కనీసం 10,000 మంది ఫ్రెషర్లను తీసుకుంటాం

జనరేటివ్‌ ఏఐ(కృత్రిమ మేధ)లో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి తమ కంపెనీ సిద్ధమైందని హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ సీఈఓ విజయ్‌ కుమార్‌ తెలిపారు.

Published : 30 Apr 2024 02:14 IST

ఏఐలో 50,000 మందికి శిక్షణ ఇస్తున్నాం
2024-25పై ఆశావహంగానే ఉన్నాం
3-5% ఆదాయ వృద్ధి అంచనా
హెచ్‌సీఎల్‌ టెక్‌ సీఈఓ విజయ్‌ కుమార్‌

దిల్లీ: జనరేటివ్‌ ఏఐ(కృత్రిమ మేధ)లో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి తమ కంపెనీ సిద్ధమైందని హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ సీఈఓ విజయ్‌ కుమార్‌ తెలిపారు. ఇప్పటికే ఈ విభాగంలో 25,000 మందికి శిక్షణ ఇవ్వగా, మరో 50,000 మందికి ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తి స్థాయి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. క్లౌడ్‌, జెన్‌ఏఐ ప్రాజెక్టులు పెరుగుతున్నా, ఆర్థిక సేవల విభాగంలో మాత్రం ఇబ్బందులు ఎదురుకావొచ్చని ఆయన తెలిపారు. వివిధ అంశాలపై ఆయనేమన్నారంటే..

 పరిస్థితులను బట్టే నియామకాలు: మంచి ఆదాయ వృద్ధి రేటు(5.4%) కారణంగా మార్చి త్రైమాసికంలో  2700 మంది ఉద్యోగులు జతయ్యారు. 2024-25లో పరిస్థితులను బట్టి నియామకాలుంటాయి. ఇప్పటికైతే కనీసం 10,000 మంది తాజా ఉత్తీర్ణుల(ఫ్రెషర్లు)ను తీసుకోవాలని భావిస్తున్నాం. ఆపైన ఎంత మందిని నియమించుకుంటామన్నది పరిస్థితులే నిర్ణయిస్తాయి. జెన్‌ ఏఐ అవకాశాల కోసం కంపెనీ సిద్ధంగా ఉంది. 2000 మందికి పైగా ఏఐ డెవలపర్లనూ తీసుకున్నాం.

ఆర్థిక సేవల విభాగంపై ఒత్తిడి: కంపెనీల ఐటీ వ్యయాలు 2023-24 తరహాలోనే 2024-25లోనూ స్తబ్దుగానే కొనసాగొచ్చు. మాకు లభించిన ఆర్డర్లు బాగున్నందున, వృద్ధికి కచ్చితంగా సహాయపడతాయి. గత ఆర్థిక సంవత్సరంలో సంస్థ రూ.15,702 కోట్ల నికర లాభం (5.7% వృద్ధి), రూ.1,09,913 కోట్ల ఆదాయం (8.3% వృద్ధి) నమోదు చేసింది. 2024-25లో ఆదాయ వృద్ధి 3-5% ఉండొచ్చని అంచనా. ప్రస్తుత పరిస్థితుల్లో ఇతర కంపెనీలో పోలిస్తే ఇదే అత్యధిక ఆదాయ వృద్ధి అంచనాగా భావించొచ్చు. జెన్‌ఏఐ ఆధారిత సైబర్‌ భద్రత, డేటా, క్లౌడ్‌ ఇమిగ్రేషన్‌, ప్రైవేటు ఏఐ స్టాక్‌ల నిర్మాణం తదితర విభాగాల్లో ఆర్డర్లు పెరిగే అవకాశం ఉంది. టెక్నాలజీ, టెలికాం, మీడియా విభాగాల్లోనూ ఆసక్తి కనిపిస్తోంది. ఆర్థిక సేవల్లో మాత్రం కొంత సమస్యలు కనిపిస్తున్నాయి.

కొనుగోళ్లకు సిద్ధం: బలమైన వార్షిక ఆదాయాలు, క్లయింట్లను అందించగల సెమీకండక్టర్‌, ఆటోమోటివ్‌ ప్లాట్‌ఫారాలను కొనుగోలు చేయడానికి కంపెనీ సిద్ధంగా ఉంది. కొన్ని త్రైమాసికాల కిందట ఆటోమోటివ్‌ రంగంలో కొనుగోలు చేశాం. ఇక సెమీకండక్టర్‌, ఇతరత్రా విభాగాల్లో చిన్న పాటి కొనుగోళ్లపై దృష్టి సారిస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని