ధ్రువపత్రాల్లో తప్పుల సవరణ సులభతరం చేయండి

విద్యార్థుల పేర్లు, వారి తల్లిదండ్రుల పేర్లు, ఇంటి పేర్లు లేదా కులం, జన్మ తేదీ తదితరాల విషయంలో ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌ ధ్రువపత్రాల్లో దొర్లిన తప్పులను సవరించుకునే ప్రక్రియను సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా సులభతరం చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Published : 23 Apr 2024 04:44 IST

రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసిన హైకోర్టు

ఈనాడు, అమరావతి: విద్యార్థుల పేర్లు, వారి తల్లిదండ్రుల పేర్లు, ఇంటి పేర్లు లేదా కులం, జన్మ తేదీ తదితరాల విషయంలో ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌ ధ్రువపత్రాల్లో దొర్లిన తప్పులను సవరించుకునే ప్రక్రియను సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా సులభతరం చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రికార్డులు అందుబాటులో లేవనో లేదా తప్పులను సరిదిద్దుకునేందుకు కాలపరిమితి మించిపోయిందనో ఇలాంటి అభ్యర్థనలను తిరస్కరించడానికి వీల్లేదంది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్‌ ఇటీవల ఈ మేరకు కీలక తీర్పు ఇచ్చారు. కృష్ణా జిల్లాకు చెందిన కుందేటి వెంకట శ్రీనివాసరావు, కుందేటి ఉషశ్రీ దంపతుల కుమారుడు వెంకట నరసయ్యను గుడివాడలోని పాఠశాలలో చేర్పించే సమయంలో రికార్డుల్లో వివరాలు తప్పుగా నమోదయ్యాయి. దీంతో విద్యార్థి వెంకట నరసయ్య.. వాటిని సవరించాలని అధికారులను ఆశ్రయించాడు. గుడివాడ డిప్యూటీ విద్యాశాఖ అధికారి సానుకూలంగా స్పందించి తప్పుల సవరణకు ఉన్నతాధికారులకు సిఫారసు చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) మాత్రం 2016లో ఆ సిఫారసును తిరస్కరించారు. వివరాల నమోదులో తప్పులకు కుటుంబ సభ్యులే బాధ్యులని, పాఠశాల అధికారుల వల్ల జరిగింది కాదని పేర్కొన్నారు. రికార్డుల్లో నమోదైన నాటి నుంచి మూడేళ్ల లోపు మాత్రమే తప్పులను సవరించుకోవాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయన్నారు. పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సైతం డీఈవో ఉత్తర్వులను సమర్థించారు. దీంతో ఆ విద్యార్థి 2022లో హైకోర్టును ఆశ్రయించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని