ఏపీ నూతన డీజీపీగా హరీష్‌కుమార్‌ గుప్తా

రాష్ట్ర నూతన డీజీపీగా హరీష్‌కుమార్‌ గుప్తా సోమవారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. 1992 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారైన ఆయన ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు.

Updated : 07 May 2024 07:09 IST

ఈనాడు, అమరావతి: రాష్ట్ర నూతన డీజీపీగా హరీష్‌కుమార్‌ గుప్తా సోమవారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. 1992 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారైన ఆయన ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. వైకాపాతో అంటకాగుతున్నారన్న ఫిర్యాదులపై కేవీ రాజేంద్రనాథరెడ్డిపై బదిలీ వేటు వేసిన ఎన్నికల సంఘం ఆయన స్థానంలో హరీష్‌కుమార్‌ గుప్తాను నియమించింది. జమ్మూకశ్మీర్‌కు చెందిన హరీష్‌కుమార్‌ గుప్తా.. ఖమ్మం ఏఎస్పీగా తన తొలి పోస్టింగు పొందారు. మెదక్‌, పెద్దపల్లిలలో ఏఎస్పీగా సేవలందించారు. కృష్ణా, నల్గొండ జిల్లాల ఎస్పీగా, హైదరాబాద్‌ సౌత్‌జోన్‌ డీసీపీగా కీలక బాధ్యతలు నిర్వహించారు. గుంటూరు రేంజి ఐజీగా, శాంతిభద్రతల విభాగం, ప్రొవిజన్స్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ విభాగం అదనపు డీజీపీగా పనిచేశారు. పోలీసు నియామక మండలి ఛైర్మన్‌గా, రైల్వే డీజీగా విధులు నిర్వహించారు. 2022 మే నుంచి హోంశాఖ ముఖ్య కార్యదర్శి పోస్టులో కొనసాగుతున్నారు. ఆర్టీసీ ఎండీ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు, సీనియర్‌ ఐపీఎస్‌ మాదిరెడ్డి ప్రతాప్‌, హరీష్‌కుమార్‌ గుప్తా పేర్లను ప్యానల్‌ జాబితాలో పంపించగా.. హరీష్‌ గుప్తాను ఎన్నికల సంఘం ఎంపిక చేసింది.

నూతన డీఎస్పీలను నియమించిన ఈసీ: అనంతపురం అర్బన్‌కి టీవీవీ ప్రతాప్‌కుమార్‌, రాయచోటికి రామచంద్రరావును నూతన డీఎస్పీలుగా నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిద్దరూ అదే రోజు రాత్రి 8 గంటలకు బాధ్యతలు స్వీకరించారు. ఆయా స్థానాల్లో పనిచేస్తున్న వీరరాఘవరెడ్డి, మహబూబ్‌ బాషాలు అధికార వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షాలు చేసిన ఫిర్యాదుల మేరకు వారిపై ఈసీ బదిలీ వేటు వేసిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని