పేదల ఇళ్లపై దా‘గూడు’ మూతలు!

ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన్నాటి నుంచి... అభివృద్ధి మరచి తెదేపాపై అక్కసుతో వ్యవహరించిన జగన్‌... పేదలకిచ్చే ఇళ్లలోనూ ఆ అవలక్షణాన్నే ప్రదర్శించారు.

Published : 04 May 2024 05:17 IST

టిడ్కో గృహాలపై జగన్‌ ఉదాసీనం
మొత్తం 2.62 లక్షల ఇళ్ల పంపిణీలో వైకాపా సర్కారు నిర్లక్ష్యం
రుణభారం తప్పిస్తామని ప్రగల్భాలు
చివరికి ఇళ్లు అప్పగించకుండానే చేతులెత్తేసిన వైకాపా సర్కారు

ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన్నాటి నుంచి... అభివృద్ధి మరచి తెదేపాపై అక్కసుతో వ్యవహరించిన జగన్‌... పేదలకిచ్చే ఇళ్లలోనూ ఆ అవలక్షణాన్నే ప్రదర్శించారు. తెదేపా ప్రభుత్వం చేపట్టిందన్న ఒకే ఒక్క కారణంతో.. బడుగువర్గాల కోసం నిర్మించిన వేలాది ఇళ్లపై గునపం పోటు పొడిచారు.


ప్రజలకు మాటిస్తే నెరవేర్చాలి. లేకపోతే అతను నాయకుడే కాదు..

 జగన్‌ పదేపదే వల్లెవేసే సూక్తిముక్తావళి!


300 చ.అ. విస్తీర్ణం గల ఇంటిపై పేదలకు ఉన్న అప్పుల భారాన్ని రద్దు చేస్తాం.

 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో జగన్‌ ఇచ్చిన హామీ


2021 డిసెంబరు 21వ తేదీ నాటికి టిడ్కో గృహాలన్నింటినీ లబ్ధిదారులకు అందిస్తాం.

 2020 నవంబరు 16న అప్పటి మంత్రి కొడాలి నాని ప్రకటన


టిడ్కో ద్వారా 2.62 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నాం. వీటిలో 1,07,814 గృహాలు పూర్తయ్యాయి. మిగిలినవి నిర్మాణ దశలో ఉన్నాయి. 2022 డిసెంబరు కల్లా వీటన్నింటినీ లబ్ధిదారులకు పంపిణీ చేస్తాం.

2022 మార్చి 17న అసెంబ్లీ వేదికగా సీఎం జగన్‌


జగనన్న చెప్పారు అంటే.. చేస్తారు అంతే..

సీఎం భజన బ్యాచ్‌ వండివార్చే మాటల వంటకాలు!


తనకు మాత్రమే పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు అబ్బినట్లు.. పేదలకు సేవ చేసేందుకే తాను పుట్టినట్టు నీతివాక్కులు చెబుతారు జగన్‌. కానీ.. ఆయన చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలే. ఇందుకు నిలువెత్తు నిదర్శనం.. టిడ్కో(టౌన్‌షిప్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌)గృహాలపై వల్లెవేసిన అసత్యాలు. రూ. వేల కోట్ల విలువైన ప్రజాధనంతో నిర్మించిన గృహాలను దిక్కూమొక్కు లేకుండా వదిలేశారు.  టిడ్కో పేదల పక్షపాతినంటూ గుండెలు బాదుకునే ఆయన.. వారి సొంతింటి కలను నెరవేర్చకుండా వంచించారు. గృహాలకు స్థల సేకరణ నుంచి లబ్ధిదారుల ఎంపిక, కేంద్రం అనుమతులు, మౌలిక వసతుల ప్రణాళిక వరకు అన్నీ తెదేపా ప్రభుత్వమే పూర్తిచేసింది. రాష్ట్రంలో 2.62 లక్షల గృహాలను పూర్తి చేస్తామని వైకాపా సర్కారు ఆర్భాటంగా ప్రకటించింది. వాటిలోని 1.50 లక్షల ఇళ్లకు సంబంధించిన పనులు 75-100 శాతం వరకు గత ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయి. జగన్‌కు నిజంగా పేదలపై మమకారం ఉంటే టిడ్కో గృహాలన్నింటినీ ఏడాదిలోగానే పూర్తి చేసి వాటిని అందించి ఉండొచ్చు. కానీ ఆయన చేసేది.. పేదల పేరు చెప్పుకొని విష రాజకీయమే కదా..


51 వేల గృహాల రద్దు

పేదలపై జగన్‌ ఎంత కర్కశంగా వ్యవహరించారో చెప్పేందుకు టిడ్కో ఇళ్ల రద్దు ఉదంతమే నిదర్శనం. అప్పట్లో తెదేపా ప్రభుత్వం 3.13 లక్షల గృహాల నిర్మాణాలను చేపట్టింది. జగన్‌ అధికారంలోకి రాగానే.. 51 వేల మంది పేదలకు కేటాయించిన ఇళ్లను రద్దు చేశారు. మిగిలిన 2.62 లక్షల ఇళ్లను పూర్తి చేయనున్నట్టు ప్రకటించారు. 25 శాతం కంటే తక్కువ శాతం పనులు పూర్తయిన గృహాలను రద్దుచేయడంతో  రూ. కోట్ల ప్రజాధనం వృథా అయింది. కనీసం పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు అందజేశారా అంటే అదీ లేదు.


అప్పులు తెచ్చుకోమన్నారు

సీఎం జగన్‌ అధికారపీఠంపై కూర్చున్న తర్వాత మొదటి రెండేళ్లు టిడ్కో గృహాల విషయాన్నే పట్టించుకోలేదు. తర్వాత ప్రతిపక్షాల ఒత్తిడితో పనులు చేపట్టినా అవి నత్తనడకన సాగాయి. నిర్మాణాలను సకాలంలో పూర్తిచేసేందుకు బడ్జెట్‌ నుంచి ఒక్క రూపాయి కూడా విదిల్చేందుకు మనసొప్పలేదు. అప్పులు తెచ్చుకుని కట్టుకోవాలంటూ టిడ్కోపైనే మొత్తం భారం వేశారు. ఇలా దాదాపు రూ.6 వేల కోట్ల వరకు టిడ్కోపై అప్పుల కుంపటి పెట్టారు జగన్‌.


ప్రభుత్వ పరపతినీ దెబ్బతీశారు

జగన్‌ పుణ్యమా అని బ్యాంకుల వద్ద ప్రభుత్వ పరపతి కూడా దెబ్బతింది. ఆయన నిర్వాకంతో అప్పులు ఇచ్చేంద]ుకు బ్యాంకులు వెనుకడుగు వేశాయి. వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి టిడ్కో ఇళ్లపై రూ.9 వేల కోట్లను ఖర్చు చేసింది. అందులో రూ.6 వేల కోట్లను లబ్ధిదారుల పేరు మీద బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి అప్పుగా తెచ్చుకుందే. పైగా.. ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చినా అప్పు ఇచ్చేందుకు ఆర్థిక సంస్థలేవీ ముందుకు రాలేదు. జగన్‌ పాలన నిర్వాకం ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి ఇదే నిదర్శనం. ప్రభుత్వం దివాలా తీసిందని భావించడంతోనే బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి వెనుకడుగు వేశాయని నిపుణులు చెబుతున్నారు.


తనఖా పెట్టి రూ.500 కోట్ల రుణం

ఇప్పటివరకు ఎన్నో ఆస్తులను బ్యాంకులకు తనఖా పెట్టి అప్పులు చేసిన వైకాపా సర్కారు.. పేదలకు టిడ్కో ఇళ్లను కట్టించేందుకు గత ప్రభుత్వం సేకరించిన భూమిని కూడా వదల్లేదు. సుమారు 260.74 ఎకరాల భూములను బ్యాంకులకు కుదువబెట్టింది. ఈ స్థలాల నుంచి రూ.750 కోట్ల రుణం తీసుకునేందుకు జగన్‌ సర్కారు ప్రయత్నించగా.. రూ.500 కోట్ల అప్పు మాత్రమే పుట్టింది. ఈ డబ్బును ఎక్కడ ధార పోశారో జగన్‌కు మినహా మరొకరికి తెలియని పరిస్థితి.


60 వేల ఇళ్ల పనులకు అతీగతి లేదు

2.62 లక్షల గృహాలను పూర్తిచేస్తామని జగన్‌ ప్రకటించగా వాటిలో 60 వేల ఇళ్ల నిర్మాణాల పనులు అడుగు కూడా ముందుకు పడలేదు. రాష్ట్రంలోని రేపల్లె, బాపట్ల, అద్దంకి, ఒంగోలు, మార్కాపురం, పామిడి, గుత్తి, ధర్మవరం, కదిరి, హిందూపురం, పుట్టపర్తి, అనంతపురం, తెనాలి, పిడుగురాళ్ల, వినుకొండ, మాచర్ల, చిలకలూరిపేట, తణుకు, నిడదవోలు తదితర పట్టణాల్లో టిడ్కో గృహాల పనులు సాగడంలేదు. ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టడానికి గుత్తేదారులెవరూ ముందుకురావడం లేదంటే ప్రభుత్వంపై వారికి ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు.


రూ.320 కోట్లు చెల్లించకుండా ఎగవేత

‘‘రాష్ట్రవ్యాప్తంగా 365 చ.అ. విస్తీర్ణం గల గృహాల లబ్ధిదారులు 74 వేల మంది, 430 చ.అ విస్తీర్ణం గల ఇళ్ల లబ్ధిదారులు 44 వేల మంది ఉన్నారు. వీరికి ఊరట కలిగించే దిశలో అడుగులు వేస్తున్నాం. 365 చ.అ విస్తీర్ణం గల ఇళ్ల లబ్ధిదారులు తమ వాటాగా రూ.50 వేలు కట్టాలి. దీన్ని రూ.25 వేలకు తగ్గిస్తాం. 430 చ.అ విస్తీర్ణం గల ఇళ్ల లబ్ధిదారులు రూ.లక్ష చొప్పున చెల్లించాలి. దీన్ని రూ.50 వేలకు కుదిస్తాం. రాష్ట్ర ప్రభుత్వమే ఆ భారాన్ని భరిస్తుంది’ అని సీఎం జగన్‌ 2020 డిసెంబరులో అసెంబ్లీ సాక్షిగా మాటిచ్చారు. అప్పటికే లబ్ధిదారులు తమ వాటాగా రూ.170 కోట్ల మేరకు చెల్లించారు. జగన్‌ ఇచ్చిన హామీ ప్రకారం ఆ మొత్తాన్ని లబ్ధిదారులకు తిరిగి వెనక్కి ఇవ్వాలి. కానీ ఇప్పటివరకు వారికి నయాపైసా కూడా ఇవ్వలేదు. అంతేకాదు.. అధికారంలోకి రాగానే రకరకాల కొర్రీలు పెట్టి 50 వేల లబ్ధిదారులను తెగ్గోసి వారి నోట్లో మట్టికొట్టారు. అప్పటికే వారు తమ వాటా ఒక్కొక్కరు రూ.3.15 లక్షలు, రూ.3.65 లక్షల చొప్పున ప్రభుత్వానికి కట్టారు. ఆ మొత్తం రూ.150 కోట్ల వరకు ఉంటుందని అంచనా. దాన్ని కూడా వెనక్కి ఇవ్వలేదు. ఈ లెక్కన జగన్‌ ఐదేళ్లుగా పేదలకు రూ.320 కోట్లు చెల్లించలేదు. వారు అప్పుల్లో కొట్టుమిట్టాడుతున్నా స్పందించలేదు.


అస్మదీయులకు బిల్లులు.. పేదలకు చిల్లులు

వివిధ కాంట్రాక్టు పనులు చేసిన అస్మదీయులకు రూ. వందల కోట్ల బిల్లులను ఎప్పటికప్పుడు చెల్లించిన జగన్‌.. పేదల కోసం టిడ్కో ఇళ్లను కట్టిన గుత్తేదారులకు మాత్రం రూ.400 కోట్ల మేర బకాయి పెట్టారు. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో గుత్తేదారులు చాలా చోట్ల పనులను నిలిపేశారు. టిడ్కో గృహాలన్నింటిని పూర్తిచేసి వాటిని లబ్ధిదారులకు అప్పగించడానికి దాదాపు రూ.4 వేల కోట్ల మేరకు అవసరం ఉన్నట్టు తెలుస్తోంది. తాను నివాసం ఉండేందుకు విశాఖలోని రుషికొండకు గుండు కొట్టించి రూ.450 కోట్లతో ప్యాలెస్‌ కట్టుకున్న జగన్‌.. పేదల ఇళ్ల కోసం నిధులు విదల్చడానికి చేతులురాకపోవడం గమనార్హం.


పుట్టుకతోనే సిమెంటు రోడ్లపై నడిచారా?

పేదలకూ గేటెడ్‌ కమ్యూనిటీ తరహాలో అపార్ట్‌మెంట్లను కట్టి ఇవ్వాలని గత తెదేపా ప్రభుత్వం సంకల్పించింది. అయితే, పేదలు బాగుపడటం ఇష్టం లేని జగన్‌.. అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా చోట్ల టిడ్కో ఇళ్లను వినియోగంలోకి తీసుకురాకుండా వాటిపై గునపం పోటు పొడిచారు! కిటీకీలు, తలుపులు చెదలు పట్టి చెడిపోతున్నా, నిర్మాణ సామగ్రి దొంగల పాలవుతున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. చివరికి ఎన్నికలు సమీపించడంతో 1.42 లక్షల గృహాలను లబ్ధిదారులకు అందించినట్టు లెక్కలు చూపుతున్నారు. పేదలకు అందజేసిన చాలా గృహ సముదాయాల్లో తాగునీరు, మురుగుకాల్వలు, సిమెంటు రహదారులను కూడా పూర్తిచేయలేదు. మౌలిక వసతులు లేకపోతే పేదలు ఇబ్బందులు ఎదుర్కొంటారని సమీక్ష సందర్భంగా ప్రస్తావన వచ్చింది. దానికి.. ‘పేదలు పుట్టుకతోనే సిమెంటు రహదారుల మీద నడిచారా?’’ అని ఓ కీలక అధికారి మాట్లాడారంటే బడుగుజీవులపై వైకాపా సర్కారు వైఖరి ఏంటో ఇట్టే అర్థమవుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని