పింఛన్‌ పెంచలే.. కానుకకు కరుణించలే!

ముఖ్యమంత్రి జగన్‌ తన ఐదేళ్ల పాలనాకాలంలో దివ్యాంగులపై ఎనలేని వివక్ష చూపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం దివ్యాంగ పింఛనుదారులు 8.07 లక్షల మంది ఉన్నారు.

Updated : 04 May 2024 06:05 IST

దివ్యాంగుల సంక్షేమంపై వైకాపా సర్కారు వివక్ష
రాయితీ రుణాల ఎత్తివేత
ఆర్థికసాయం అందకుండా ఎత్తుగడలు
నమ్మించి మోసం చేసిన జగన్‌
ఈనాడు, అమరావతి

బకాయిలను ఎగవేయడం.. నిధులను, లబ్ధిదారులను తెగ్గోయడం.. జగన్‌కు వెన్నతో పెట్టిన విద్య. అన్ని శాఖలు, అన్ని వర్గాల విషయంలో ఇదే విధానాన్ని అవలంబించిన జగన్‌ ‘కాళ్లూచేతులు’ ఆడని దివ్యాంగుల విషయంలోనూ నిర్దాక్షిణ్యంగానే వ్యవహరించారు. వారు ‘సొంతకాళ్ల’పై నిలబడకుండా రాయితీ రుణాలను ఎత్తేశారు. వారికి ‘ఊతం’గా నిలిచే పింఛనును పెంచలేదు. ‘ఆసరా’ అవ్వాల్సిన ‘పెళ్లికానుక’కు కూడా నిబంధనల తిరకాసుతో ఎసరు పెట్టారు.

ముఖ్యమంత్రి జగన్‌ తన ఐదేళ్ల పాలనాకాలంలో దివ్యాంగులపై ఎనలేని వివక్ష చూపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం దివ్యాంగ పింఛనుదారులు 8.07 లక్షల మంది ఉన్నారు. రాష్ట్రంలో వారు ఉన్నారన్న విషయాన్ని కూడా పట్టించుకోలేదు. 80 శాతానికి పైగా వైకల్యం ఉన్న వారికి గత తెదేపా ప్రభుత్వం రూ.3 వేల పింఛను అందించగా.. వైకాపా సర్కారు పైసా అదనంగా విదల్చలేదు. పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో అల్లాడిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేసినా ఒక్క రూపాయి కూడా పెంచడానికి మనసు రాలేదు జగన్‌కు. వారికంటూ ప్రత్యేక పథకాలు చేపట్టలేదు. పైగా.. గత ప్రభుత్వాలు అమలుచేసిన వాటినీ రద్దు చేశారు. సొంతకాళ్లపై నిలబడి కుటుంబాన్ని పోషించుకునేందుకుగాను అమలుచేసిన రాయితీ రుణ పథకాన్ని ఎత్తేశారు.    ‘పెళ్లికానుక’లో నిబంధనలు తెచ్చి అత్యధికులకు అందకుండా ఎత్తుగడ వేశారు.  దివ్యాంగులకు మోటారు వాహనాలను కూడా తగిన సంఖ్యలో సరఫరా చేయలేదు. వైకాపా నేతలు సిఫార్సు చేసిన వారికే అందజేశారు.

80 శాతంపైగా వైకల్యమున్న వారికి సున్నా

జగన్‌ అధికారంలోకి రాగానే 2019లో వైకల్య శాతంతో సంబంధం లేకుండా అందరికీ రూ.3 వేలను పింఛనుగా ఇస్తున్నట్టు ప్రకటించారు. అంటే 80 శాతానికి పైగా వైకల్యమున్న వారికి ఎలాంటి పెరుగుదల లేదు. 79% కంటే తక్కువ ఉన్న దివ్యాంగులకు అప్పటికే రూ.2 వేలు అందుతుండగా జగన్‌ ప్రకటనతో రూ. 1000 పెరిగినట్టు లెక్క. తర్వాత నాలుగేళ్లు గడిచినా దివ్యాంగులకు పింఛను పెంచలేదు. 2019 నుంచి ఇప్పటివరకు ఐదేళ్లలో నిత్యావసరాల ధరలు ఎంతగానో పెరిగాయి. దివ్యాంగులు వాడే మందుల ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. మిగిలిన వారితో పోల్చితే 80 శాతానికి పైగా వైకల్యమున్న వారికి ఏ పనీ చేసుకునే సామర్థ్యం ఉండదు. కొన్ని కుటుంబాలకు వీరే పూర్తి ఆధారం. అయినా వారికి పింఛను పెంచే విషయంలో జగన్‌ నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారు.

పెళ్లికానుకకు షరతులు..

పెరుగుతున్న ధరలకు అనుగుణంగా దివ్యాంగుల పింఛను పెంచడానికి జాలి లేని జగన్‌.. ‘పెళ్లికానుక’లోనూ కోత విధించి వారిని నష్టపరిచారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలించక చాలా మంది దివ్యాంగులు చదవలేకపోయారు. జగన్‌  మాత్రం.. వధూవరులిద్దరూ పదో తరగతి ఉత్తీర్ణులయితేనే ఆర్థికసాయం అందిస్తామని షరతు విధించారు. పలు రకాల నిబంధనలు పెట్టి వారికి సాయం అందకుండా కుట్రపన్నారు. ఫలితంగా.. అత్యధికులు ‘పెళ్లికానుక’కు నోచుకోలేకపోయారు.  అది కూడా ఎన్నికలు సమీపిస్తున్నాయన్న కారణంగా పంపిణీ చేశారు. 2019 నుంచి 2022 అక్టోబరు వరకు ఈ పథకం కింద ఒక్కరికి కూడా సాయం అందించలేదు. గత ఏడాదిన్నరగా 499 మందికి మాత్రమే పంపిణీ చేసింది. అదే తెదేపా ప్రభుత్వం 2014-19 మధ్య 5,253 మంది దివ్యాంగ యువతకు రూ.34 కోట్లు అందజేసింది.

ఉపాధికి గండికొట్టారు..

తెదేపా ప్రభుత్వం అన్ని వర్గాల మాదిరిగానే దివ్యాంగులకు కూడా రాయితీ రుణాలు అందజేసింది. రూ.లక్ష, రూ.2 లక్షలను రాయితీగా, రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు రుణాలు అందించి ఉపాధి అవకాశాల్ని కల్పించింది. 2014-15 నుంచి 2018-19 వరకు ఏటా ఈ పథకం కింద ఇచ్చే ఆర్థికసాయాన్ని పెంచుతూ పోయింది. ఇలా ఐదేళ్లలో 3,540 మంది లబ్ధిదారులకు రూ.26.55 కోట్ల మేరకు అందించి దివ్యాంగులకు ఆర్థిక భరోసా ఇచ్చింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్‌కు.. దివ్యాంగులు సొంతకాళ్లపై నిలబడటం ఇష్టం లేనట్టుంది! అందుకే... అప్పటివరకు తెదేపా ప్రభుత్వం     అందజేసిన రాయితీ రుణాల మంజూరును నిలిపేసింది. వారి స్వయం ఉపాధికి  గండి కొట్టింది.

కేంద్ర పథకంతో సరిపెట్టేలా..

తెదేపా అమలుచేసిన రాయితీ రుణ పథకాన్ని సీఎం జగన్‌ నిలిపేయడంతో దివ్యాంగుల్లో ఆందోళన పెల్లుబుకింది. పథకాన్ని అమలుపరచాలని వారు డిమాండ్‌ చేయడంతో జగన్‌ కొత్త ఎత్తుగడ వేశారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని జాతీయ విభిన్న ప్రతిభావంతుల ఆర్థికాభివృద్ధి సంస్థ ఇచ్చే రుణాలను రాష్ట్రంలోని దివ్యాంగులకు వర్తింపజేశారు. ఆసక్తి ఉన్న ఒక్కో దివ్యాంగుడికి దీని ద్వారా రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు రుణం ఇప్పించారు. రుణం తీసుకున్న వారికి ఎలాంటి రాయితీ ఉండదు. మొత్తం రుణాన్ని లబ్ధిదారుడు నెలవారీ వాయిదాల రూపంలో చెల్లించాల్సిందే. కనీసం ఇలా అయినా ఎంత మందికి రుణాలు అందజేశారో తెలుసా... 347 మందికి మాత్రమే. ఇది.. దివ్యాంగుల సంక్షేమం, వారి ఉపాధిపై వైకాపా సర్కారుకు ఉన్న చిత్తశుద్ధి.


‘‘దివ్యాంగులకు రూ.3 వేలు పింఛను ఇస్తాం..’’

సాధారణంగా ఏ పార్టీ అయినా ఎన్నికల సమయంలో.. అప్పటివరకు ఓ వర్గానికి కలుగుతున్న లబ్ధికంటే కొంత మెరుగ్గా ప్రయోజనం చేకూర్చాలని చూస్తుంది. మిగిలిన పార్టీలకంటే తాము ఎక్కువ లబ్ధి కలిగిస్తామని మ్యానిఫెస్టోలోనూ, హామీల్లోనూ పేర్కొంటాయి. కానీ, ‘రివర్స్‌’ మనస్తత్వంగల జగన్‌ అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. వైకాపా అధికారంలోకి వచ్చే నాటికే 80 శాతానికిపైగా వైకల్యమున్న దివ్యాంగులకు రూ.3 వేల పింఛను అందుతుండేది. మ్యానిఫెస్టోలోనూ అంతేమొత్తంలో ఇస్తానని పేర్కొన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ధరలు అడ్డగోలుగా పెరిగినా.. అదే రూ.3 వేలు ఇచ్చారు. ఇతర పథకాల అమలులోనూ 80 శాతానికిపైగా వైకల్యమున్న వారికి నిబంధనల కొర్రీలు పెట్టి వంచించారు.


ఆ మంచి రోజులు మళ్లీ ఎప్పుడు?

గత తెదేపా ప్రభుత్వ ఐదేళ్ల పాలనాకాలం దివ్యాంగులకు మంచి రోజులని చెప్పొచ్చు. 2014లో తెదేపా ప్రభుత్వం.. అప్పటివరకు 40% నుంచి 79% వరకు వైకల్యం ఉన్న దివ్యాంగులకు అందిన రూ.500 పింఛనును రూ.1000కి పెంచింది. 80% అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారికి ఇస్తున్న పింఛనును రూ.1,500 చేసింది. అదే ప్రభుత్వం 2019లో 79%లోపు వైకల్యం ఉన్న వారికి    రూ.2 వేలు, అంతకంటే ఎక్కువ ఉన్న వారికి రూ.3 వేలను పింఛనుగా అందించింది. అంటే దివ్యాంగుల పింఛనును ఐదేళ్లలో రూ.500 నుంచి రూ.2 వేలు, రూ.3 వేలకు పెంచింది. ఈ లెక్కన కొందరికి 4 రెట్లు, మరికొందరికి 6 రెట్ల మేరకు పింఛను మొత్తం పెరిగింది. ఐదేళ్ల  స్వల్ప వ్యవధిలో ఇంత భారీగా పెంచడం చరిత్రలోనే ప్రథమం.


పెళ్లికానుకకు నిబంధనలు సరికాదు
- చిన సుబ్బయ్యయాదవ్‌, అధ్యక్షుడు,  రాష్ట్ర దివ్యాంగుల సంక్షేమ సంఘం

సాధారణంగా దివ్యాంగులను వివాహం చేసుకోవడానికి ఎక్కువ మంది ముందుకు రారు. ఇలాంటి పరిస్థితుల్లో వైకాపా సర్కారు.. వధూవరులిద్దరూ పదో తరగతి ఉత్తీర్ణులైతేనే ‘పెళ్లికానుక’ ఆర్థికసాయం అందిస్తామని నిబంధన పెట్టడం సరికాదు. ఈ షరతు కారణంగా చాలా మంది దివ్యాంగులు అర్హత కోల్పోయారు. ప్రభుత్వం అందజేసిన మూడు చక్రాల వాహనాలు కూడా నాణ్యంగా లేవు. గత ప్రభుత్వం వాహనాలతోపాటు ఆరు నెలలకొకసారి పెట్రోలు బిల్లు ఇచ్చేది. దీన్ని కూడా వైకాపా ప్రభుత్వం రద్దు చేసింది.


90 వేల మంది పింఛన్లు తొలగించారు
- సునీల్‌, దివ్యాంగుల సంక్షేమ  సంఘం నేత

రకరకాల నిబంధనలు పెట్టి వైకాపా సర్కారు గత ఐదేళ్లలో 90 వేల మంది దివ్యాంగుల పింఛన్లను తొలగించింది. విద్యుత్తు వినియోగం 300 యూనిట్లు దాటిందన్న నెపంతో పింఛన్లను తొలగించడం అన్యాయం. గతంలో దివ్యాంగులకు వారి వైకల్యానికి అనుగుణంగా పరికరాలు అందించేవారు. వైకాపా ప్రభుత్వం ఎవరికి ఇచ్చిందో తెలియని పరిస్థితి. అంకెలు మాత్రం చూపిస్తోంది. మూడు చక్రాల వాహనాల పరిస్థితి కూడా అంతే. ఒక్కో నియోజకవర్గంలో వంద మందికి పైగా దరఖాస్తు చేసుకుంటే 10 మందికి మాత్రమే అందజేశారు. అది కూడా వైకాపా నాయకులు సూచించినవారికే ఇచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని