ఓలా మొబిలిటీ సీఈఓ రాజీనామా

ఓలా మొబిలిటీ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) హేమంత్‌ బక్షి రాజీనామా చేశారని తెలుస్తోంది.

Published : 30 Apr 2024 02:04 IST

చేరిన 4 నెలలకే నిష్క్రమణ
10-15 శాతం సిబ్బందికి లేఆఫ్‌లు

దిల్లీ: ఓలా మొబిలిటీ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) హేమంత్‌ బక్షి రాజీనామా చేశారని తెలుస్తోంది. ఆయన ఈ ఏడాది జనవరిలోనే కంపెనీలో చేరడం గమనార్హం. బక్షి రాజీనామా తక్షణం అమల్లోకి వచ్చినట్లు సంస్థ వర్గాలు చెబుతున్నాయి. కంపెనీ 10-15 శాతం సిబ్బందిని తొలగించాలని భావిస్తోందని ఆ వర్గాలు తెలిపాయి. జనవరి నాటికి ఓలా క్యాబ్స్‌ విభాగంలో 900 మంది ఉన్నారని.. లేఆఫ్‌ల ప్రభావం 90-140 మందిపై కనిపించొచ్చొని సమాచారం. తాజా పరిణామాలపై స్పందించడానికి ఓలా నిరాకరించింది.

‘ప్రస్తుతానికి భవిశ్‌ అగర్వాల్‌ రోజువారీ కార్యకలాపాలు చూస్తారు. కొత్త సీఈఓ నియామకం త్వరలోనే జరగనుంద’ని ఆ వర్గాలు తెలిపాయి. ఐపీఓకు రావడం కోసం ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకులతో ఓలా ప్రాథమిక చర్చలను ప్రారంభించిన కొద్ది వారాల్లోనే తాజా పరిణామం చోటు చేసుకోవడం విశేషం. గత నెలలోనే సీఎఫ్‌ఓగా కార్తీక్‌ గుప్తా, సీబీఓగా సిద్ధార్థ్‌ శక్దర్‌లను కంపెనీ నియమించుకుంది.

 ఓలా ఎలక్ట్రిక్‌ రూ.7,250 కోట్ల సమీకరణ కోసం సెబీకి డిసెంబరులో ముసాయిదా పత్రాలను సమర్పించిన విషయం తెలిసిందే. 2021-22 నష్టం రూ.3082.42 కోట్లతో పోలిస్తే.. 2022-23లో ఓలా నష్టం రూ.1082.56 కోట్లకు పరిమితమైన విషయం విదితమే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు