ్చారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని మలికిపురం నుంచి 20 ఏళ్ల కిందట విదేశాలకు వెళ్లిన ఆయన తొలుత అమెరికాలో, తర్వాత సౌదీ అరేబియాలో పారిశ్రామికవేత్తగా ఎదిగారు. ప్రతి ఎన్నికల సమయంలోనూ ఓటు హక్కు వినియోగించునేందుకు స్వస్థలానికి వస్తుంటానని, ఈ దఫా ఇక్కడి పరిస్థితులు చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని.. ముఖ్యంగా యువత భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన ‘ఈనాడు’-ఈటీవీ’తో మాట్లాడారు. ఉపాధి అవకాశాలు మెరుగుపడాలన్నా, పరిశ్రమలు ఏర్పాటు కావాలన్నా ఎలాంటి ప్రభుత్వం రావాలి? ఎవరికి ఓటేయాలో వివరిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు.

ఎవరు సీఎం అయితే కంపెనీలు తెస్తారో.. ఉపాధి చూపిస్తారో

‘రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో అభివృద్ధి దిశగా కొంతమేర అడుగులు పడినా, అయిదేళ్లుగా అంతా డొల్లతనమే. ఉపాధి కల్పించే పరిశ్రమలు లేవు. లక్షలాది మంది యువత, కార్మికులు, రైతులు అంతా ఇబ్బందుల్లోనే ఉన్నారు. నా రాష్ట్రం ఇలా అయిందేంటని బాధ పడుతున్నా. ప్రస్తుతం రాష్ట్రంలోని పరిస్థితులను ఓటర్లకు వివరిస్తూ.. అందరి భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని కోరుతున్నా’ అని పేర్కొన్నారు. ‘ఎవరు ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందో.. ఎవరి హయాంలో ప్రజల ఆస్తులకు రక్షణ లభిస్తుందో.. బిడ్డల భవిష్యత్తు బాగుంటుందో ప్రతిఒక్కరూ ఆలోచించాలి’ అని సూచించారు. ‘ఎవరు సీఎం అయితే దేశవిదేశాలు తిరిగి రాష్ట్రానికి సంస్థలు తెస్తారో, పరిశ్రమలు ఏర్పాటు చేయించి యువతకు ఉపాధి కల్పిస్తారో.. వలసలు ఆపి పనులు చూపుతారో.. అలాంటి నేతను ఎన్నుకోవాలి. అలాంటి ప్రభుత్వాన్ని ఆహ్వానించాలి’ అని కోరారు.

పరిశ్రమల ఏర్పాటుకు అనుకూల వాతావరణం కల్పించాలి

‘ఏ దేశమైనా, రాష్ట్రమైనా పరిశ్రమలకు అనుకూల వాతావరణం కల్పించాలి. యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలి. అప్పుడే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి’ అని రాధాకృష్ణ పేర్కొన్నారు. ‘రాష్ట్రంలో 2014-19 మధ్య పరిశ్రమల ఏర్పాటుకు అనుకూల వాతావరణం ఉంది. 2019-24 మధ్య కాలంలో అభివృద్ధి లేదు. మౌలిక వసతుల కల్పన ఆగిపోయింది’ అని చెప్పారు. ‘ఏపీలోని వివిధ రంగాల్లో పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి కల్పన అనేది నిరంతర ప్రక్రియ కావాలి. అందుకు అనుగుణంగా మౌలిక వసతులు మెరుగుపరచాలి’ అని అభిప్రాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని