‘ఉత్తర్వుల ఎత్తివేత’పై త్వరగా విచారించండి

మాజీ మంత్రి వివేకా హత్య విషయంలో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై వ్యాఖ్యలు చేయెద్దంటూ వెలువరించిన ఉత్తర్వులను ఎత్తివేయాలని (స్టే వెకేట్‌) కోరుతూ మృతుడి కుమార్తె నర్రెడ్డి సునీత, పీసీసీ అధ్యక్షురాలు, కడప కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి షర్మిల, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్‌రెడ్డి (బీటెక్‌ రవి)లు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లపై త్వరగా విచారణ చేసి, ఈ నెల 8లోపు నిర్ణయం వెల్లడించాలని కడప జిల్లా న్యాయస్థానాన్ని హైకోర్టు ఆదేశించింది.

Updated : 04 May 2024 06:04 IST

ఈ నెల 8లోపు నిర్ణయాన్ని వెల్లడించాలి
కడప జిల్లా న్యాయస్థానానికి హైకోర్టు ఆదేశం
నర్రెడ్డి సునీత, షర్మిల, బీటెక్‌ రవిల వ్యాజ్యాలపై విచారణ

ఈనాడు, అమరావతి: మాజీ మంత్రి వివేకా హత్య విషయంలో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై వ్యాఖ్యలు చేయెద్దంటూ వెలువరించిన ఉత్తర్వులను ఎత్తివేయాలని (స్టే వెకేట్‌) కోరుతూ మృతుడి కుమార్తె నర్రెడ్డి సునీత, పీసీసీ అధ్యక్షురాలు, కడప కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి షర్మిల, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్‌రెడ్డి (బీటెక్‌ రవి)లు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లపై త్వరగా విచారణ చేసి, ఈ నెల 8లోపు నిర్ణయం వెల్లడించాలని కడప జిల్లా న్యాయస్థానాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ జి.నరేందర్‌, జస్టిస్‌ వి.గోపాలకృష్ణారావులతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. కడప కోర్టులో దావా  వేసి ఉత్తర్వులు పొందిన వైఎస్సార్‌ జిల్లా వైకాపా అధ్యక్షుడు సురేశ్‌బాబు తరఫున సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లు కడప కోర్టులో స్టే వెకేట్‌ పిటిషన్లు వేశారని, వాటిపై విచారణ పెండింగ్‌లో ఉందన్నారు. ఒకే అంశంపై జిల్లా కోర్టు, హైకోర్టుల్లో పిటిషన్లు వేయడానికి వీల్లేదన్నారు.

తెదేపా నేత బీటెక్‌ రవి తరఫున సీనియర్‌ న్యాయవాది ఉన్నం మురళీధరరావు వాదనలు వినిపిస్తూ.. విచారణ పరిధిని దాటి కడప కోర్టు ఉత్తర్వులిచ్చిందన్నారు. దావాలో ప్రతివాదులకు వాదనలు చెప్పుకొనే అవకాశం ఇవ్వకుండా వారికి వ్యతిరేకంగా ఎక్స్‌పార్టీ ఉత్తర్వులిచ్చిందని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతలు చేసిన వ్యాఖ్యలు పరువునష్టం కిందకు రావన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. ‘హత్యకేసు విచారణ కోర్టులో పెండిగ్‌లో ఉండగా, దానిపై మాట్లాడటం ఎందుకు? అలాంటి వ్యాఖ్యలు ఎంతవరకు సమంజసం.. నిందితుడిగా ఉన్న వ్యక్తిని హంతకుడిగా ఎలా ముద్ర వేస్తారు’ అని వ్యాఖ్యానించింది. ఐదేళ్ల తర్వాత ఈ కేసు గురించి ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించింది. బీటెక్‌ రవి తరఫున సీనియర్‌ న్యాయవాది ఉన్నం మురళీధరరావు బదులిస్తూ.. గత ఎన్నికల్లో ఇదే వైకాపా నేతలు వివేకా హత్యను నారాసుర రక్తచరిత్ర అంటూ విషం చిమ్ముతూ విస్తృత ప్రచారానికి వాడుకున్నారన్నారని చెప్పారు. అదే హత్య కేసుపై తాము ఇప్పుడు మాట్లాడుతుంటే తప్పుపడుతున్నారని పేర్కొన్నారు. హత్య కేసులో నిందితుడికి వైకాపా సీటు ఇచ్చిందని, సీఎం నిందితుడికి రక్షణ కవచంగా ఉన్నారని ప్రజలను చైతన్యపరిచే హక్కు పిటిషనర్లకు ఉందని వివరించారు.

సునీత తరఫు న్యాయవాది గూడపాటి వెంకటేశ్వరరావు వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న సమయంలో వ్యాఖ్యలపై ఏమైనా అభ్యంతరం ఉంటే ఈసీకి వినతి సమర్పించాలి తప్ప.. కోర్టులో దావా వేయడానికి వీల్లేదన్నారు. ఇరువైపు వాదనలు విన్న ధర్మాసనం.. ఇప్పటికే కడప కోర్టులో స్టే వెకేట్‌ పిటిషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో వాటిని త్వరగా విచారించి, ఈ నెల 8లోపు నిర్ణయం ప్రకటించాలని ఆదేశించింది. హైకోర్టులో వ్యాజ్యాలను పరిష్కరిస్తూ విచారణను మూసివేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని