ఐవీఎంఏ అధ్యక్షుడిగా డాక్టర్‌ కృష్ణ ఎల్ల

 భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ కృష్ణ ఎల్ల, ఇండియన్‌ వ్యాక్సిన్‌ మ్యానుఫ్యాక్చరర్స్‌ అసోసియేషన్‌ (ఐవీఎంఏ) నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

Updated : 30 Apr 2024 06:46 IST

ఈనాడు, హైదరాబాద్‌:  భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ కృష్ణ ఎల్ల, ఇండియన్‌ వ్యాక్సిన్‌ మ్యానుఫ్యాక్చరర్స్‌ అసోసియేషన్‌ (ఐవీఎంఏ) నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. రెండేళ్ల పాటు ఆయన ఈ బాధ్యతలు నిర్వహిస్తారు. ఇప్పటి వరకు ఈ పదవిలో సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఎండీ అదార్‌ పూనావాలా ఉన్నారు. ఆయన నుంచి డాక్టర్‌ కృష్ణ ఎల్ల బాధ్యతలు చేపట్టారు. ఐవీఎంఏ ఉపాధ్యక్షురాలిగా బయోలాజికల్‌ ఇ.లిమిటెడ్‌ ఎండీ మహిమా దాట్ల, కోశాధికారిగా భారత్‌ బయోటెక్‌ సీఎఫ్‌ఓ టి.శ్రీనివాస్‌లను ఎన్నుకున్నారు. ఐవీఎంఏ డైరెక్టర్‌ జనరల్‌గా డాక్టర్‌ హర్షవర్థన్‌ కొనసాగుతారు.

ప్రమాణాలు మెరుగుపరిస్తే ప్రపంచవ్యాప్త సరఫరా:  ప్రజారోగ్యానికి టీకాలు ఎంతో అవసరమని, ప్రజలందరికీ అవసరమైన టీకాలు అందించడమే ఐవీఎంఏ ప్రధాన లక్ష్యమని డాక్టర్‌ కృష్ణ ఎల్ల పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ), అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ యూఎస్‌ఎఫ్‌డీఏ ప్రమాణాలకు అనుగుణంగా మనదేశంలో టీకాల తయారీ సంస్థలు సిద్ధం కావాలని, తద్వారా ప్రపంచ మార్కెట్లో క్రియాశీలక పాత్ర పోషించే అవకాశం మనకు దక్కుతుందని ఆయన వివరించారు. ఆఫ్రికా దేశాలకు టీకాల అవసరాలు ఎంతో ఎక్కువని గుర్తు చేశారు. టీకాల ఉత్పత్తి ప్రక్రియలను మెరుగుపరచడానికి, కొత్త టీకాలను ఆవిష్కరించడానికి టీకాల ఉత్పత్తిదారులు, పరిశోధనా సంస్థల మధ్య అవసరమైన భాగస్వామ్యాలు కుదుర్చుకోవాలని సూచించారు. అంకుర సంస్థలను ప్రోత్సహించాలని అన్నారు.

 2010లో ఏర్పాటు: టీకా ఉత్పత్తిదార్ల తరఫున ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు నిర్వహించే లక్ష్యంతో ఐవీఎంఏ 2010లో హైదరాబాద్‌ కేంద్రంగా ఏర్పాటైంది. భారత్‌ బయోటెక్‌, సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, బయోలాజికల్‌ ఇ.లిమిటెడ్‌, పానేషియా బయోటెక్‌ లిమిటెడ్‌, ఇండియన్‌ ఇమ్యూనలాజికల్స్‌ లిమిటెడ్‌ ఇందులో సభ్య సంస్థలుగా ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని