ఆర్‌.నారాయణమూర్తికి జగన్‌ ఝలక్‌!

సామాజిక సమస్యల నేపథ్యంలో సినిమాలు తీసే ఆర్‌.నారాయణమూర్తి నిరాడంబరుడు, సౌమ్యుడు, మంచివాడని సినిమా పరిశ్రమలో పేరుంది. అలాంటి నారాయణమూర్తికే ముఖ్యమంత్రి జగన్‌ ఝలక్‌ ఇచ్చారు.

Published : 07 May 2024 03:19 IST

సాగునీటి ప్రాజెక్టుకు రూ.460 కోట్లు ఇచ్చినట్లు హడావుడి
మూడేళ్లయినా కాగితాలకే పరిమితం

ఈనాడు, అమరావతి: సామాజిక సమస్యల నేపథ్యంలో సినిమాలు తీసే ఆర్‌.నారాయణమూర్తి నిరాడంబరుడు, సౌమ్యుడు, మంచివాడని సినిమా పరిశ్రమలో పేరుంది. అలాంటి నారాయణమూర్తికే ముఖ్యమంత్రి జగన్‌ ఝలక్‌ ఇచ్చారు. తాను పుట్టిన ప్రాంతంపై ప్రేమతో సాగునీటి ప్రాజెక్టు కోసం జగన్‌ అధికారంలోకి వచ్చాక నారాయణమూర్తి ఆయన్ను కలిశారు. ఆ ప్రాజెక్టు సాధించడం తన చిరకాల స్వప్నమని వివరించారు. ఆ ప్రాజెక్టుని జగన్‌ మంజూరు చేశారు. అంతటి ముఖ్యమంత్రే మంజూరు చేశాక ఇంకేముంది.. త్వరలోనే ప్రాజెక్టు పూర్తయిపోతుందనుకున్నారు. ఆయనకు చేతులెత్తి మొక్కారు. జగన్‌ దేవుడని, ఆయనకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని కొనియాడారు. కానీ ఆ ప్రాజెక్టు ఇప్పటికీ కాగితాలపైనే ఉంది.

ప్రాజెక్టు సాకారమైతే వేల ఎకరాలకు సాగునీరు

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఏలేరు, ఉమ్మడి విశాఖ జిల్లాలోని తాండవ జలాశయాల కాలువల్ని అనుసంధానిస్తే కొత్తగా 5,600 ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుంది. 51,465 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. రెండు జిల్లాల్లోని మెట్టప్రాంతాలైన ఏలేశ్వరం, ప్రత్తిపాడు, శంఖవరం, రౌతులపూడి, కోటనందూరు, నాతవరం, కోటఉరట్ల, నర్సీపట్నం మండలాల్లోని వేల మంది రైతులకు మేలు జరుగుతుంది. తాండవ నదిపై 4.96 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో గతంలో జలాశయం నిర్మించారు. దాన్నుంచి తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లోని 51,465 ఎకరాల ఆయకట్టుకు నీరందించేలా డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. కాలక్రమంలో తాండవ నదిలోకి చాలినంత నీరు రాకపోవడం వల్ల సాగుకి ఏటా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీన్ని అధిగమించేందుకు ఏలేరు జలాశయం కాలువలను, తాండవ కాలువలను అనుసంధానించి నీటిని వినియోగించుకుంటే సమస్య పరిష్కారమవుతుందన్న ప్రతిపాదనను అధికారులు రూపొందించారు. ఏలేరు జలాశయం నీటి నిల్వ సామర్థ్యం   24.1 టీఎంసీలు. ఏలేరు జలాశయానికి కూడా నీటి లభ్యత తగ్గడంతో.. దానికి పరిష్కారంగా తెదేపా ప్రభుత్వం పురుషోత్తపట్నం ఎత్తిపోతల ప్రాజెక్టుని నిర్మించింది. పోలవరం ఎడమ కాలువలోకి నీటిని మళ్లించి, ఆ కాలువపై మరో ఎత్తిపోతల స్కీం ఏర్పాటు చేసి.. గోదావరి జలాల్ని ఏలేరు జలాశయంలోకి పంపే ఏర్పాటు చేసింది. దాంతో ఏలేరు జలాశయానికి నీటి సమస్య తీరింది. గోదావరి నుంచి ఏలేరు జలాశయంలోకి తగినంత నీరు ఎత్తిపోసుకునే వెలుసుబాటు ఉండటంతో.. ఏలేరు కాలువల్ని, తాండవ కాలువలతో అనుసంధానిస్తే.. అక్కడ కూడా నీటి సమస్య తీరుతుందని అధికారులు ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా కాలువల్ని ఆధునికీకరించడంతో పాటు, మరో ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేసి తాండవ ఆయకట్టు కాలువల్లోకి 250 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోయాలన్నది ఆలోచన.

మూడేళ్లయినా ముందుకి కదల్లేదు

2021లో ఆ ప్రాజెక్టుకి ప్రభుత్వం రూ.470 కోట్లు మంజూరు చేసింది. 2021 మార్చి 19న పాలనాపరమైన అనుమతులిచ్చింది. టెండర్లు పిలిచి.. గుత్తేదారుడినీ ఎంపిక చేశారు. ఆ తర్వాత దానికీ రాష్ట్రంలోని మిగతా సాగునీటి ప్రాజెక్టుల గతే పట్టింది. ప్రాజెక్టు మంజూరు చేసి మూడేళ్లవుతున్నా.. అంగుళం కూడా ముందుకి కదల్లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని