ఆప్‌ నేతలకు రూ.100 కోట్ల చెల్లింపులో కవిత పాత్ర

దిల్లీ మద్యం విధానంలో పొందిన ప్రయోజనాలకు ప్రతిఫలంగా భారాస ఎమ్మెల్సీ కవిత ఆప్‌ నేతలకు రూ.100 కోట్లు చెల్లించడంలో భాగస్వామి అయ్యారని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తెలిపింది.

Updated : 19 Mar 2024 07:13 IST

తర్వాత వాటిని రాబట్టుకోవడానికి అక్రమార్జన: ఈడీ వెల్లడి

ఈనాడు, దిల్లీ: దిల్లీ మద్యం విధానంలో పొందిన ప్రయోజనాలకు ప్రతిఫలంగా భారాస ఎమ్మెల్సీ కవిత ఆప్‌ నేతలకు రూ.100 కోట్లు చెల్లించడంలో భాగస్వామి అయ్యారని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తెలిపింది. హైదరాబాద్‌లో ఈ నెల 15న ఆమెను అరెస్ట్‌ చేసిన ఈడీ సోమవారం అందుకు సంబంధించిన వివరాలతో పత్రికా ప్రకటన విడుదల చేసింది. ‘‘దిల్లీ మద్యం విధాన కుంభకోణంలో తెలంగాణ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్‌ చేసింది. దిల్లీలోని పీఎంఎల్‌ఏ ప్రత్యేక కోర్టు ఆమెను ఈనెల 23వరకు ఈడీ కస్టోడియల్‌ విచారణకు పంపింది. ఈ ఉత్తర్వులు 16న వెలువడ్డాయి. హైదరాబాద్‌లోని కవిత ఇంట్లో ఈ నెల 15న సోదాలు జరిగాయి. ఆ సమయంలో కవిత బంధువులు, సహచరులు ఈడీ అధికారులను అడ్డుకున్నారు. దిల్లీ మద్యం విధాన రూపకల్పన, అమలు ద్వారా ప్రయోజనాలు పొందడానికి కవిత, మరికొందరితో కలిసి అరవింద్‌ కేజ్రీవాల్‌, మనీశ్‌ సిసోదియా లాంటి ఆప్‌ అగ్రనేతలతో కుట్ర పన్నారు. ప్రయోజనాలకు ప్రతిఫలంగా ఆమె ఆప్‌ నేతలకు రూ.100 కోట్లు చెల్లించడంలో భాగస్వామి అయ్యారు.

2021-22 దిల్లీ మద్యం విధాన రూపకల్పన, అమలులో అవినీతి, కుట్రలకు పాల్పడి టోకు వర్తకుల నుంచి ఆప్‌ నేతలకు నిరంతరం ముడుపులు వచ్చేలా చూశారు. ఆ తర్వాత ఆప్‌ నేతలకు ముందస్తుగా చెల్లించిన ముడుపులను రాబట్టుకోవడానికి కవిత, ఆమె అనుచరులు ఈ మొత్తం వ్యవహారం ద్వారా లాభాలు, నేరపూరిత ఆర్జన దక్కేలా కుట్ర పన్నారు. ఇప్పటివరకూ.. ఈ కేసులో ఈడీ దిల్లీ, హైదరాబాద్‌, చెన్నై, ముంబయి, ఇతర ప్రాంతాల్లో 245 చోట్ల సోదాలు నిర్వహించింది. ఆప్‌నకు చెందిన మనీశ్‌ సిసోదియా, సంజయ్‌సింగ్‌, విజయ్‌నాయర్‌లతోపాటు 15 మందిని అరెస్ట్‌ చేసింది. ఒక ఛార్జిషీట్‌, 5 అనుబంధ ఛార్జిషీట్లను దాఖలు చేసింది. ఇందులో పొందిన అక్రమార్జన ద్వారా కొనుగోలు చేసిన రూ.128.79 కోట్ల ఆస్తులను గుర్తించి తాత్కాలికంగా అటాచ్‌ చేశాం. ఇందుకు సంబంధించి గత ఏడాది జనవరి 24, జులై 3 తేదీల్లో జారీచేసిన ఉత్తర్వులను అడ్జుడికేటింగ్‌ అథారిటీ ఖరారు చేసింది. ఈ కేసులో దర్యాప్తు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది’’ అని ఈడీ ప్రకటనలో పేర్కొంది.

రెండో రోజూ కలిసిన కేటీఆర్‌, హరీశ్‌

దిల్లీ మద్యం కేసులో అరెస్టయి ఈడీ కస్టడీలో ఉన్న కవితను వరుసగా రెండో రోజు ఆమె సోదరుడు కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు, న్యాయవాది మోహిత్‌ రావులు కలిసి మాట్లాడారు. విచారణ జరిగిన తీరు, ఆమె యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు సోమవారం వారు దాదాపు గంట సేపు ఆమెతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టులో మంగళవారం కేసు విచారణ అంశాలను కవితకు వివరించినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని