గోడు విన్నా.. ‘గోల్డ్‌’ ఇవ్వలే!

ఓ సంస్థ చేసిన మోసంతో వారు అప్పటికే పీకలతు మునగగా ఆ బాధితులను జగన్‌ నిండాముంచారు. అగ్రిగోల్డ్‌ ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని, వాటికి వేలం వేసి బాధితులకు న్యాయం చేస్తామని  పూటకో మాట మార్చారు. తలమీద చెయ్యివేసి గోడు వింటుంటే.. ఇక తమ కష్టాలు గట్టెక్కినట్లేనని బాధితులు ఎంతో ఆశపడ్డారు.

Updated : 07 May 2024 06:54 IST

నేనున్నానంటూ అగ్రిగోల్డ్‌ బాధితులకు జగన్‌ నయవంచన
బాధితులకు రూ.కోట్లు చెల్లించకుండా కపటనాటకం
మృతిచెందిన కుటుంబాలను ఆదుకునేందుకు మనసు రాలేదు
ఆస్తులకు వేలం వేస్తానని మాట దాటవేత
ఈనాడు, అమరావతి

ఓ సంస్థ చేసిన మోసంతో వారు అప్పటికే పీకలతు మునగగా ఆ బాధితులను జగన్‌ నిండాముంచారు. అగ్రిగోల్డ్‌ ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని, వాటికి వేలం వేసి బాధితులకు న్యాయం చేస్తామని  పూటకో మాట మార్చారు. తలమీద చెయ్యివేసి గోడు వింటుంటే.. ఇక తమ కష్టాలు గట్టెక్కినట్లేనని బాధితులు ఎంతో ఆశపడ్డారు. కానీ, జగన్‌ చెప్పింది చేయరు.. ఆ ‘గోల్డ్‌’ రాదు అని అర్థమవడానికి వారికి ఐదేళ్లు పట్టింది!

నేనున్నాను... నే విన్నాను.. మీ కష్టాల్ని కళ్లారా చూశాను’’ అంటూ ప్రతిపక్ష నేత హోదాలో జగన్‌ కల్లబొల్లి కబుర్లు చెబితే అవన్నీ నిజమేనని నమ్మారు జనం. అధికారం చేపట్టిన తర్వాత తమను  ఆదుకుంటారని భరోసా పెట్టుకున్నారు. వారి ఓట్లు పొందిన జగన్‌.. ముఖ్యమంత్రి పీఠమెక్కిన తర్వాత మాట తప్పారు. ఐదేళ్ల పదవీకాలం పూర్తయిపోయింది. అయినా అగ్రిగోల్డ్‌ బాధితులను నయవంచనకు గురిచేశారు. లక్షల మంది చిరువ్యాపారులు, బడుగు జీవులు, మధ్యతరగతి కుటుంబాలను మోసగించారు. అయినా.. 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను, ప్రకటించిన మ్యానిఫెస్టోను 99 శాతం అమలుచేశానంటూ గొప్పలు చెప్పుకొంటున్నారు జగన్‌. ‘అబద్ధాలను కూడా ఇంత గొప్పగా చెప్పొచ్చా..!’ అని ముక్కున వేలేసుకుంటున్నారు సాధారణ జనం.

పరిష్కారానికి ఐదేళ్లు సరిపోలేదా?


హామీ-1:  అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్క అగ్రిగోల్డ్‌ బాధితుడికి న్యాయం చేస్తాం. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఉన్న 13లక్షల మంది బాధితులకు రూ.1,150 కోట్లు కేటాయించి మేలు చేకూరుస్తాం. మిగిలిన వారికి త్వరితగతిన పరిష్కార మార్గం చూపిస్తాం.

2018 జనవరి 6న పుంగనూరు నియోజకవర్గంలో ప్రకటన, 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ

నయవంచన-1 : సీఎం జగన్‌ ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు చెప్పిన లెక్క ప్రకారం చూసినా ఇప్పటివరకు ఇంకా దాదాపు  9.50 లక్షల మందికి రూ.3 వేల కోట్లకు పైగా ఇవ్వాల్సి ఉంది. ఆ సొమ్ము చెల్లించటానికి జగన్‌కు ఐదేళ్ల సమయం సరిపోలేదా? త్వరితగతిన పరిష్కారం అంటే ఇదేనా? ప్రతి బాధితుడికి అండగా ఉంటానని, న్యాయం చేస్తానని ఇచ్చిన హామీని ఎందుకు పట్టించుకోలేదు? డబ్బుల కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్న బాధితులకు ఎందుకు సాంత్వన చేకూర్చలేదు?


వేలం వేయలేదు.. డబ్బు అందించలేదు..

హామీ-2 :  అగ్రిగోల్డ్‌ ఆస్తులను ప్రభుత్వమే స్వాధీనం చేసుకుంటుంది. వాటిని ముక్కలుముక్కలుగా చేసి పారదర్శకంగా వేలం వేస్తాం. ప్రతి పైసాను బాధితులకు అందేలా చేస్తాం.

2018 అక్టోబరు 8న విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గుర్లలో జగన్‌ హామీ

నయవంచన-2 :  అగ్రిగోల్డ్‌కు సంబంధించిన 90 శాతానికి పైగా స్థిర, చరాస్తులను తెదేపా ప్రభుత్వ హయాంలోనే జప్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లోని 21,642.78 ఎకరాల భూములు, 1,07,981.56 చ.గ. స్థలాలు అప్పట్లోనే జప్తు అయ్యాయి. రిజిస్ట్రేషన్‌ విలువ ప్రకారం ఆ ఆస్తుల విలువ రూ.3,869.72 కోట్లు కాగా.. వాటి మార్కెట్‌ ధర అంతకు అనేక రెట్లు అధికంగా ఉంటుంది. గత ఐదేళ్లుగా ఇవన్నీ వైకాపా ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నాయి. అయినా ఆ ఆస్తులను మాత్రం వేలం వేయలేదు. ప్రతీ పైసా బాధితులకు అందేలా చేయలేదు. ప్రత్యేకంగా నిధులు కేటాయించి కూడా బాధితులకు ఊరటనివ్వలేదు. ప్రతిపక్ష నేత హోదాలో అగ్రిగోల్డ్‌ బాధితులపై కురిపించిన ప్రేమ, సానుభూతి అంతా వట్టిదేనని జగన్‌ అధికారం  చేపట్టాక తేలిపోయింది.


ప్రాణాలు కోల్పోయినా..

హామీ-3: అగ్రిగోల్డ్‌ మోసంతో ప్రాణాలు కోల్పోయిన ఒక్కో  బాధితుడికి రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇస్తాం.

2017 మార్చి 24న విజయవాడలోని  అగ్రిగోల్డ్‌ బాధితుల దీక్ష శిబిరంలో..

నయవంచన-3 :  రెక్కలుముక్కలు చేసుకుని సంపాదించిన వారెందరో.. భవిష్యత్తు ప్రయోజనాలకోసం ఎంతోకొంత మొత్తాన్ని అగ్రిగోల్డ్‌ సంస్థలో పొదుపు చేసుకున్నారు. తీరా ఆ సంస్థ చేతులెత్తేయడంతో పొదుపు చేసుకున్న వారంతా బావురుమన్నారు. ఆ మనోవేదనతో కొందరు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పటివరకు 600 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారని అగ్రిగోల్డ్‌  వినియోగదారుల సంక్షేమ సంఘం గుర్తించింది. అయితే, మృతుల కుటుంబీకులకు వైకాపా సర్కారు ఇప్పటివరకు ఒక్కపైసా కూడా ఇవ్వలేదు. జగన్‌ అధికారంలోకి వచ్చాక ఆ హామీని పూర్తిగా విస్మరించింది.


సొమ్ము చెల్లిస్తామని.. మొండిచేయి..

హామీ-4:  రాష్ట్రానికి చెందిన ప్రతి అగ్రిగోల్డ్‌ బాధితుడికీ సొమ్ము చెల్లిస్తాం. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. న్యాయస్థానం   అనుమతించిన జాబితాలోని అందరికీ డబ్బులు అందజేస్తాం.

సీఎం హోదాలో 2019 నవంబరు 7న అగ్రిగోల్డ్‌ బాధితులతో జగన్‌

నయవంచన-4 :  వైకాపా అధికారంలోకి వచ్చాక రెండు విడతల్లో 10.40 లక్షల మంది అగ్రిగోల్డ్‌ బాధితులకు రూ.905.57 కోట్లు చెల్లించింది. రూ.20 వేలు, అంతకంటే తక్కువ మొత్తంలో డిపాజిట్‌ చేసిన వారిలో కొందరికి మాత్రమే ఈ మొత్తం పంపిణీ చేసింది. ఈ కేటగిరీలో మొత్తం 13.50 లక్షల మందికి పైగా బాధితులున్నారు. వీరందరికీ న్యాయం జరగాలంటే రూ.1,150 కోట్లు ఇవ్వాలి. కానీ రకరకాల కొర్రీలు పెట్టిన జగన్‌ ప్రభుత్వం బాధితులందరికీ ఆ సొమ్మును చెల్లించలేదు. ఈ కేటగిరీలోని 3.10 లక్షల మందికి ఇంకా రూ.244.43 కోట్లు ఇవ్వాలి. రూ.20 వేలు, అంతకంటే ఎక్కువ మొత్తాలు డిపాజిట్‌ చేసిన బాధితులు 6.50 లక్షల మంది ఉన్నారు. వీరికి రూ.2,800 కోట్లకు పైగా చెల్లించాలి. అగ్రిగోల్డ్‌ బాధితులకు చెల్లించాల్సిన మొత్తం సొమ్ము (రూ.3,957 కోట్లు)లో ఇప్పటివరకూ చెల్లించింది 22.87 శాతం మాత్రమే. సగం మందికి పైగా బాధితులకు ఒక్క పైసా కూడా అందించలేదు.


అప్పుడు అగ్రిగోల్డ్‌.. ఇప్పుడు వైకాపా సర్కారు..

- మేకల కృష్ణ, అగ్రిగోల్డ్‌ బాధితుడు, విశాఖపట్నం

టిఫిన్‌ దుకాణం నడుపుతూ   కుటుంబాన్ని పోషిస్తున్నా. దాని ద్వారా పైసాపైసా కూడబెట్టుకుని కొంతకాలం క్రితం అగ్రిగోల్డ్‌లో రూ.80 వేలు కట్టాను. ఆ సంస్థ బోర్డు తిప్పేయడంతో మోసపోయాం. కుటుంబం రోడ్డున పడినట్లయింది.బాధితులందరికీ డబ్బులు చెల్లిస్తామంటూ గత ఎన్నికల సమయంలో జగన్‌ చెప్పడంతో   ఆయనను నమ్మి ఓటు వేశాం. ఐదేళ్లు గడిచినా మేం కట్టిన సొమ్ములో ఒక్క రూపాయి కూడా తిరిగివ్వలేదు. అప్పుడు అగ్రిగోల్డ్‌ చేతిలో.. ఇప్పుడు వైకాపా ప్రభుత్వం చేతిలో  మోసపోయాం.


ఒక్క రూపాయి కూడా రాలేదు

- సాధు రామారావు, చింతాడ, ఆమదాలవలస

నా మనవరాలి పెళ్లికి ఉపయోగపడతాయన్న ఉద్దేశంతో  అగ్రిగోల్డ్‌లో రూ.80 వేలు కట్టాం. ఎక్కువ మొత్తంలోనే డబ్బు వస్తుందని ఎంతగానో ఆశపడ్డా. కానీ కొన్ని రోజులకే ఆ కంపెనీ మమ్మల్ని మోసగించింది. ఆ డబ్బులు ఇప్పించి న్యాయం చేస్తామని జగన్‌ చెబితే నమ్మాం. గత ఐదేళ్ల నుంచి తిరుగుతున్నా మాకు ఒక్క రూపాయి కూడా రాలేదు. ఇక ఇప్పుడు జగన్‌ను ఎలా నమ్మాలి? ఆయనకు ఎందుకు ఓటు వేయాలి?


రూ.3 వేల కోట్లకు పైగా చెల్లించాలి..

-ముప్పాళ్ల నాగేశ్వరరావు, అగ్రిగోల్డ్‌ కస్టమర్స్‌ అండ్‌ ఏజెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ గౌరవ అధ్యక్షుడు

అధికారం చేపట్టిన ఆరు నెలల్లోగా  అగ్రిగోల్డ్‌ బాధితులందరికీ సొమ్ములు  చెల్లిస్తానని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్‌ హామీ ఇచ్చారు. ఐదేళ్లు గడిచిపోయినా బాధితులందరిని ఆదుకోకుండా మోసం చేశారు. ఇంకా రాష్ట్రంలోని 9.50 లక్షల మంది బాధితులకు రూ.3 వేల కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంది. డబ్బులు అందక అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 600 మందికి పైగా అగ్రిగోల్డ్‌ బాధితులు మరణించారు. వారిలో ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని హామీ ఇచ్చిన జగన్‌ అది నెరవేర్చకుండా బాధితులను నయవంచనకు గురిచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని