Vijaysai Reddy: సీబీఐ కేసున్నా.. విజయసాయిని విచారించొచ్చు

జగన్‌ అక్రమాస్తుల కేసులో రెండో నిందితుడైన ఎంపీ వి.విజయసాయిరెడ్డిపై ఉన్న సీబీఐ కేసుతో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ) విచారణకు సంబంధంలేదని ఆ సంస్థ మంగళవారం తెలంగాణ హైకోర్టుకు నివేదించింది.

Updated : 20 Mar 2024 06:51 IST

ప్రత్యామ్నాయాలు ఉండగా  నేరుగా పిటిషన్‌ చెల్లదు
తెలంగాణ హైకోర్టుకు ఛార్టర్డ్‌ అకౌంటెంట్ల సంఘం నివేదన

ఈనాడు, హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో రెండో నిందితుడైన ఎంపీ వి.విజయసాయిరెడ్డిపై ఉన్న సీబీఐ కేసుతో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ) విచారణకు సంబంధంలేదని ఆ సంస్థ మంగళవారం తెలంగాణ హైకోర్టుకు నివేదించింది. ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌ (సీఏ)గా విజయసాయిరెడ్డి ప్రవర్తన, చర్యలకు సంబంధించిన శాఖాపరమైన విచారణ మాత్రమేనని, సీబీఐ కేసు పెండింగ్‌లో ఉన్నంత మాత్రాన దాని ప్రభావం ఈ విచారణపై ఉండదని పేర్కొంది. అందు(వల్ల సీబీఐ కేసు తేలేదాకా ఐసీఏఐ విచారణను కొనసాగించరాదన్న వాదన సరికాదని పేర్కొంది. వై.ఎస్‌.జగన్‌ కంపెనీల్లోకి పెట్టుబడులు రాబట్టడానికి సాయిరెడ్డి కీలక పాత్ర పోషించారని, జగన్‌ కంపెనీలకు దురుద్దేశపూరితంగా సహకరించారని, ఇది సీఏగా ప్రవర్తనా నియమావళికి విరుద్ధమేనని, దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఐసీఏఐ సాయిరెడ్డికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. వృత్తిపరమైన ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనపై విచారణకు హాజరుకావాలంటూ గత ఏడాది అక్టోబరు 23న జారీ చేసిన నోటీసును సవాలు చేస్తూ విజయసాయిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ సూరేపల్లి నంద మంగళవారం విచారణ చేపట్టారు. ఐసీఏఐ తరఫు సీనియర్‌ న్యాయవాది ఎం.ఎస్‌.ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ జగతి పబ్లికేషన్స్‌ ప్రమోటర్‌ డైరెక్టర్‌గా, షేర్‌ హోల్డర్‌గా చేపట్టిన చర్యలతో ఐసీఏఐకి సంబంధం లేదన్న వాదన సరికాదన్నారు. ఐసీఏఐ సంస్థకు మచ్చ తెచ్చే ఏ వ్యవహారంపై అయినా చర్యలు తీసుకునే అధికారం ఐసీఏఐకి ఉందని, దీనికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన విషయాన్ని ప్రస్తావించారు.

చెన్నై కేంద్రంగానే కార్యకలాపాలు

ఐసీఏఐ రిజిస్టర్డ్‌ కార్యాలయం చెన్నైలో ఉందని అందువల్ల ఏదైనా అభ్యంతరాలుంటే చెన్నై హైకోర్టులో తేల్చుకోవాల్సి ఉందంటూ సీనియర్‌ న్యాయవాది పేర్కొన్నారు. చెన్నై సంస్థ విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేసిందని, సాయిరెడ్డి కూడా చెన్నై కేంద్రంగానే సమాధానం ఇచ్చారన్నారు. ఐసీఏఐ ప్రధాన కార్యాలయం దిల్లీలో ఉందని, అందువల్ల దిల్లీ లేదంటే చెన్నై హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసుకోవాలని, అధికరణ 226 కింద ఈ హైకోర్టులో పిటిషన్‌ వేయడానికి వీల్లేదన్నారు. ఈ కోర్టుకు పరిధి లేనందున ప్రాథమిక దశలోనే పిటిషన్‌ను కొట్టివేయాల్సి ఉందన్నారు. విజయసాయిరెడ్డిపై విచారణ ప్రాథమిక దశలోనే ఉందని, ఆయన వివరణ ఇచ్చాక తదుపరి చర్యలుంటాయని తెలిపారు. వివరణతో సంతృప్తి చెందకపోతే వృత్తిపరంగా ఏదైనా దుష్ప్రవర్తనకు సాయిరెడ్డి పాల్పడి ఉన్నట్లైతే తదుపరి విచారణ ఉంటుందన్నారు. ఒకవేళ ఆరోపణలు రుజువైన పక్షంలో చర్యలు తీసుకునేముందు కూడా ఐసీఏఐ షోకాజ్‌ నోటీసు జారీ చేస్తుందన్నారు. ఈ అన్ని దశల్లోనూ అక్కడే అప్పీలు దాఖలు చేసుకునేందుకు అవకాశం ఉందన్నారు. ప్రత్యామ్నాయంగా అప్పీలెట్‌ అథారిటీ ఉండగా నేరుగా హైకోర్టును ఆశ్రయించరాదంటూ కోల్‌కతా, మద్రాస్‌ హైకోర్టులతోపాటు సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చాయన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు