EPFO: అధిక పింఛనుపై ఆశలు

ఉద్యోగుల భవిష్యనిధి పింఛను పథకం (ఈపీఎస్‌)- 2014 సవరణపై సుప్రీంకోర్టు తాజా తీర్పుతో గరిష్ఠ వేతన పరిమితి రూ.15 వేల కన్నా ఎక్కువ వేతనం పొందుతూ ఇప్పటివరకు పింఛను పథకంలో చేరని ఉద్యోగులకు వెసులుబాటు కలిగింది.

Updated : 06 Nov 2022 12:20 IST

ఈపీఎఫ్‌ చందాదారుల ఆప్షన్‌కు నాలుగు నెలల గడువు
సుప్రీం ఆదేశాలతో కార్యాచరణ మొదలు
ఈపీఎస్‌ వాటా 12 శాతానికి పెరగనుందా?

ఈనాడు, హైదరాబాద్‌: ఉద్యోగుల భవిష్యనిధి పింఛను పథకం (ఈపీఎస్‌)- 2014 సవరణపై సుప్రీంకోర్టు తాజా తీర్పుతో గరిష్ఠ వేతన పరిమితి రూ.15 వేల కన్నా ఎక్కువ వేతనం పొందుతూ ఇప్పటివరకు పింఛను పథకంలో చేరని ఉద్యోగులకు వెసులుబాటు కలిగింది. 2014 సవరణకు ముందు అధిక పింఛను పొందేందుకు ఈపీఎస్‌లో చేరని వారికి సుప్రీంకోర్టు మరికొంత సమయమిచ్చింది. నాలుగు నెలల్లోగా యజమానితో కలిసి ఉమ్మడిగా ఆప్షన్‌ ఇవ్వాలని సూచించింది. ఉమ్మడి ఆప్షన్‌ ఇచ్చిన తరువాత ఈపీఎఫ్‌ ఖాతాలో నగదును ఈపీఎస్‌లోకి మళ్లించాలని సూచించింది. సుప్రీంకోర్టు తీర్పును అధ్యయనం చేస్తున్న ఈపీఎఫ్‌వో త్వరలోనే అందులోని మార్గదర్శకాల మేరకు నోటిఫికేషన్‌ జారీ చేయాలని భావిస్తోంది. ఈపీఎస్‌లో చేరేందుకు వేతనం (బేసిక్‌+ డీఏ)పై ప్రస్తుతమున్న 8.33 శాతం వాటాను 12 శాతానికి పెంచడంపై అధ్యయనం చేస్తోంది. యజమాని చెల్లించే 12 శాతం మొత్తాన్ని ఈపీఎస్‌లోకి మళ్లించేలా సవరణ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

గడువు తేదీ లేకపోవడంతో...

ఈపీఎఫ్‌ చట్టంలోని పేరా 11(3) ప్రకారం 2014 నాటి సవరణకు ముందు గరిష్ఠ వేతన పరిమితి రూ.6500గా ఉంది. అంతకు మించి పొందుతున్న ఉద్యోగులు ఈపీఎస్‌లో చేరేందుకు ఆ వేతనంపై 8.33 శాతం పూర్తిగా ఈపీఎస్‌లో జమ చేయాలి. కానీ ఉద్యోగులు ఈ పథకంలో చేరేందుకు గరిష్ఠ గడువు తేదీ ఏమీ చెప్పలేదు. 2014లో గరిష్ఠ వేతన పరిమితిని రూ.15 వేలకు పెంచుతూ సవరణ చేసింది. దీనికి ముందు ఆప్షన్‌ ఇచ్చిన ఉద్యోగులు.. ఆరు నెలల్లోగా అధికవేతనంపై ఈపీఎస్‌లో చేరేందుకు ఆప్షన్‌ ఇవ్వాలని సూచించింది. అప్పుడు ఆప్షన్‌ ఇవ్వని వారికి మరో అవకాశం కల్పిస్తూ సుప్రీంకోర్టు తాజాగా ఉత్తర్వులిచ్చింది.

ఆ పింఛనుదారులకు ఎలా?

గతంలో సుప్రీంకోర్టు తీర్పు మేరకు 2014 సెప్టెంబరు 1 కన్నా ముందు ఆప్షన్‌ ఇవ్వకుండా పదవీ విరమణ చేసిన ఉద్యోగులు ఆప్షన్‌ ఇచ్చి, ఈపీఎస్‌ మొత్తాన్ని ఈపీఎఫ్‌వోకు చెల్లించారు. ఆ మేరకు అధికవేతనంపై ఎక్కువ పింఛను పొందుతున్నారు. ఈపీఎఫ్‌వో సుప్రీంకోర్టును ఆశ్రయించిన తరువాత అధిక పింఛను చెల్లింపులను నిలిపివేశారు. తాజాగా ఇచ్చిన తీర్పుతో ఆ పింఛనుదారులకు ప్రయోజనం వర్తింపచేయాలా? లేదా? అనే విషయమై ఈపీఎఫ్‌వో న్యాయనిపుణులతో సంప్రదింపులు చేస్తోంది.

అధిక పింఛను ప్రయోజనమిలా...

అధిక పింఛను పొందాలనుకునేవారు ఈపీఎస్‌లో చేరేందుకు యజమానితో కలిసి ఉమ్మడి ఆప్షన్‌ ఇవ్వాలి. దీని ప్రకారం మూలవేతనం, డీఏ కలిపిన మొత్తంలో 8.33 శాతం ఈపీఎస్‌లో చెల్లించాలి. ఉదాహరణకు ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగి 25 ఏళ్ల సర్వీసు పూర్తిచేసుకుని ఉద్యోగ విరమణ చేశారు. ఆయనకు గత అయిదేళ్ల సగటు నెల వేతనం రూ.25 వేలు. అధిక పింఛను ఆప్షన్‌ ఇవ్వకుంటే అతనికి గరిష్ఠ వేతన పరిమితిని రూ.15 వేలుగా పరిగణిస్తారు. దానిపై పింఛను నెలకు రూ.3292 అందుతుంది. అధిక వేతనం రూ.25 వేలపై ఈపీఎస్‌ చెల్లించేలా ఆప్షన్‌ ఇచ్చి, ఆ మేరకు ఈపీఎస్‌కు అదనపు చందా జమచేస్తే నెలకు రూ.8928 పింఛను అందుతుంది.


ఆప్షన్‌తో పింఛను పెంపు.. ఈపీఎఫ్‌లో జమ తగ్గింపు

అధిక వేతనంపై ఈపీఎస్‌ చెల్లించేలా ఉద్యోగి ఆప్షన్‌ ఇస్తే అతనికి వచ్చే పింఛను పెరుగుతుంది. కానీ ఉద్యోగి ఈపీఎఫ్‌ ఖాతాలో జమయ్యే నగదు తగ్గుతుంది. ఉద్యోగి వాటాగా వేతనంపై 12 శాతం, యజమాని వాటా 12 శాతం చెల్లిస్తారు. ఉద్యోగి వాటా పూర్తిగా ఈపీఎఫ్‌ ఖాతాలో జమవుతుంది. యజమాని వాటా నుంచి 8.33 శాతం పింఛను పథకంలో, మిగతా మొత్తం ఈపీఎఫ్‌ ఖాతాలో జమవుతాయి.

*  ఉదాహరణకు ఒక ఉద్యోగి వేతనం (బేసిక్‌ + డీఏ) రూ.30 వేలు ఉందనుకుందాం. ఇందులో ఉద్యోగి వాటా రూ.3600 ఈపీఎఫ్‌ ఖాతాలో జమవుతాయి. యజమాని వాటా కింద రూ.3600 ఉంటాయి. ఆప్షన్‌ ఇవ్వకుంటే (గరిష్ఠ వేతన పరిమితి రూ.15 వేలుగా తీసుకుంటారు) ఇందులో 8.33 శాతం కింద రూ.1250 ఈపీఎస్‌ ఖాతాలోకి వెళ్తాయి. మిగతా రూ.2350 ఉద్యోగి ఖాతాలో జమవుతాయి. అంటే నెలకు ఉద్యోగి, యజమాని వాటా కింద ఈపీఎఫ్‌ ఖాతాలో రూ.5950 ఉంటాయి. పదవీ విరమణ తరువాత వచ్చే పింఛను తగ్గుతుంది.

*  ఒకవేళ ఆప్షన్‌ ఇస్తే.. వేతనంలో 8.33 శాతం కింద రూ.2499 ఈపీఎస్‌ ఖాతాలోకి వెళ్తాయి. మిగతా రూ.1101 ఉద్యోగి ఖాతాలోకి వస్తాయి. అంటే యజమాని వాటాతో కలిసి ఈపీఎఫ్‌ ఖాతాలో నెలకు రూ.4701 జమవుతాయి. పదవీ విరమణ తరువాత వచ్చే పింఛను పెరుగుతుంది. అధికవేతనంపై పింఛను పొందేందుకు ఆప్షన్‌ ఇచ్చేవారికి యజమాని చెల్లించే 12 శాతం పూర్తిగా ఈపీఎస్‌లో జమ చేసే ఆలోచన జరుగుతోంది. ఇది అమలైతే.. యజమాని వాటా మొత్తం పింఛను పథకంలోకి వెళ్తుంది. ఈపీఎఫ్‌ ఖాతాలో కేవలం ఉద్యోగి చందా మాత్రమే జమ అవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని