అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిలు రద్దుకు నిరాకరణ

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి బెయిలును రద్దు చేయడానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించింది.

Updated : 04 May 2024 07:00 IST

దస్తగిరి పిటిషన్‌ను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు
భాస్కరరెడ్డికి షరతులతో బెయిలు
అనుమతి లేకుండా ఏపీలో ప్రవేశించరాదని ఆదేశం 

ఈనాడు, హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి బెయిలును రద్దు చేయడానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. అవినాష్‌రెడ్డి బెయిలును రద్దుచేయాలని కోరుతూ ఇదే కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేస్తూ శుక్రవారం తీర్పు వెలువరించింది. బెయిలు షరతులను అవినాష్‌రెడ్డి ఉల్లంఘించినందున ముందస్తు బెయిలును రద్దుచేయాలని కోరుతూ దస్తగిరి పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ విచారణ చేపట్టారు. అవినాష్‌రెడ్డి సాక్షులను బెదిరించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని, దస్తగిరిపై దాడి కేసులోనూ అవినాష్‌రెడ్డి నిందితుడిగా లేరని, బెయిలు రద్దుకు కారణాలు లేవని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు.

అవినాష్‌రెడ్డి తరఫున శివశంకర్‌రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి జైలుకు వచ్చి రూ.20 కోట్లు ఇస్తామని ఆఫర్‌ ఇచ్చారని.. గంగాధర్‌రెడ్డి, సీఐ శంకరయ్య, ఎం.వి.కృష్ణారెడ్డి తదితరులు తొలుత సీబీఐ వద్ద వాంగ్మూలం ఇచ్చాక తర్వాత మాట మార్చారన్న పిటిషనర్ల వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. వివేకానందరెడ్డి హత్యకేసులో ఏడో నిందితుడైన వైఎస్‌ భాస్కరరెడ్డికి బెయిలు మంజూరు చేస్తూ తెలంగాణ హైకోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఆరోగ్య కారణాల దృష్ట్యా షరతుల మీద బెయిలు మంజూరుచేసింది. రూ. 2 లక్షల వ్యక్తిగత బాండ్‌తో పాటు అంతే మొత్తానికి మరో రెండు పూచీకత్తులను సీబీఐ కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. హైదరాబాద్‌లోని సీసీఎస్‌లో ప్రతి మంగళవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5లోగా రిపోర్టు చేయాలని షరతు విధించింది. వివేకా హత్యకేసు విచారణలో ప్రత్యక్షంగా, పరోక్షంగా జోక్యం చేసుకోరాదంది. సాక్షులు నివాసం ఉంటున్న ఆంధ్రప్రదేశ్‌లోకి సీబీఐ కోర్టు అనుమతి లేకుండా ప్రవేశించరాదని తెలిపింది. పాస్‌పోర్టును కోర్టుకు స్వాధీనం చేయాలని ఆదేశించింది.

ఉదయ్‌కుమార్‌రెడ్డి, సునీల్‌కు బెయిలు నిరాకరణ

వివేకా హత్య కేసు నిందితులు యాదాటి సునీల్‌యాదవ్‌, గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డిలకు బెయిలు ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. నిందితులకు ఈ దశలో బెయిలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. సునీల్‌యాదవ్‌ వివేకా హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్నారని.. కుట్ర, అమలు, సాక్ష్యాల చెరిపివేతలో కీలకపాత్ర పోషించారన్న సీబీఐ వాదనతో న్యాయమూర్తి ఏకీభవించారు. నిందితులకు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. కోర్టులో విచారణ కొనసాగుతున్న ఈ దశలో బెయిలు ఇవ్వలేమంటూ పిటిషన్లను కొట్టేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని