NV Ramana: రాజ్యాంగానికి విధేయులుగా ఉండండి... వ్యక్తులకు కాదు

‘‘ఎవరైనా రాజ్యాంగం, చట్టాలకు విధేయంగా ఉండాలి తప్పితే వ్యక్తులకు కాదు. మీరు నిజాయితీగా నిలబడితే, మీ ధైర్యసాహసాలు, సిద్ధాంతాలు శాశ్వతంగా గుర్తుండిపోతాయి.

Updated : 02 Apr 2022 05:03 IST

రాజకీయ నేతలు మారతారు.. కానీ మీరు శాశ్వతం
సీబీఐ అధికారులకు సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ సూచన
డీపీ కోహ్లీ స్మారకోపన్యాసంలో కీలక వ్యాఖ్యలు
దర్యాప్తు సంస్థలను ఒకే స్వతంత్రవ్యవస్థ కిందికి తీసుకురావాలన్న సీజేఐ

ఈనాడు, దిల్లీ: ‘‘ఎవరైనా రాజ్యాంగం, చట్టాలకు విధేయంగా ఉండాలి తప్పితే వ్యక్తులకు కాదు. మీరు నిజాయితీగా నిలబడితే, మీ ధైర్యసాహసాలు, సిద్ధాంతాలు శాశ్వతంగా గుర్తుండిపోతాయి. రాజకీయ కార్యనిర్వాహకులు కాలంతో మారిపోతుంటారు. కానీ వ్యవస్థగా మీరు శాశ్వతంగా ఉంటారు. అందువల్ల అభేద్యంగా, స్వతంత్రంగా ఉండండి’’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.వి.రమణ కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఉద్యోగులకు సూచించారు. శుక్రవారం ఇక్కడి విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన 19వ డీపీ కోహ్లి స్మారకోపన్యాసంలో ఆయన కీలకోపన్యాసం చేశారు. సంస్థాగతంగా రావాల్సిన మార్పులపై దిశానిర్దేశం చేశారు. సీబీఐ, సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేటివ్‌ ఆఫీస్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌లను ఒకే వ్యవస్థ కిందికి తీసుకొస్తూ కొత్త చట్టం తీసుకురావాలని పిలుపునిచ్చారు. న్యాయవ్యవస్థ తరహాలోనే ఇది స్వతంత్రంగా, స్వయంప్రతిపత్తితో పనిచేసేలా చూడాలన్నారు.

ప్రజాస్వామ్య విలువలను కాపాడండి

‘‘మనలాంటి సమ్మిళిత సమాజానికి ప్రజాస్వామ్యమే అత్యుత్తమైందని నిరూపితమైంది. భారతీయులుగా మనం స్వేచ్ఛను ప్రేమిస్తాం. దాన్ని లాగేసుకోవడానికి ఎవరైనా ప్రయత్నిస్తే  చైతన్యవంతమైన మన పౌరసమాజం నియంతలనుంచి అధికారాన్ని వెనక్కు లాక్కోవడానికి ఏమాత్రం వెనుకంజవేయదు. అందువల్ల పోలీసులు, దర్యాప్తు సంస్థలు ప్రజాస్వామ్య విలువలను కాపాడటం అత్యంత ముఖ్యం. నిరంకుశపోకడలు పెరిగిపోవడానికి  అనుమతివ్వకూడదు. తప్పనిసరిగా రాజ్యాంగంలో రూపొందించిన ప్రజాస్వామ్య సూత్రాలకు లోబడి పనిచేయాలి. పోలీసు, దర్యాప్తు సంస్థలకు చట్టబద్ధత ఉండొచ్చు. అయితే వ్యవస్థలుగా అవి సామాజిక చట్టబద్థతను పెంపొందించుకోవాల్సి ఉంది.

ఒకప్పుడు సీబీఐపై ఎంతో నమ్మకం

తొలినాళ్లలో సీబీఐ పట్ల ప్రజల్లో ఎంతో నమ్మకం ఉండేది. నిష్పాక్షికత, స్వతంత్రతకు అది చిహ్నం అన్న ఉద్దేశంతో కేసులను సీబీఐకి అప్పగించాలని కోరుతూ న్యాయవ్యవస్థ ముందుకు కేసుల ప్రవాహంలా వచ్చేవి. కాలం గడిచేకొద్దీ మిగిలిన సంస్థల్లానే సీబీఐ మారిపోయింది. దాని విశ్వసనీయత పట్ల ప్రశ్నలు తలెత్తుతున్నాయి.కష్టకాలంలో ప్రజలు పోలీసులను ఆశ్రయించడానికి సంకోచించడం బాధాకరం. అవినీతి, నిష్పాక్షికత లోపించడం, రాజకీయవర్గాలతో అత్యంత సన్నిహిత సంబంధాలు కొనసాగించడంలాంటి విమర్శల కారణంగా పోలీసు వ్యవస్థ ప్రతిష్ఠ దారుణంగా దెబ్బతింది.

రాజకీయ వ్యవస్థతో సాన్నిహిత్యం వీడండి

ప్రభుత్వాలు మారిన తర్వాత తమను వేధిస్తున్నారంటూ తరచూ అధికారులు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్న సందర్భాలున్నాయి. ఎప్పుడైతే మీరు అధికారంలో ఉన్న వారికి దగ్గరకావాలని ప్రయత్నిస్తారో అప్పుడు దానివల్ల వచ్చే పరిణామాలనూ ఎదుర్కోకతప్పదు. ఇప్పుడు అత్యవసరంగా కావాల్సిందల్లా ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించుకోవడమే. అది జరగాలంటే తొలుత రాజకీయ వ్యవస్థతో సాన్నిహిత్యాన్ని తెగదెంపులుచేసుకోవాలి. నిజాయితీపరులైన అధికారులు కొందరున్నా వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకురావొచ్చు. అందువల్ల ప్రవాహంలోపడి కొట్టుకుపోవడమా? లేదంటే పదుగురికి ఆదర్శంగా నిలవడమా అన్నది మీ చేతుల్లోనే ఉంటుంది. భారతీయ న్యాయవ్యవస్థపై వివిధ అంశాలు ప్రభావం చూపుతున్నప్పటికీ ప్రజలు ఇప్పటికీ దానిపై విశ్వాసం ఉంచుతున్నారు. అందుకు కారణం దానికి స్వయంప్రతిపత్తి, రాజ్యాంగం, చట్టాలపట్ల ఉన్న నిబద్ధతే. అందువల్ల ఒక స్వతంత్ర ఛత్రచాయ వ్యవస్థను ఏర్పాటుచేసి దాని పరిధిలోకి సీబీఐ, ఎస్‌ఎఫ్‌ఐఓ, ఈడీలాంటివన్నింటినీ తీసుకురావాలి. వాటి విధులు, అధికారాలు, పరిధిని స్పష్టంగా నిర్దేశిస్తూ చట్టం చేయాలి. ఇలాంటి స్వతంత్ర, నిష్పాక్షిక వ్యవస్థకు నేతృత్వం వహించే వారిని కూడా సీబీఐ డైరెక్టర్‌ తరహాలోనే  ప్రత్యేక కమిటీ ద్వారా నియమించాలి. ఇలాంటి ఒకే ఛత్రచాయ వ్యవస్థవల్ల బహుళ అధికార ప్రక్రియలకు ముగింపు పలకడానికి వీలవుతుంది’’ అని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని