మీ ఇంటికే వస్తాం.. వంట చేస్తాం

ఇంట్లో పుట్టిన రోజు వేడుకో.. ఏదైనా చిన్నపాటి శుభకార్యాలు నిర్వహించుకోవడం మామూలే. పది ఇరవై మందితో నిర్వహించుకునే ఈ ఆనందాన్ని ఆహారం రెట్టింపు చేస్తుంది.

Updated : 26 Mar 2023 13:35 IST

ఈనాడు - హైదరాబాద్‌

ఇంట్లో పుట్టిన రోజు వేడుకో.. ఏదైనా చిన్నపాటి శుభకార్యాలు నిర్వహించుకోవడం మామూలే. పది ఇరవై మందితో నిర్వహించుకునే ఈ ఆనందాన్ని ఆహారం రెట్టింపు చేస్తుంది. కానీ, రకరకాల వంటలు చేయడం అంటే కొంత ఇబ్బందే. బయట నుంచి తీసుకొచ్చే అవకాశం ఉన్నా.. ప్యాకేజింగ్‌, రవాణా సమయంలో అవి సహజ రుచిని కోల్పోతాయి. పైగా ఖరీదూ ఎక్కువే. ఈ ఇబ్బందులన్నీ తీర్చేలా చిన్న, చిన్న వేడుకల కోసం ఎవరైనా ఇంటికే వచ్చి వంట చేసిస్తే బాగుంటుంది కదా.. అనే ఆలోచనతో వచ్చిన అంకురమే ‘బుక్‌మైచెఫ్‌’. హోటళ్లలో లభించే అనేక రుచులను ఇంటిలోనే ఆస్వాదించాలనుకునే వారి కోసమే మా ఈ ప్రయత్నం అంటున్నారు సంస్థ సహ వ్యవస్థాపకులు శంకర్‌ కృష్ణమూర్తి. తమ సంస్థ గురించి ఇలా వివరిస్తున్నారు..

‘ఎంతో అనుభవం ఉన్న వంట నిపుణులు మన దగ్గర ఉన్నారు. వీరిని ఒక వేదికపైకి తీసుకురావడం, అవసరం ఉన్న వారికి వీరి సేవలను అందించడం లక్ష్యంగా దీన్ని ప్రారంభించాం. కొవిడ్‌ లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత మా అబ్బాయి పుట్టిన రోజును కొంతమంది సమక్షంలో నిర్వహించాలని అనుకున్నాం. కానీ, తక్కువ మందికి భోజనం సరఫరా చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. నేను హోటల్‌ రంగంలోనే ఉండటంతో, నాకు తెలిసిన కొంతమంది చెఫ్‌లను పిలిచి, అప్పటికప్పుడు రుచికరమైన వంటలు చేయించాను. అక్కడికి వచ్చిన వారందరికీ ఇది నచ్చింది. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లే ఆలోచనతో ప్రమోద్‌ జయవరపు, వరుణ్‌ రెడ్డిలు వ్యవస్థాపకులుగా నేను సహ వ్యవస్థాపకుడిగా ‘బుక్‌మైచెఫ్‌’ను ప్రారంభించాం.

ఏం చేస్తామంటే...

ఎక్కడికైనా వెళ్లినపుడు అక్కడి ఆహార పదార్థాలు మనకు నచ్చుతాయి. కానీ, వాటిని ఇంట్లో తయారు చేసుకోవడం సాధ్యం కాకపోవచ్చు. 10, 20 మందిని భోజనానికి పిలిచినపుడూ క్యాటరింగ్‌ లాంటివి కుదరవు. ఇలాంటి సమస్యలన్నింటినీ పరిష్కరించేలా సేవలను అందిస్తున్నాం. అవసరం ఉన్నవారు మా యాప్‌ ద్వారా వంట నిపుణులను ఎంచుకోవచ్చు. కనీసం ఇద్దరి కోసమూ వంట చేయించుకునే వీలుంది. దేశ, విదేశీ ఆహార పదార్థాలు ఏవి కావాలన్నా మీ ఇంటి దగ్గర మీ కళ్లముందే సిద్ధం చేసి మా చెఫ్‌లు అందిస్తారు. అందులో వాడుతున్న వస్తువులు ఏమిటి అన్నదీ తెలుస్తుంది. సాధారణంగా సెలబ్రిటీలకు చెఫ్‌లు ప్రత్యేకంగా ఉంటారు. వీరి కోసమూ ప్రత్యేక సేవలను ప్రారంభించాం. మా ప్లాట్‌ఫాంలో చెఫ్‌లను చేర్చుకునేటప్పుడే అనుభవం, వారి నైపుణ్యాలను పూర్తి స్థాయిలో పరిశీలిస్తాం.

మీ ఇష్టానుసారంగా..

మీకు ఏ ఆహార పదార్థాలు కావాలి అనేది జాబితా నుంచి ఎంపిక చేసుకోవచ్చు. దీని ఆధారంగానే ఎంత రుసుము వసూలు చేయాలన్నది నిర్ణయిస్తాం. వ్యక్తుల సంఖ్యను బట్టి నిర్ణీత రుసుము ఉంటుంది. ఆ తర్వాత ప్రతి పదార్థానికీ ప్రత్యేకంగా కొంత చెల్లించాలి. వస్తువులను సొంతంగా తెచ్చుకోవచ్చు. మమ్మల్ని అడిగినా సమకూరుస్తాం. చెఫ్‌లతో పాటు అవసరమైతే వడ్డించేవారు, శుభ్రం చేసేవారినీ పంపిస్తాం.

విస్తరణ ప్రణాళికల్లో..

సొంత పెట్టుబడితో సంస్థను ప్రారంభించాం. ఇప్పటి వరకూ రూ.2 కోట్ల మేరకు పెట్టుబడులను విక్రం రెడ్డి (యూవీ క్రియేషన్స్‌ ఫండ్‌), రోనిత్‌ రెడ్డి (గంగా కావేరీ వెంచర్స్‌) నుంచి సమీకరించాం. ప్రస్తుతం మా దగ్గర 40 మందికి పైగా చెఫ్‌లు ఉన్నారు. ముంబయి, దిల్లీతో పాటు ఇతర నగరాలకూ విస్తరించబోతున్నాం. ఈ ఏడాది చివరి నాటికి 400 మందిని మా యాప్‌లోకి తీసుకొస్తాం. దీంతోపాటు యాప్‌ను మరింత అభివృద్ధి చేయబోతున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని