Palnadu: పల్నాడు ఎస్పీ రవిశంకర్‌రెడ్డిపై వేటు?

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా హాజరైన ‘ప్రజాగళం’ సభలో భద్రతా వైఫల్యం అంశంలో పల్నాడు ఎస్పీ వై.రవిశంకర్‌రెడ్డిపై వేటు వేయనున్నట్లు తెలిసింది.

Updated : 19 Mar 2024 09:36 IST

ప్రధాని పాల్గొన్న ప్రజాగళం సభలో భద్రతా వైఫల్యంపై కేంద్ర నిఘా విభాగం నివేదిక!

ఈనాడు, అమరావతి: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా హాజరైన ‘ప్రజాగళం’ సభలో భద్రతా వైఫల్యం అంశంలో పల్నాడు ఎస్పీ వై.రవిశంకర్‌రెడ్డిపై వేటు వేయనున్నట్లు తెలిసింది. ప్రధాని పాల్గొనే సభ అని తెలిసినా పోలీసు అధికారులు భద్రతాపరంగా సరైన చర్యలు తీసుకోలేదు. బందోబస్తు విధుల్లో ఉన్న కొద్ది మంది పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు. ఫలితంగా కొందరు ఆకతాయిలు ప్రధాన వేదికకు సమీపంలో ఉన్న గ్యాలరీలోకి నీళ్ల సీసాలు విసిరారు. వేదికముందే తోపులాట చోటుచేసుకుంది. వీవీఐపీ గ్యాలరీల్లోకి జనాలు చొచ్చుకొచ్చేశారు. సభా ప్రాంగణంలో మైకు, లైట్ల కోసం ఏర్పాటుచేసిన టవర్లపైకి కొంతమంది ఎక్కటంతో వారిని కిందికి దించాలని ప్రధాని స్వయంగా వేదికపై నుంచి పోలీసులను కోరా¦ల్సి వచ్చింది. ప్రజలు వచ్చి మైక్‌సిస్టమ్‌పై పడిపోవటంతో ప్రధాని ప్రసంగిస్తున్నప్పుడు పలుమార్లు మైక్‌ పనిచేయక అంతరాయమేర్పడింది. మోదీ రాక కంటే ముందే సభాప్రాంగణానికి చేరుకున్న ఎన్‌ఎస్‌జీ, ఎస్పీజీ బృందాలు సభాప్రాంగణంలో బందోబస్తుపరంగా లోపాలున్నాయని గుర్తించి రాష్ట్ర పోలీసులను అప్రమత్తం చేసినా వారు సరిగ్గా స్పందించలేదు. ప్రధాన వేదిక పైకి మోదీ చేరుకున్నాక కూడా ముందు భాగంలో తగిన భద్రతా చర్యలు చేపట్టలేదు. ప్రధానికి హెలీప్యాడ్‌ వద్ద స్వాగతం చెప్పే ప్రముఖులకూ ఆదివారం ఉదయం 11.30 వరకూ పాస్‌లు ఇవ్వలేదు. ఈ వైఫల్యాలన్నింటిపైనా కేంద్ర నిఘా విభాగం అధికారులు దిల్లీకి సమగ్ర నివేదిక పంపించారు. ఈ తప్పిదాలకు ఎవరెవరు బాధ్యులు? వారి ప్రమేయమేంటి? ఎలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు? అనే అంశాలను నివేదికలో పొందుపరిచారు. వీటన్నింటికీ పల్నాడు ఎస్పీ రవిశంకర్‌రెడ్డి బాధ్యుడిగా గుర్తించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయనపై వేటు వేస్తూ 1, 2 రోజుల్లో ఆదేశాలు వెలువడే అవకాశముంది.

ఆ నలుగురు ఎస్పీలపైనా విచారణకు అవకాశం

ప్రజాగళం సభకు సంబంధించి ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ విధులకు ఇన్‌ఛార్జిగా ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి, సభాప్రాంగణంలో గ్యాలరీలకు బాధ్యుడిగా నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్‌రెడ్డి, హెలీప్యాడ్‌ వద్ద ఇన్‌ఛార్జిగా శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ ఎస్‌.వి.మాధవరెడ్డి.. మొత్తం వ్యవహారాలన్నింటికీ ఇన్‌ఛార్జిగా పల్నాడు ఎస్పీ రవిశంకర్‌రెడ్డి వ్యవహరించారు. వీరు తమ విధులు సరిగ్గా నిర్వహించకపోవటం, సహాయ నిరాకరణ చేయటం వల్లే ఇబ్బందులు తలెత్తాయంటూ ఎన్డీయే కూటమి పక్షాలైన భాజపా, తెదేపా, జనసేన నేతలు కేంద్ర ప్రభుత్వానికి, భాజపా అగ్రనాయకత్వానికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వారి వ్యవహారశైలిపైన అంతర్గతంగా విచారించే అవకాశముంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని